Kavitha| బీసీ రిజర్వేషన్లపై ఆర్డినెన్స్ కరెక్టే.. బీఆరెస్ వాళ్లు నాదారికి రావాల్సిందే : ఎమ్మెల్సీ కవిత

Kavitha| బీసీ రిజర్వేషన్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ నిర్ణయం సరైందేనని బీఆరెస్ ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేశారు. బీఆరెస్ నేతలు ఆర్డినెన్స్ వద్దని చెప్పడం తప్పు అని అన్నారు. కొంత టైమ్ తీసుకున్నా.. బీసీ రిజర్వేషన్లపై బీఆరెస్ వాళ్లు నాదారికి రావాల్సిందేనని వ్యాఖ్యానించారు. 2018 చట్ట సవరణ చేసి ఆర్డినెన్స్ తేవడం సబబే అని కవిత చెప్పారు. తాను ఉత్తగనే మాట్లాడలేదని, న్యాయనిపుణులతో చర్చించిన తర్వాతనే ఆర్డినెన్స్ కు సపోర్ట్ చేశానని కవిత చెప్పారు. తీన్మార్ మల్లన్న తనపై చేసిన ఆరోపణల పై బీఆర్ఎస్ నాయకులు స్పందించలేదని, అది వారి విజ్ఞతకే వదిలేస్తున్నానని కవిత చెప్పారు.
గోదావరి నీళ్లను చంద్రబాబుకు గిఫ్ట్‌గా ఇచ్చిన రేవంత్, ఉత్తమ్‌లు
బనకచర్ల ప్రాజెక్టు నిర్మాణ పరిశీలనకు కమిటీకి అంగీకరించి తెలంగాణ ప్రయోజనాలను ఏపీకి తాకట్టుపెట్టిన సీఎం రేవంత్ రెడ్డి వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. ఢిల్లీలో జరిగిన తెలుగు రాష్ట్రాల సీఎంల సమావేశంలో రేవంత్ రెడ్డి వైఖరిని తీవ్రంగా తప్పుబట్టారు. సీఎంల సమావేశం ఎజెండాలో బనకచర్ల లేదని చెప్పిన రేవంత్ రెడ్డి మాటలకు భిన్నంగా సమావేశంలో మొట్టమొదటి చర్చ బనకచర్ల ప్రాజెక్టు మీద జరిగిందని కవిత ఆరోపించారు. బనకచర్ల సహా తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాల పరిష్కారానికి కమిటీకి అంగీకరించిన సీఎం రేవంత్ రెడ్డి, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలు తెలంగాణ వాటా గోదావరి నీళ్లను తీసుకెళ్లి చంద్రబాబుకు గిఫ్ట్ ఇచ్చి వచ్చారని కవిత విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి బనకచర్లపై చర్చ జరుగలేదని అబద్దాలు చెప్పారని మండిపడ్డారు. తెలంగాణ హక్కులను చంద్రబాబు నాయుడు కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టిన రేవంత్ రెడ్డికి అస్సలు తెలంగాణను పరిపాలించే హక్కు లేదన్నారు. వెంటనే రేవంత్ రెడ్డి తన పదవికి రాజీనామా చేయాలని కవిత డిమాండ్ చేశారు.