Hydra Police Station | 8న హైడ్రా పోలీస్ స్టేషన్ ప్రారంభం
ప్రభుత్వ స్థలాలు, పార్కులు, చెరువుల ఆక్రమణల నిరోధానికి ఏర్పాటు చేసిన హైడ్రాకు ప్రత్యేకంగా పోలీస్ స్టేషన్‌ను బుద్ధభవన్‌లో ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మే 8న దానిని ప్రారంభించనున్నారు.

- బుద్ధ భవన్‌లోని బీ బ్లాక్‌లో ఠాణా
- ఇక ఇక్కడ ఫిర్యాదుల స్వీకరణ
- ప్రభుత్వ స్థలాల కబ్జా కేసులు బదిలీ
Hydra Police Station | హైడ్రా ప్రత్యేక పోలీస్ స్టేషన్‌ను సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల 8వ తేదీన ప్రారంభించనున్నారు. చెరువులు, పార్కులు, ప్రభుత్వ స్థలాల కబ్జాలపై ఇకపై హైడ్రా పోలీస్ స్టేషన్ లో కేసుల నమోదు, విచారణ కొనసాగనుంది. అలాగే కబ్జాలు, భూవివాదాలకు సంబంధించి ఇప్పటికే సాధారణ పోలీస్ స్టేషన్ లలో నమోదు అయిన కేసులను హైడ్రా పోలీస్ స్టేషన్ కు బదిలీ చేయనున్నట్లుగా సమాచారం. బుద్ధభవన్‌లోని బీ-బ్లాక్‌లో హైడ్రా పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేశారు. హైదరాబాద్ విపత్తు స్పందన, ఆస్తుల పర్యవేక్షణ, పరిరక్షణ ఏజెన్సీ (హైడ్రా) ఏర్పాటుకు, విస్తృత అధికారాలు కల్పించేందుకు ప్రభుత్వం జీహెచ్‌ఎంసీ చట్టం 1955ను సవరించింది. నగరంలోని జలాశయాలు, ఇతర ఆస్తులను కాపాడేందుకు అధికారిని లేదా సంస్థను ఏర్పాటు చేసే అధికారాన్ని ప్రభుత్వానికి కట్టబెడుతూ.. జీహెచ్ఎంసీ చట్టంలో కొత్తగా 374 బి సెక్షన్‌ను చేర్చింది. ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణకు హైడ్రా విధులు నిర్వహిస్తుంది. ప్రతి సోమవారం బుద్ధభవన్‌లో ప్రజల నుంచి ఫిర్యాదులు తీసుకుంటున్నారు. నాలాలు, చెరువులు, పార్కులు ఆక్రమణలపై ఫిర్యాదులు ఇవ్వొచ్చని హైడ్రా అధికారులు పేర్కొన్నారు.