Ippa Puvvu Laddu : మేడారం స్పెషల్ … ఇప్పపువ్వు లడ్డు
మేడారం జాతరలో ఆదివాసీ మహిళలు తయారు చేసిన ఇప్పపువ్వు లడ్డు విశేష ఆదరణ పొందుతోంది. ఇప్పటికే రూ.3 లక్షల వ్యాపారం జరగగా, 10 స్టాల్స్ ద్వారా అమ్మకాలు సాగుతూ మహిళలకు ఆర్థిక భరోసా కల్పిస్తోంది.
విధాత, ప్రత్యేక ప్రతినిధి: వనదేవతలు సమ్మక్క, సారలమ్మలు కొలువైన మేడారం మహా జాతరలో ఇప్పుపువ్వు లడ్డు ప్రత్యేకతను సంతరించుకున్నది. ఇప్పపువ్వు లడ్డును జనం ఆదరిస్తున్నారు. ఈ మేరకు అమ్మకాలు సైతం ఆశించిన స్థాయిలో సాగుతున్నాయి. ఇప్పటి వరకు రూ. 3లక్షల వ్యాపారం జరిగింది. రానున్న రోజుల్లో ఈ ఇప్పపుప్పు లడ్డులకు మంచి గిరాకీ లభించనున్నది. తొలిసారిగా ప్రత్యేకంగా గిరిజన మహిళ సంఘం ఆధ్వర్యంలో తయారుచేసిన అత్యంత పోషకాలు కలిగిన ఇప్పపువ్వు లడ్డు మేడారం వచ్చే భక్తులకు అందుబాటులోకి తీసుకొచ్చారు. దీని కోసం మేడారం పరిసరాల్లో 10 స్టాల్లను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఈ లడ్డూ రుచిని రాష్ట్ర కేబినెట్ సమావేశంలో మంత్రులకు పంపిణీ చేశారు. ఈ లడ్డూ రుచిని మంత్రుల ఆస్వాదించారు. ఈ లడ్డూల తయారీ, అమ్మకం మహిళలకు ఆర్ధిక ప్రయోజనాన్ని కలిగిస్తోంది. జనవరి 13వ తేదీన ఇప్పపువ్వు లడ్డు స్టాల్స్ లను మంత్రి దనసరి అనసూయ సీతక్క ప్రారంభించింది.
ఇప్పపువ్వు లడ్డుతో లాభాలు
ఇప్పపువ్వు లడ్డు ద్వారా అధిక ప్రయోజనాలు చేకూరుతాయని నిపుణులు చెప్తున్నారు. జీర్ణ క్రియ మెరుగుపరుస్తోంది. రోగ నిరోధక శక్తిని పెంచుతోంది. కొలెస్ట్రాల్ తగ్గించడం, అధిక శక్తిని పొందడం, బరువు నియంత్రణతో పాటు డయాబెటిస్ తగ్గించడంలో ఉపయోగం. పూర్వకాలంలో ఆదివాసి గిరిజనులు ఇప్పపువ్వును అనేక వ్యాధులకు ముందుగా ఉపయోగించేవారని చెబుతున్నారు. ఇప్పటికీ గుత్తి కోయ గూడాలలో వారి పిల్లలకు ఇప్పపువ్వు కుడుములు లడ్డూలు తినిపించడం వల్ల పిల్లలు పౌష్టికంగా బలంగా ఉంటారని గిరిజనులు చెప్తున్నారు. ఇందులో ఉండే ఫైబర్ విటమిన్లు ఖనిజాలు పోషకాలు గర్భిణీ స్త్రీలకు ఎంతగానో మేలు చేస్తుందని పుట్టబోయే బిడ్డ ఆరోగ్యకరంగా జన్మిస్తారని చెప్తున్నారు.
గిరిజన మహిళలకు ఆర్థిక అండ
తెలంగాణ సమగ్ర జీవనోపాధి కార్యక్రమంలో భాగంగా గ్రామీణ పేదరిక నిర్మూలన సంఘం ద్వారా 12 మంది గిరిజన మహిళలతో ప్రత్యేకంగా సమ్మక్క, సారలమ్మ మహిళ రైతు ఉత్పత్తుల సంఘం ఏర్పాటుచేశారు. ఉట్నూర్ ఐటిడిఏ నుంచి వచ్చిన ప్రత్యేక బృందం ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని రాష్ట్ర గవర్నర్ దత్తత గ్రామం కొండపర్తి గ్రామంలో ఇప్పపువ్వు లడ్డు తయారీ, క్రయ విక్రయాల గురించి ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి శిక్షణ అందించారు. అక్కడే తయారీ యూనిట్ ను ప్రారంభించారు. ఈసం మంగవేణి, ఇర్ప మంజుల , ఇర్ప మౌనిక,ఈసం సాంబలక్ష్మి, ఈసం వరలక్ష్మి వీరి ఆధ్వర్యంలో సమ్మక్క, సారలమ్మ మహిళ రైతు ఉత్పత్తుల సంఘం ఏర్పాటు చేసి ఎంఎస్ఎమ్ఈ లో రిజిస్ట్రేషన్ చేసి ప్రత్యేకంగా ఫుడ్ లైసెన్స్ కూడా తీసుకున్నారు. వీరికి తోడు కన్నేపల్లి గ్రామానికి చెందిన చెరుప నాగమణి, గొండి అనురాధ, గొండి మాణిక్యం, గొండి స్వరూప ఆధ్వర్యంలో అమ్మ ఫుడ్ ప్రొడక్ట్స్ ఏర్పాటు చేశారు. దీనికి ఫుడ్ లైసెన్స్ పొందారు. ఇప్పపువ్వు లడ్డూల ఒక బాక్స్ లో 250 గ్రాములతో రూ. 150 లభిస్తోంది. ఇప్పపువ్వు లడ్డూల తయారీ, అమ్మకాలకు సహకరిస్తున్న మంత్రి అనసూయ సీతక్కకు, ములుగు జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ కు, డి ఆర్ డి ఏ అధికారులకు మహిళలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు
ఇవి కూడా చదవండి :
గజదొంగకు ముగ్గురు స్టువర్టుపురం దొంగల తోడు : ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఘాటు వ్యాఖ్యలు
HYD to BNG – NH-44 | రూపుమారిన హైదరాబాద్-బెంగళూరు హైవే – గ్రీన్ఫీల్డ్ నుండి యాక్సెస్ కంట్రోల్డ్ : 5 గంటలే ప్రయాణం
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram