CM Revanth Reddy | మూసీ ప్రక్షాళనకు ప్రపంచ బ్యాంకు నిధులు.. రేపు బ్యాంకు అధ్యక్షుడితో రేవంత్‌రెడ్డి భేటీ
తెలంగాణ రాష్ట్రంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షించేందుకు ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి బృందం అమెరికా దేశంలో మూడు రోజులుగా పర్యటిస్తున్నది

డీపీఆర్‌ను రూపొందిస్తున్న మున్సిపల్ శాఖ
విధాత, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షించేందుకు ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి బృందం అమెరికా దేశంలో మూడు రోజులుగా పర్యటిస్తున్నది. నాలుగో రోజు పర్యటనలో భాగంగా పలువురు పారిశ్రామిక పెద్దలతో రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. వాషింగ్టన్ డీసీలో గురువారం ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడితో భేటీ కానున్నారు. మూసీ ప్రక్షాళన కార్యక్రమానికి ప్రపంచ బ్యాంకు నుంచి రుణాలు తీసుకోవాలనే నిర్ణయంలో తెలంగాణ ప్రభుత్వం ఉంది. రుణం తీసుకునేందుకు మున్సిపల్ శాఖ సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) రూపొందిస్తున్నది.
మూసీ ప్రాజెక్టు ప్రాధాన్యం, సుందరీకరణ పనులు, అభివృద్ధి మూలంగా నగర రూపురేఖలు మారడంతో పాటు పర్యాటక ప్రాంతంగా విరాజిల్లే అవకాశం ఉందని రేవంత్ ప్రపంచ బ్యాంకు ప్రతినిధులకు వివరించనున్నారు. అసెట్ మేనేజిమెంట్ టెక్నాలజీ సర్వీసెస్, అడ్వాన్స్‌డ్ డాటా ఆపరేషన్స్‌లో ఆర్సీసీఎం తెలంగాణలో కంపెనీ ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చింది. ఆర్సీసీఎం సీఈవో గౌరవ్ సూరి, రేవంత్ రెడ్డి సమక్షంలో కంపెనీ ఏర్పాటుపై ఒప్పందం కుదిరింది. అమెరికా దేశం వెలుపల తొలిసారి తమ కంపెనీ విస్తరిస్తున్నట్లు సూరి వివరించారు. గొప్ప టాలెంట్ ఫోర్స్, సహజసిద్ధ లొకేషన్, నిపుణులైన ఉద్యోగులు అందుబాటులో ఉండటంతో హైదరాబాద్‌లో డాటా సొల్యూషన్ సర్వీసులను అభివృద్ధి చేస్తున్నామని ఆయన వెల్లడించారు. వచ్చే రెండేళ్లలో హైదరాబాద్లో 500 మంది అత్యాధునికి సాంకేతిక నైపుణ్యం కలిగిన వారికి ఉద్యోగాలు వస్తాయని గౌరవ్ సూరి తెలిపారు