CM REVANTH REDDY | గ‌ద్ద‌ర్ అవార్డుల‌పై సినీ ప‌రిశ్ర‌మ స్పంద‌నేది? సీఎం రేవంత్ అసంతృప్తి

గద్దర్ అవార్డులపై రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనలపై తెలుగు సినీ పరిశ్రమ పెద్దల నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం బాధకరమంటూ టాలీవుడ్ సినీ ఇండస్ట్రీపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడంపై సినీ పెద్దలు ఒక్కొక్కరు స్పందిస్తున్నారు

CM REVANTH REDDY | గ‌ద్ద‌ర్ అవార్డుల‌పై సినీ ప‌రిశ్ర‌మ స్పంద‌నేది?  సీఎం రేవంత్ అసంతృప్తి

విధాత, హైదరాబాద్ : గద్దర్ అవార్డులపై రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనలపై తెలుగు సినీ పరిశ్రమ పెద్దల నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం బాధకరమంటూ టాలీవుడ్ సినీ ఇండస్ట్రీపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడంపై సినీ పెద్దలు ఒక్కొక్కరు స్పందిస్తున్నారు. సోమవారం ప్రముఖ తమిళ రచయిత, ఉద్యమకారుడు శివశంకరికి ‘విశ్వంభర డాక్టర్‌ సి. నారాయణరెడ్డి జాతీయ సాహిత్య పురస్కారం’ ప్రధానోత్సవం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి కీలక గద్దర్ అవార్డుల అంశాన్ని ప్రస్తావించారు. తెలుగు చిత్ర పరిశ్రమలో చేసిన కృషికి, విజయాలకు గౌరవంగా గద్దర్ అవార్డులను అందిస్తామని ఈ ఏడాది జనవరిలో తాను ప్రకటించానని, గద్దర్ అవార్డులపై రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనపై సినీ పరిశ్రమ మౌనంగా ఉందని, తెలుగు చిత్ర పరిశ్రమ స్పందన లేకపోవడం అసంతృప్తికి గురి చేసిందన్నారు. ప్రభుత్వం ప్రకటించినట్లుగా గద్దర్ జయంతి సందర్భంగా డిసెంబర్ 9న గద్దర్‌ అవార్డులను అందిస్తామని చెప్పారు. కాని ఏ కారణం చేతనో ఈ విషయంలో సినీ పెద్దలు ఎవరు ఎలాంటి ప్రతిపాదనలతో తన వద్ధకు రాకపోవడం బాధకరమన్నారు. ఈ కొత్త కార్యక్రమాన్ని ఎలా సమర్థవంతంగా అమలు చేయాలనే దానిపై అభిప్రాయాలను, సూచనలను అందించాలని సీఎం రేవంత్ రెడ్డి తెలుగు చిత్ర పరిశ్రమను కోరారు.

స్పందించిన చిరంజీవి..తమ్మారెడ్డి భరద్వాజ

గద్దర్ అవార్డులపై తెలుగు సినీ పరిశ్రమ స్పందించలేదంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మెగాస్టార్, పద్మవిభూషణ్ చిరంజీవి, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజలు వేర్వేరుగా స్పందించారు. పద్మ విభూషణ్ అవార్డు తీసుకున్న సందర్భంగా ఏర్పాటు చేసిన సన్మాన సభలో చిరంజీవి మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి గద్దర్ పేరిట సినిమా అవార్డులను పునరుద్ధరిస్తూ ప్రకటించడం అభినందనీయమన్నారు. ఈరోజు తెలుగు సినిమాలు ప్రపంచ స్థాయిలో గుర్తింపు దక్కుతున్న క్రమంలో ప్రభుత్వ పరంగా ప్రొత్సాహం అందితే తెలుగు సినిమా మరింత ముందుకెలుతుందని, అది గుర్తెరిగిన సీఎం రేవంత్‌ రెడ్డి ప్రజాగాయకుడు, జీవితమంతా విప్లవోద్యమం కోసం కృషి చేసిన నిరంతర శ్రామిక కళాకారుడు గద్దర్ పేరిట అవార్డులను ప్రకటించడం సముచిత నిర్ణయమన్నారు. అందుకు సంబంధించిన తన ప్రసంగం వీడియోను ట్విటర్లో పోస్టు చేసిన చిరంజీవి సినీపరిశ్రమలోని ప్రతిభావంతులకు, ప్రజా కళాకారుడు గద్దర్ పేరు మీదుగా ప్రతియేటా ‘గద్దర్ అవార్డ్స్’ తెలంగాణ ప్రభుత్వం ఇస్తుందని ప్రకటించిన తరువాత, తెలుగు పరిశ్రమ తరపున, ఫిలిం ఛాంబర్, ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఈ ప్రతిపాదనను ప్రతిష్టాత్మకంగా ముందుకు తీసుకువెళ్లేలా బాధ్యత తీసుకోవాల్సిందిగా కోరుతున్నానని ట్వీట్ లో కోరారు.

మేం సీఎం అపాయింట్‌మెంట్ కోసం ప్రయత్నించాం..అటు నుంచి స్పందన లేదు: తమ్మారెడ్డి

గద్దర్ అవార్డులకు సంబంధించి సీఎం రేవంత్‌రెడ్డితో చర్చింఏందుకు తాము సీఎం అపాయింట్మెంట్ కోసం ప్రయత్నించామని.. రెండు మూడు సార్లు అపాయింట్మెంట్ కోసం కాల్ చేశామని నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ తెలిపారు. కానీ, ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదని చెప్పారు. సీఎం రేవంత్ అపాయింట్మెంట్ ఇస్తే వెళ్లి మాట్లాడటానికి రెడీగా ఉన్నామన్నారు. గద్దర్ గొప్ప వ్యక్తి.. ఆయన పేరుమీద అవార్డులు తీసుకోవడానికి ఎవరికీ అభ్యంతరం లేదు అని ప్రకటించారు.