Cold Wave | చంపేస్తున్న ‘చ‌లి’.. 16 వ‌ర‌కు జాగ్ర‌త్త‌గా ఉండాల్సిందే..!

Cold Wave | రాష్ట్ర వ్యాప్తంగా చ‌లి గ‌జ‌గ‌జ వ‌ణికిస్తోంది. ఎముక‌లు కొరికే చ‌లి వెన్నులో వణుకు పుట్టిస్తోంది. ప‌లు జిల్లాల్లో అత్య‌ల్ప ఉష్ణోగ్ర‌త‌లు న‌మోదు కావ‌డంతో ప్ర‌జ‌లు వ‌ణికిపోతున్నారు.

  • By: raj |    telangana |    Published on : Dec 09, 2025 8:45 AM IST
Cold Wave | చంపేస్తున్న ‘చ‌లి’.. 16 వ‌ర‌కు జాగ్ర‌త్త‌గా ఉండాల్సిందే..!

Cold Wave | హైద‌రాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా చ‌లి గ‌జ‌గ‌జ వ‌ణికిస్తోంది. ఎముక‌లు కొరికే చ‌లి వెన్నులో వణుకు పుట్టిస్తోంది. ప‌లు జిల్లాల్లో అత్య‌ల్ప ఉష్ణోగ్ర‌త‌లు న‌మోదు కావ‌డంతో ప్ర‌జ‌లు వ‌ణికిపోతున్నారు. సాయంత్రం నాలుగైదు గంట‌ల నుంచి మ‌రుస‌టి రోజు ఉద‌యం 9 వ‌ర‌కు చ‌లి గాలుల తీవ్ర‌త కొన‌సాగుతూనే ఉంది. ప‌లు ప్రాంతాల్లో తెల్ల‌వారుజాము స‌మ‌యంలో ద‌ట్ట‌మైన పొగ మంచు ఏర్ప‌డ‌డంతో వాహ‌న‌దారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఇక అన్ని జిల్లాల్లో సాధారణం కంటే కనిష్ఠ ఉష్ణోగ్రతలు 3 నుంచి 4 డిగ్రీల మేర తగ్గాయి. రాష్ట్రంలోనే అత్యల్ప కనిష్ఠ ఉష్ణోగ్రత సంగారెడ్డి జిల్లా కోహిర్‌లో 7.2 డిగ్రీలుగా నమోదైనట్టు వెల్లడించింది. వికారాబాద్ జిల్లా బంట్వారం మండ‌ల నాగారంలో 7.8, ఆదిలాబాద్ జిల్లా భీంపూర్‌లో 7.9 డిగ్రీల సెల్సియ‌స్ ఉష్ణోగ్ర‌త‌లు న‌మోదు అయ్యాయి. రాబోయే రెండు రోజుల్లో క‌నిష్ఠ ఉష్ణోగ్ర‌త‌లు సాధార‌ణం క‌న్నా 3 నుంచి 4 డిగీల వ‌ర‌కు త‌గ్గుతాయ‌ని వాతావ‌ర‌ణ శాఖ అంచ‌నా వేసింది. ఈనెల 16వరకు చలిగాలుల ప్రభావం తీవ్రంగా ఉంటుందని అంచనా వేసినట్టు పేర్కొన్నది. 12 జిల్లాల‌కు ఆరెంజ్ హెచ్చ‌రిక‌లు జారీ చేసింది.

చ‌లి గాలుల తీవ్ర‌త నేప‌థ్యంలో పిల్లలు, వృద్ధులకు ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. రానున్న రోజుల్లో చలి ప్రభావం మరింత ఎక్కువ అవుతుందని, వృద్ధులు, పిల్లలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం సూచించింది. నిర్మల్‌ జిల్లా పెంబి మండలం చింతగూడకు చెందిన వృద్ధుడు గంగారెడ్డి (60) చలి తీవ్రతకు బలయ్యాడు.