- ఉత్తమ్ సమీక్షకు జిల్లా మంత్రులు డుమ్మా
- జిల్లా మంత్రులు సీతక్క, సురేఖలు గైర్హాజరు
- పొంగులేటి, దుద్దిళ్ళ, ఎమ్మెల్యేలు హాజరు
- కీలక ధాన్యం సమస్య పై మంత్రులు సమీక్ష
- జిల్లా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం
విధాత, ప్రత్యేక ప్రతినిధి: రాష్ట్రంలో ప్రస్తుతం ప్రధాన సమస్యగా మారిన ధాన్యం, మక్కల కొనుగోళ్ళ అంశం పై సంబంధిత పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వరంగల్ ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులతో నిర్వహించిన సమీక్షకు జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులు కొండా సురేఖ, ధనసరి అనసూయ సీతక్క డుమ్మా కొట్టడం చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రవ్యాప్తంగా రైతుల పంట ఉత్పత్తుల కొనుగోళ్ళ పై క్షేత్ర స్థాయిలో పర్యటించి, వాస్తవ పరిస్థితులను తెలుసుకోవడమే కాకుండా, ఉమ్మడి జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, జిల్లా కలెక్టర్లతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఆయా జిల్లాలో చేపట్టాల్సిన చర్యలపై ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఇంత ప్రాముఖ్యత కలిగిన సమావేశం, అందులో సొంత జిల్లాలో జరిగిన సమీక్షా సమావేశానికి ఇద్దరికిద్దరు మంత్రులు హాజరుకాకపోవడానికి కారణాలేంటనే చర్చ సాగుతోంది. పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గురువారం యాదాద్రి, హనుమకొండ తదితర జిల్లాల్లో క్షేత్ర స్థాయిలో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో పరిస్థితులను పరిశీలించారు. అనంతరం సాయంత్రం హనుమకొండ కలెక్టరేట్ లో సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సమావేశానికి రాష్ట్ర ఫైనాన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, వరంగల్ పశ్చిమ శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి, స్టేషన్ ఘనపూర్ శాసనసభ్యులు కడియం శ్రీహరి, పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి, భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు, వర్ధన్నపేట శాసనసభ్యులు కె ఆర్ నాగరాజు, హుజురాబాద్ శాసనసభ్యులు పాడి కౌశిక్ రెడ్డి, కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రామిరెడ్డి, రాష్ట్ర పౌర సరఫరాల కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, హన్మకొండ, వరంగల్, ములుగు, జనగామ జిల్లాల కలెక్టర్లు చాహాట్ బాజ్ పాయి, డాక్టర్ సత్య శారద, బొర్ఖడే హేమంత్ సహదేవ్ రావు, సందీప్ కుమార్ ఝా, డిసిపి ధార కవిత, కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. ఇంత మంది పాల్గొన్న సమావేశానికి జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులు హాజరుకాకపోవడం చర్చకు దారితీసింది. జిల్లా ఇంచార్జ్ మంత్రి పొంగులేటి శ్రీననివాస్ రెడ్డి, రాష్ట్ర ఐటి శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు తదితరులు హాజరైనప్పటికీ సురేఖ, సీతక్క లేకపోవడంతో చర్చనీయాంశంగా మారింది. ఇద్దరు మంత్రులు తమతమ నియోజకవర్గంలో ఉన్నప్పటికీ ముందుగా నిర్ణయించిన కార్యక్రమాల్లో ఉన్నట్లుగా చెబుతున్నారు. రైతాంగం ఇబ్బందుల్లో ఉండి, ధాన్యం కొనుగోళ్ళ పై సంబంధిత శాఖ మంత్రి సమీక్షించిన సమావేశానికి హాజరుకాకపోవడం పై విపక్షాల నుంచి విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఈ సమావేశంలో రైతుల సమస్యలు, గన్నీ బ్యాగుల సమస్య, తడిసిన ధాన్యం కొనుగోళ్లు తదితర అన్ని అంశాల పై చర్చించారు.
