తెలంగాణ రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి సారధ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన వైఫల్యాలు..మెల్లగా ఆ పార్టీ ప్రభుత్వ పతనానికి బాటలు వేస్తున్నాయన్న రచ్చబండ చర్చలు ఇటీవలి కాలంలో పెరిగిపోతున్నాయి. బీఆర్ఎస్ పదేళ్ల పాలన వైఫల్యాల కంటే కూడా.. కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలనలో చేస్తున్న తప్పులు ఎక్కువగా హైలెట్ అవుతుండటం…అందుకు సీఎం రేవంత్ సహా మంత్రులు ఎవరి స్థాయిలో వారు వేస్తున్న తప్పటడుగులే ప్రధాన కారకాలుగా కనిపిస్తుండటంపై రాజకీయ విశ్లేషణలు జోరందుకుంటున్నాయి.
సహజ బలహీనతల బారిన కాంగ్రెస్ పాలన..
సహజంగానే కాంగ్రెస్ ప్రభుత్వాలను పడగొట్టేందుకు అంతర్గత కలహాలు…అవినీతి..అధికార దుర్వినియోగం వంటి కారణాలే ఎక్కువ ప్రభావం చూపుతుంటాయి. ప్రస్తుతం కూడా రాష్ట్రంలో మరోసారి అదే తరహా పరిణామాలు కనిపిస్తున్నాయి.
బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో కల్వకుంట్ల కుటుంబం దోచుకున్న దోపిడీ సొమ్ము కక్కిస్తామని చెప్పిన మాటలకంటే..ఆరు గ్యారంటీలు, 420హామీల ప్రచారానికంటే కూడా బీఆర్ఎస్ నియంతృత్వ, కుటుంబ పాలనపై అసంతృప్తితోనే ప్రజలు ప్రత్యామ్నాయంగా పాలన మార్పును ఆశిస్తూ గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు జై కొట్టారు. ప్రాంతీయ, కుటుంబ ప్రాబల్యంతో కొనసాగే రాజకీయ పార్టీ ప్రభుత్వాలు సహజంగా చేసే తప్పుల బాటలో కొనసాగిన బీఆర్ఎస్ అధికారం కోల్పోగా.. ఇప్పుడు కాంగ్రెస్ కూడా తన సహజ బలహీనలతో కూడిన పాలనా వైఫల్యాల బాటలోనే కొనసాతుండటం ఆ పార్టీ కేడర్ ను ఆందోళనకు గురి చేస్తుంది.
అధికార పార్టీ తప్పులే..ప్రతిపక్షానికి ఆయుధాలు
అధికార కాంగ్రెస్ పార్టీ సాగిస్తున్న తప్పులే ఇప్పుడు ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీలకు ఆయుధాలుగా మారాయి. కాంగ్రెస్ ఇచ్చిన ఎన్నికల హామీలపై నిలదీస్తునే..ఇంకోవైపు తమకు బాగా కలిసొచ్చిన నీళ్లు, నిధులు, ఉద్యోగాల అంశాలలో కాంగ్రెస్ ప్రభుత్వ విధాన పరమైన లోపాలను బీఆర్ఎస్ నాయకులు ఎత్తిచూపుతున్నారు. అయితే ఆయా అంశాల కంటే కూడా కాంగ్రెస్ పాలన పరంగా చేస్తున్న తప్పులు ఎక్కువగా తెలంగాణ రాజకీయాల్లో హైలట్ అవుతుండటం ఆ పార్టీని ఇరకాటంలోకి నెట్టేస్తుంది. ఈ పరంపరలో విద్యార్ధుల ఫీజు రీఎంబర్స్ మెంట్, ఉద్యోగుల రిటైర్డ్ బెనిఫిట్స్, కాంట్రాక్టర్ల పెండింగ్ బిల్లుల చెల్లింపులలో కమిషన్ల దందాలు, హైదరాబాద్ లో భూ దందాల.. వివాదాల భాగోతాలు, గోదావరి, కృష్ణా ప్రాజెక్టులు, నీటి వాటాల సమస్యలలో ప్రభుత్వ విధానాలు, భూ భారతి లోపాలు, ఫ్యూచర్ సిటీ, మూసీ ప్రక్షాళన, హైడ్రా, హిల్ట్ పాలసీ, హెచ్ సీయూ భూములు, ఫార్మా సిటీ భూములు సహా ప్రభుత్వ భూముల వరుస వేలం పాటలు వంటి వివాదాలు ప్రభుత్వ పనితీరుపై జనంలో చర్చను రగిలించాయి.
వాటితో పాటు ధాన్యం కొనుగోలులో తిప్పలు, సన్న వడ్ల బోనస్ చెల్లింపులలో జాప్యం, రైతు భరోసాలో కోతలు..వాయిదాల పర్వాలు రైతాంగాన్ని అసహనానికి గురి చేశాయి. వీటికి తోడుగా కాంగ్రెస్ కు పెద్ద దిక్కుగా రూపాంతరం చెందిన సీఎం రేవంత్ రెడ్డి ఒక్కోసారి మాట్లాడుతున్న మాటలు బూమ్ రాంగ్ అవుతుండటం కూడా పార్టీకి సమస్యగా తయారవుతుంది. ఇందులో ప్రధానంగా హైడ్రా విషయమై రేవంత్ చెప్పిన హిట్లర్ ఆదర్శం మాటలను విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు.
పథకాలతో వచ్చే ఇమేజ్ కంటే..పాలన వైఫల్యాలతో డ్యామేజ్ అధికం
కొత్తగా రైతు బీమా స్కీమ్, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు ఆగిపోవడం హస్తం పార్టీ సర్కార్ ప్రతిష్టను మరింత దెబ్బతీసేలా మారింది. అటు సీఎంఆర్ స్కామ్, మెట్రో టేకోవర్, విస్తరణ అంశాలలో నెలకొన్న సమస్యలు సహా ఆయా అంశాలో ప్రభుత్వ పాలనా వైఫల్యాలు బహిర్గతమవ్వడం ప్రతిపక్షాలకు ఆయుధాలుగా మారాయి. ఇందిరమ్మ ఇళ్ల బిల్లుల మంజూరీలో కొర్రీలు, పార్టీ అంతర్గత కలహాలు ప్రభుత్వాన్ని మరోవైపు బలహీనం చేస్తున్నాయి. ఉచిత విద్యుత్, 200యూనిట్ల ఉచిత విద్యుత్తు, కుల గణన, బీసీ రిజర్వేషన్ల తీర్మానం, ఎస్సీ వర్గీకరణ, ఉద్యోగాల భర్తీ, సన్న ధాన్యం బోనస్, యంగ్ ఇండియా స్కూల్స్, కొత్త రేషన్ కార్డులు, చేయూత పింఛన్లు, ఇందిరమ్మ ఇళ్లు వంటి వాటితో తెచ్చుకున్న మైలేజ్ కంటే కూడా ఆయా స్కామ్ లు, స్కీమ్ లలో, నది జలాల వినియోగంలో విధాన పర తప్పులతో కలుగుతున్న డ్యామేజ్ ఎక్కువగా ఉందన్న రచ్చబండ చర్చలు బలపడుతున్నాయి. ప్రభుత్వం ముందుగా విధానపరమైన సమస్యలను గుర్తించి సరైన దిశగా పాలనపరమైన చర్యలు తీసుకోవడం కంటే కూడా.. అధిక పర్యాయాలు ప్రతిపక్షం లేవనెత్తిన సందర్బాలలో దిద్దుబాటు చర్యలు తీసుకుంటున్న తీరు ప్రభుత్వ పాలన వైఫల్యాలకు నిదర్శనంగా కనిపిస్తుండటం ఆసక్తికరం.
22ఏ వివాదంతో మరింతగా దిగజారిన సర్కార్ ప్రతిష్ట
పాలనపైన..అధికార యంత్రాంగంపైన సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి, మంత్రులకు పట్టులేకపోవడమే తరుచూ విధాన పరమైన నిర్ణయాలు వివాదస్పదమవుతూ.. ప్రభుత్వ వైఫల్యతను బహిర్గతం చేస్తుందన్న వాదన మొదటి నుంచి వినిపిస్తుంది. ఇందుకు తాజా ఉదాహారణ 22ఏ నిషేధిత భూముల వ్యవహారం. కేసీఆర్ మొండిగా ధరణి పోర్టల్ ను తీసుకొచ్చి ఎన్నికల్లో తగిన మూల్యం చెల్లించుకున్నారు. ధరణిని బంగాళాఖాతంలో పడేస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం మరో రూపంలో భూ భారతీ పోర్టల్ ను తెచ్చింది. ధరణి మాటున భూ దందాలతో వేలకోట్ల అక్రమాలకు పాల్పడ్డారని.. నాడు బీఆర్ఎస్ పై ఆరోపణలు చేసిన కాంగ్రెస్ పార్టీ… ఇప్పుడు భూ భారతీ మాటున అదే తరహా దందాలు కొనసాగిస్తుందన్న వాదనకు 22ఏ నిషేధిత జాబితా వ్యహారంతో అవకాశం ఇచ్చింది. ఈ వివాదంతో ప్రతిపక్షం చేతికి భారీ ఆయుధాన్ని అందించి కాంగ్రెస్ సర్కార్ మరో సెల్ప్ గోల్ చేసుకున్నట్లయ్యింది.
భరోసానివ్వలేకపోతున్న దిద్దుబాటు చర్యలు
22ఏ నిషేధిత జాబితాలో తప్పులు దొర్లాయని..ఇందుకు ప్రజలకు క్షమాపణ చెబుతున్నానని స్వయంగా రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పుకోవాల్సి రావడం ప్రభుత్వ పాలనా వైఫల్యానికి అద్దం పట్టింది. ఈ అంశాన్ని గట్టిగా పట్టుకున్న బీఆర్ఎస్, బీజేపీలు ప్రభుత్వంపై దాడిని ఉదృతం చేస్తూ..జరిగిన పొరపాటుకు.. ప్రజలకు ఎదురైన ఇబ్బందులకు బాధ్యత వహిస్తూ మంత్రి పొంగులేటి రాజీనామాకు డిమాండ్ చేస్తున్నాయి. అంతేకాదు దీనిపై సిట్, ఈడీ, సీబీఐ, జ్యూడీషియల్ దర్యాప్తులు చేయాలని కూడా డిమాండ్ చేస్తుండటం ప్రభుత్వానికి సంకటంగా మారింది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి వరకు వేలాది ఫిర్యాదులను పరిష్కరించలేని ప్రభుత్వం..ఇప్పుడు 15 రోజుల్లో నిషేధిత భూముల సమస్యలు పరిష్కరిస్తామని చెప్పడాన్ని జనం నమ్మె పరిస్థితి కనిపించడం లేదు.
అధికారుల మాటునా ధాటవేతకు యత్నం..ప్రజా దృష్టిని ఏమార్చే ప్రయత్నం
22ఏ నిషేధిత జాబితాలో పొరపాటును ప్రైవేటు ఆస్తులు పెద్ద సంఖ్యలో చేరడం..పైగా ఆ జాబితాను ఆన్ లైన్ లో అందుబాటులో పెట్టకపోవడం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హైకోర్టులోనే కాదు..ప్రజాకోర్టులోనూ నిలబెట్టడానికి ప్రధాన కారణమైంది. ఈ వ్యవహారం హస్తం పార్టీ ప్రభుత్వ ప్రతిష్టను ప్రజల్లో పలచన చేస్తుందని స్వయంగా కాంగ్రెస్ కేడర్ కూడా వాపోతుంది. 1958 నాటి పాత రికార్డులను పరిగణలోకి తీసుకుని..ఆ రోజు రికార్డుల మేరకు నిర్ణయాలు తీసుకుని..1958 తర్వాతా ప్రభుత్వ భూముల క్రమబద్దీకరణకు ఇచ్చిన ఉత్తర్వులు, అర్బన్ ల్యాండ్ సీలింగ్ క్రమబద్ధీకరణ ఉత్వర్వులను పరిగణలోకి తీసుకోకుండా గంపగుత్తగా పాత రికార్డుల మేరకు 22ఏ జాబితాను రూపొందించడంతో పెద్ద ఎత్తున ప్రైవేటు భూములు, ఆస్తులు నిషేధిత జాబితాలో చేరిపోయాయి. లావాదేవీ కోసం రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు వెళ్లినప్పుడు తమ ఆస్తి 22ఏలో ఉందని తెలిసి ప్రజలు లబోదిమంటున్నారు. లక్ష కోట్ల విలువ చేసే భూములు, ఏళ్ల క్రితం కట్టిన ఇళ్లు, అపార్ట్మెంట్లను కూడా నిషేధిత జాబితాలో చేర్చడం ప్రజలను ఆందోళను గురి చేస్తుంది.
పెల్లుబికుతున్న జనాగ్రహం…
22ఏ భూముల వివాదంలో అధికారులదే తప్పు అని..సమస్యల పరిష్కారానికి ఉన్నత స్థాయి కమిటీ వేశామని, బాధితుల ఫిర్యాదుల పరిష్కారినికి టోల్ ఫ్రీ నెంబర్ తో పాటు రిజిస్ట్రేషన్లు ఆగకుండా ఆదేశాలు ఇచ్చామని మంత్రి పొంగులేటి దిద్దుబాటు ప్రకటనలు చేశారు. అప్పటికే ఈ వివాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో బీఆర్ఎస్, బీజేపీలు విజయవంతమయ్యాయి. ఎప్పటిలాగే మేం లేవనెత్తిన తర్వాతే మరోసారి ప్రభుత్వం మేల్కొని 22ఏ, కల్యాణ లక్ష్మి పథకాలపై దిద్దుబాటు చర్యలు చేపట్టిందంటూ బీఆర్ఎస్ మరోసారి ప్రభుత్వానికి చురకలంటించింది. ప్రజల భూములను, ఆస్తులను 22ఏ నిషేధిత జాబితాలో చేర్చి ప్రభుత్వం లాక్కొనే కుట్ర చేసిందని, 30శాతం కమిషన్ల దందాకు తెరలేపిందని..ఈ మొత్తం వ్యవహారంపై ప్రభుత్వం న్యాయ విచారణకు సిద్దం కావాలంటూ బీఆర్ఎస్, బీజేపీలు చేస్తున్న వాదనలు ప్రజలలో హాట్ టాపిక్ గా మారాయి.
రియల్ ఎస్టేట్ కు దెబ్బ..జీహెచ్ఎంసీలో హస్తం పార్టీకి ముప్పు
సీఎం ఇల్లు కూడా నిషేధిత జాబితాలో చేరిన తీరుతో..ఇక తమ ఆస్తుల రక్షణ పరిస్థితి ఏమిటన్న ఆలోచన ప్రజల్లో తీవ్ర కలకలం రేపింది. తమ ఆస్తులు, భూములు ఏ జాబితాలో ఉన్నాయోనంటూ అంతా ఆందోళన పడే పరిస్థితి నెలకొంది. 22ఏ నిషేధిత జాబితా దెబ్బకు హైదరాబాద్ నగరంలో రియల్ ఎస్టేట్ రంగం మరింత పడిపోయే పరిస్థితి నెలకొంది. లక్షల కోట్ల విలువ చేసే అసైన్డ్, ప్రభుత్వ భూములు, ప్రైవేట్ ఆస్తులు 22ఏ పరిధిలోకి వెళ్లాయి. పేద, మధ్యతరగతి జనాలతోపాటు, సంపన్నులు, విదేశీ సంస్థలు నెలవైన బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మాదాపూర్, హైటెక్ సిటీ, గచ్చిబౌలి, షేక్‌పేట, అమీర్‌పేట, ఖైరతాబాద్, పంజాగుట్ట వంటి ప్రైమ్ ఏరియాల్లోని భూములు కూడా నిషేధిత జాబితాలో చేర్చారు. కాలనీలు, లే అవుట్లు, HMDA అమ్మిన భూములు, HUDA అమ్మిన భూములు, వేలంలో ప్రభుత్వం అమ్మిన భూములను 22-A నిషేధిత జాబితాలో పెట్టేయడం తీవ్ర వివాదస్పదమైంది. ఇన్నాళ్లూ తాము ఉండే ఇండ్లు, ఖాళీ ప్లాట్లపై సర్వ హక్కులను హరించేలా నిషేధిత జాబితాలో చేర్చి.. అవసరానికి అమ్ముకొనే వీల్లేకుండా చేసిన ప్రభుత్వం తీరుపై బాధిత ప్రజలు మండిపడుతున్నారు. అంతిమంగా జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 22ఏ భూముల వివాదంతో పాటు..హైడ్రా, మూసీ ప్రక్షాళన, టీడీఆర్ వంటి అంశాలు కాంగ్రెస్ ను ముంచేశాలా ఉన్నయన్న విశ్లేషణలకు ఊతమిస్తున్నాయి.
