బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీలో ఉండి అన్నీ సంపాదించుకుని కాంగ్రెస్ లోకి వచ్చిన వాళ్లకే టికెట్ ఇచ్చారని, డబ్బులకు ఆశపడి నాకు ఇవ్వకుండా వేరే వాళ్లకి టికెట్ ఇచ్చారని..పార్టీలో ఇన్ని తప్పులు చేస్తున్నా భరిస్తూ వస్తున్నాం అని, ఒకవేళ నేను భరించకపోతే ఇంకో జీవన్ రెడ్డి అయ్యే వాడినని మాజీ ఎమ్మెల్యే, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి కీలక వాఖ్యలు చేశారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే జీవన్ రెడ్డిలా తానూ తిరగబడతానని వార్నింగ్ ఇచ్చారు.
వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డిపై కాంగ్రెస్ సీనియర్ నాయకుడు చిన్నారెడ్డి తాజాగా మరోసారి విమర్శలు గుప్పించారు. వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి డబ్బులు ఇచ్చి టికెట్ కొనుక్కున్నాడని ఆరోపించారు. సోనియాగాంధీ టికెట్ నాకే ఇవ్వాలని అప్పటి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి, ఆయన వద్ద డబ్బులు లేకపోతే మీరే ఖర్చు పెట్టుకోవాలని చెప్పారని, అయినా పార్టీలోని ఎన్నికల కమిటీ డబ్బులకు ఆశపడి నాకు టికెట్ ఇవ్వేలేదని చిన్నారెడ్డి అన్నారు. మేఘారెడ్డి దగ్గర డబ్బులు తీసుకుని టికెట్ అతనికి ఇచ్చారని, 40ఏళ్లుగా నిర్మించుకున్న నా రాజకీయ జీవితాన్ని ఒక్క వేటుతో కూల్చేశారని, నన్ను దెబ్బతీయడంతో పాటు వనపర్తి నియోజవర్గాన్ని కూడా దెబ్బతీశారని విమర్శించారు. ఇవాళ నేను ఎమ్మెల్యేని, మంత్రిని అయ్యి ఉంటే వనపర్తికి మహర్దశ వచ్చేది అన్నారు.
ఇప్పుడు నియోజకవర్గంలో జరిగే అభివృద్ధి పనుల కాంట్రాక్టులు ఎమ్మెల్యే వర్గీయులకు రాలేదని, పనులు అన్నీ ఆపేస్తున్నాడని, నా అనుచరులను బాగా ఇబ్బంది పెడుతున్నాడని చిన్నారెడ్డి ఆరోపించారు. నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు కూడా మేఘారెడ్డి అడ్డు పడుతున్నాడని మంత్రులే చెప్పారని చిన్నారెడ్డి పేర్కొన్నారు. నేను జీవన్ రెడ్డిలా తిరగబడే సమయం వచ్చింది అన్నారు.
కానీ నేను పార్టీ నుండి వెళ్లబోనని, మేఘారెడ్డి లాంటి తప్పుడు గాళ్లను పార్టీ నుండి తరిమేస్తానని అన్నారు.
