ఎన్నికలోస్తేనే హరీష్ రావుకు సమస్యలు గుర్తుకొస్తాయి: ఆది..సామాల కౌంటర్
జూబ్లీహిల్స్ ఉపఎన్నికల నేపథ్యంలో టిమ్స్ ఆసుపత్రి నిర్మాణంపై హరీష్‌రావు వ్యాఖ్యలకు ఆది శ్రీనివాస్, సామా రామ్మోహన్ రెడ్డి కౌంటర్ వేశారు.

విధాత, హైదరాబాద్ : జూబ్లీ హిల్స్ ఉపఎన్నికలు వచ్చే సరికి బీఆర్ఎస్ మాజీ మంత్రి టి. హరీష్ రావుకు సమస్యలు గుర్తుకు వచ్చాయని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ విమర్శించారు. కొత్తపేట టిమ్స్ ఆసుపత్రి నిర్మాణ పనులను పరిశీలించిన హరీశ్ రావు రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. హరీష్ రావు విమర్శలకు ఆది శ్రీనివాస్ కౌంటర్ వేశారు. హైదరాబాద్ నగర ప్రజలను పక్కదారి పట్టించడానికి హరీష్ రావు హడావుడి మొదలుపెట్టాడని..కొత్త పేట టిమ్స్ హాస్పిటల్ దగ్గర హరీష్ రావు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు షో చేశారని ఎద్దేవా చేశారు. పదేళ్లు అధికారంలో ఉండి సూపర్ స్పెషాలిటీ ప్రభుత్వ ఆసుపత్రులను ఎందుకు నిర్మించలేదో హరీష్ రావు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మా ప్రభుత్వం వచ్చాక సీఎం రేవంత్ రెడ్డి వీటి నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించారని..అన్ని ఆసుపత్రుల నిర్మాణం దాదాపుగా 90 శాతం పూర్తైందని హరీష్ రావు గుర్తు చేశారు.
హరీష్ రావుకు సామా కౌంటర్
టిమ్స్ నిర్మాణం పట్ల కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి టి.హరీష్ రావు చేసిన విమర్శలకు కాంగ్రెస్ మీడియా సెల్ చైర్మన్ సామా రామ్మోహన్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. అబద్ధాలను నిస్సంకోచంగా, నిసిగ్గుగా మాట్లాడటం హరీశ్ రావుకే చెల్లిందన్నారు. ఆయనకు నార్సిసిస్టిక్ పర్సనాలిటీ డిజార్డర్ అనే వ్యాధి ఉందంటూ సెటైర్లు వేశారు. అవతలి వ్యక్తులు చేసే ప్రతి పనినీ తప్పుగా చూపించే ప్రయత్నం చేస్తున్నారని.. ఏదైనా మంచి జరిగితే అది తమ ఖాతాలో వేసుకునేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారని ఫైర్ అయ్యారు. ఓ వైపు టిమ్స్ ఆసుపత్రులను అద్భుతంగా తీర్చిదిద్దే పనిలో ప్రభుత్వం ఉంటే.. పబ్లిసిటీ కోసం హరీశ్‌రావు పాకులాడుతున్నాడని ఎద్దేవా చేశారు. దశాబ్దాల ఉస్మానియా హాస్పిటల్ కలను తాము నెరవేరుస్తుంటే ఆయన చూసి తట్టుకోలేకపోతున్నాడని సామ రామ్మోహన్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ నగరం నలువైపులా 4 సూపర్ స్పెషాలిటీ హాస్పిటళ్లు కడతామని కేసీఆర్ చెప్పారని.. 2020లో కరోనా టైమ్‌లో ఆరోగ్య శాఖతో పాటు ఆసుపత్రులను పాపాన పోలేదని రామ్మోహన్ ధ్వజమెత్తారు.
గచ్చిబౌలి స్టేడియానికి సంబంధించిన ఓ భవనానికి టిమ్స్ అని బోర్డు తగిలించారంటూ సామ రామ్మోహన్ రెడ్డి ఆరోపించారు. నాలుగు టిమ్స్‌లలో ఒక టిమ్స్‌ను అందుబాటులోకి తీసుకొచ్చామంటూ జబ్బలు చరుచుకున్నారని ఎద్దేవా చేశారు. కోవిడ్ తగ్గగానే గచ్చిబౌలి టిమ్స్ మూత పడేశారని అన్నారు. మిగిలిన 3 టిమ్స్‌ల గురించి 2022 వరకు బీఆర్ఎస్ పట్టించుకోలేదన్నారు. తాము అధికారంలోకి వచ్చాక అన్ని టిమ్స్ హాస్పిటళ్ల నిర్మాణాలపై సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ చేసి పనులను కొనసాగించాలని ఆదేశించారని గుర్తు చేశారు. అదేవిధంగా ప్రాజెక్టుల అంచనాల పెంపు అక్రమాలపై విచారణకు ఆదేశించారని పేర్కొన్నారు. డిసెంబర్ నుంచి సనత్‌నగర్ టిమ్స్‌ను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నామని అన్నారు.