వైఫల్యాల బాటలో కాంగ్రెస్ పాలన, పల్లెలో తిరగకుండా ప్రజాపాలన ముచ్చట్లు … బీజెఎల్పీ నేత మహేశ్వర్‌రెడ్డి

కాంగ్రెస్ ప్ర‌భుత్వం అన్ని రంగాల్లో వైఫ‌ల్యాల బాటలో సాగుతుందని, ఎన్నికల హామీలన్ని బూటకంగా మార్చివేసిందని బీజేపీ శాస‌న‌స‌భా ప‌క్ష నేత ఏలేటి మ‌హేశ్వ‌ర్ రెడ్డి విమర్శించారు. అసెంబ్లీ ప్రెస్ కాన్ఫ‌రెన్స్ హాల్‌లో మ‌హేశ్వ‌ర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు

వైఫల్యాల బాటలో కాంగ్రెస్ పాలన, పల్లెలో తిరగకుండా ప్రజాపాలన ముచ్చట్లు … బీజెఎల్పీ నేత మహేశ్వర్‌రెడ్డి

విధాత : కాంగ్రెస్ ప్ర‌భుత్వం అన్ని రంగాల్లో వైఫ‌ల్యాల బాటలో సాగుతుందని, ఎన్నికల హామీలన్ని బూటకంగా మార్చివేసిందని బీజేపీ శాస‌న‌స‌భా ప‌క్ష నేత ఏలేటి మ‌హేశ్వ‌ర్ రెడ్డి విమర్శించారు. అసెంబ్లీ ప్రెస్ కాన్ఫ‌రెన్స్ హాల్‌లో మ‌హేశ్వ‌ర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. సీఎం రేవంత్‌రెడ్డి ఎన్నికల్లోరాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో చెప్పించిన హామీలన్నింటిని బూటకపు హామీలుగా మార్చారని ఆరోపించారు. ఎన్నిక‌ల మ్యానిఫెస్టోను డ‌మ్మీ పేప‌ర్‌గా త‌యారు చేశార‌ని విమ‌ర్శించారు, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటమి భయంతోనే ఎన్నికలు పెట్టడానికి కాంగ్రెస్ పార్టీ భయపడుతోందని ఎద్దేవా చేశారు. సకాలంలో స్థానిక ఎన్నికలు జరగకుంటే కేంద్ర నుంచి వచ్చే నిధులు ఆగిపోయే ప్రమాదం ఉందన్నారు. గ్రామ పంచాయతీలో శానిటేషన్ కార్మికులకు ఇచ్చే వేతనాలు కూడా ఇవ్వడం లేదని, మంత్రులు గ్రామాల్లోకి వెళ్లి పరిశీలిస్తే పరిస్థితి అర్థం అవుతుందన్నారు. పల్లెల్లో సర్పంచ్‌లు లేరు… ఎంపీటీసీ, జ‌డ్పీటీసీల‌ పదవీ కాలం పూర్తయ్యిందని, పారిశుధ్యం అస్తవ్యస్తంగా మారితే సీజనల్ వ్యాధులు ప్రబలే ప్రమాదం పొంచి ఉంద‌ని మహేశ్వ‌ర్ రెడ్డి పేర్కొన్నారు.

పల్లె ప్రగతికి రావాల్సిన నిధులను వెంటనే చెల్లించాలన్నారు. హైదరాబాద్‌లో ఉంటూ ప్రజా పాలన ముచ్చట్లు చెబుతున్నారని, పల్లెల్లో ప‌ర్య‌టిస్తూ ప్రజల మధ్యకు వెళ్లి సమస్యలను పరిష్కరించకుండా ప్రజాపాలన చేస్తున్నామనడం అర్ధరహితమన్నారు. ఆర్థిక క్రమశిక్షణ లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వం పనులు చేస్తుందని, రాష్ట్రంలో ఆర్ ట్యాక్స్, బీ ట్యాక్స్ తీసుకుంటున్నారని మరోసారి ఆరోపించారు. వారికి నచ్చిన కాంట్రాక్టర్లకు బిల్లులు ఇస్తున్నారని, కానీ పారిశుధ్య కార్మికులకు వేతనాలు మాత్రం ఇవ్వడం లేదని విమర్శించారు. రూ. 1200 కోట్ల స‌ర్పంచ్‌ల‌ నిధులను కక్ష సాధింపులో భాగంగా ఆపేశారని, మ‌ధ్యాహ్న భోజన పథకం వడ్డించే వారికి 7 నెలలుగా బిల్లులు చెల్లించలేదని, కేవలం పెద్ద కాంట్రాక్టర్లకు, మంత్రుల కంపనీలకు నచ్చిన వాళ్లకే బిల్లులు ఇస్తున్నారని, ఆరునెలల రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేత పత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఏప్రిల్ నెల‌ పింఛన్లు జూన్ 25న ఇచ్చారని, మరి మే, జూన్ పెన్ష‌న్లు ఎప్పుడు ఇస్తారు..? అని ప్ర‌భుత్వాన్ని నిల‌దీశారు.