ఎరువులు ఇవ్వలేని అసమర్థతలో కాంగ్రెస్ పాలన : హరీష్ రావు ధ్వజం
రైతులకు ఎరువులు కూడా అందించలేని అసమర్థ పాలనను కాంగ్రెస్ ప్రభుత్వం సాగిస్తుందని బీఆర్ఎస్ మాజీ మంత్రి టి.హరీష్ రావు విమర్శించారు. సిద్దిపేట జిల్లా నంగునూర్ మండలం పాలమాకుల యూరియా సెంటర్ వద్ద ఎరువుల కోసం పడిగాపులు పడుతున్న రైతులతో హరీష్ రావు మాట్లాడారు

విధాత : రైతులకు ఎరువులు కూడా అందించలేని అసమర్థ పాలనను కాంగ్రెస్ ప్రభుత్వం సాగిస్తుందని బీఆర్ఎస్ మాజీ మంత్రి టి.హరీష్ రావు విమర్శించారు. సిద్దిపేట జిల్లా నంగునూర్ మండలం పాలమాకుల యూరియా సెంటర్ వద్ద ఎరువుల కోసం పడిగాపులు పడుతున్న రైతులతో హరీష్ రావు మాట్లాడారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన హరీష్ రావు ఎరువుల కొరతకు కాంగ్రెస్, బీజేపీ పార్టీలే కారణమని మండిపడ్డారు. బీజేపీ, కాంగ్రెస్ కలిపి 16 ఎంపీ సీట్లు గెలిచినా రాష్ట్రానికి ఎరువులను తేవడంలో విఫలం అయ్యాయని విమర్శించారు. కాంగ్రెస్ తెచ్చిన మార్పు ఏమిటంటే ఎరువు బస్తాల కోసం రైతులను క్యూలో నిల్చోబెట్టి మళ్లీ పాత రోజులను గుర్తుచేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పొద్దున ఐదు గంటలకు వచ్చి చెప్పులు లైన్లో పెట్టి వేచి చూడాల్సిన పరిస్థితి మళ్లీ వచ్చిందన్నారు. కేసీఆర్ పాలనలో ట్రాన్స్‌పోర్ట్ కిరాయి, హమాలీ ఖర్చులు లేకుండా గ్రామ గ్రామానికి ఎరువులు పంపితే మళ్లీ కాంగ్రెస్ రాగానే ఎరువుల కోసం క్యూలైన్లు వచ్చాయన్నారు.
సీఎం రేవంత్ రెడ్డికి ముందుచూపు లేకపోవడం వల్ల, కాంగ్రెస్ చేతకానితనం వల్ల ఈ పరిస్థితి వచ్చిందని దుయ్యబట్టారు. పోలీసులు లేకుండా ఎరువులు పంచే పరిస్థితి నేడు లేదన్నారు. కేసీఆర్ ఉన్నప్పుడు మూతపడ్డ మోటర్ వైండింగ్ దుకాణాలు రేవంత్ రెడ్డి పుణ్యమా అని మళ్లీ తెరుచుకున్నాయన్నారు. పోయిన వానకాలం సిద్దిపేట జిల్లాలో ఐదు లక్షల 70 వేల ఎకరాల్లో పంట సాగయితే..ఈసారి కాలం సరిగా లేక కాళేశ్వరం నీళ్లు తేక నాలుగు లక్షల 50,000 ఎకరాల్లో మాత్రమే పంట సాగయిందని తెలిపారు. ఒక సిద్దిపేటలోనే 1,20,000 ఎకరాల్లో తక్కువ సాగు జరిగిందని వెల్లడించారు. పూర్తి పంట వేసి ఉంటే ఎరువుల కోసం ఇంకా ఎంతో కష్టమయ్యేదని ఆందోళన వ్యక్తం చేశారు. పంట సాగు తగ్గినా యూరియా సరఫరా చేయడంలో రేవంత్ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు కేంద్ర ప్రభుత్వంపై రాజీనామా చేస్తామని బెదిరించైనా సరే రాష్ట్రానికి ఎరువులు తేవాలని డిమాండ్ చేశారు