వరికి బోనస్.. వట్టి బోగస్

కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి వస్తే రైతులు పండించిన వరి ధాన్యానికి రూ. ఐదు వందల బోనస్ ఇస్తానని ప్రకటించినా నేటికీ అమలుకు నోచుకోలేదని... కాంగ్రెస్ నేతల ప్రకటన వరికి బోనస్ కాదని వట్టి బోగస్

వరికి బోనస్.. వట్టి బోగస్

– కాంగ్రెస్ హామీ లన్నీ ఉత్తుత్తి మాటలే
– అమలు కాని హామీలతో ఓ గోలి వేశారు.. ప్రజలు నమ్మి ఓటు వేశారు
– నమ్మించి మోసం చేయడం లో కాంగ్రెస్, బీజేపీ లకు వెన్నతో పెట్టిన విద్య
– కెసిఆర్ హయాంలో పంటలు ఎండడం చూసారా.. ఇప్పుడు ఎక్కడ చూసిన ఎండిన పంటలే
– సాగు, తాగు నీరు లేక తెలంగాణ ప్రజల గోస కాంగ్రెస్ కు పట్టడం లేదు
– కెసిఆర్ వస్తేనే తెలంగాణ కు పూర్వ వైభవం.. ప్రజలు గుర్తించాలి
– సిట్టింగ్ ఎంపీ, బీ ఆర్ ఎస్ అభ్యర్థి మన్నే శ్రీనివాస్ రెడ్డి

విధాత, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి: కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి వస్తే రైతులు పండించిన వరి ధాన్యానికి రూ. ఐదు వందల బోనస్ ఇస్తానని ప్రకటించినా నేటికీ అమలుకు నోచుకోలేదని… కాంగ్రెస్ నేతల ప్రకటన వరికి బోనస్ కాదని వట్టి బోగస్ అని సిట్టింగ్ ఎంపీ, మహబూబ్ నగర్ బీ ఆర్ ఎస్ పార్లమెంట్ స్థానం అభ్యర్థి మన్నే శ్రీనివాస్ రెడ్డి విమర్శించారు.ఎన్నికల ప్రచారం లో భాగంగా సోమవారం జడ్చర్ల, ధన్వాడ లో నిర్వహించిన బీ ఆర్ ఎస్ శ్రేణుల సన్నాహక సమావేశం లో ఆయన పాల్గొని ప్రసంగించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అమలు కాని హామీలు ఇచ్చి ఓ గోలి వేసిందని, ఎలాగూ గెలవమే ఉద్దెశం తో ఈ హామీల మాయ మాటలు చెప్పడంతో ప్రజలు నమ్మకం తో ఓట్లు వేశారన్నారు. అధికారం లోకి వచ్చిన వెంటనే హామీలన్నీ అమలు చేస్తామని ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి వాటిని అమలు చేయడం లో పూర్తి గా విఫలం చెందారని మన్నే పేర్కొన్నారు. డిశంబర్ 9 న ప్రమాణం చేస్తానని… ఆరోజే రైతులకు రుణ మాఫీ.. వరి కి బోనస్ ఇస్తానని ప్రకటించి నాలుగు నెలలైన వాటి ఊసే ఎత్తడం లేదన్నారు.మళ్ళీ పార్లమెంట్ ఎన్నికలు రావడంతో ఇప్పుడు రుణమాఫి, వరి కి బోనస్ గుర్తుకు వస్తున్నదని, సీఎం మాటలు ప్రస్తుతం రైతులు నమ్మే పరిస్థితి లేదన్నారు. పాలమూరు, రంగా రెడ్డి ప్రాజెక్టు 90 శాతం పనులు పూర్తి చేసిన కెసిఆర్ అపారభగీరతుడని, నేడు మిగిలిన ఆ ప్రాజెక్టు పనులు పనులు చేపట్టకుండా కెసిఆర్ ను తిట్టడమే పనిగా బీజేపీ, కాంగ్రెస్ పెట్టుకున్నదని ఆయన అన్నారు.అధికారం లోకి వచ్చిన వెంటనే మహిళా లకు రూ.2500 ఇస్తామని, పింఛన్లు రూ.4000, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకం లో పేదింటి పిల్లల పెళ్లికి తులం బంగారు ఇస్తామని ఇచ్చిన హామీలు ఏమయ్యాయని మన్నే శ్రీనివాస్ రెడ్డి ప్రశ్నించారు. అన్ని మాయ మాటలు చెప్పి ఇచ్చిన హామీలు నెరవేర్చడం లో రేవంత్ రెడ్డి సర్కార్ పూర్తిగా విఫలమైందన్నారు. నాలుగు నెలల కాంగ్రెస్ పాలన లో తెలంగాణ రాష్ట్రం ఆగమైందని, మళ్ళీ కెసిఆర్ వస్తేనే తెలంగాణ రాష్ట్రం బాగుపడుతుందనే విషయం ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని ఆయన అన్నారు. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో బీ ఆర్ ఎస్ పార్టీ కి భారీ మెజారిటీ వచ్చేందుకు ప్రతి కార్యకర్త, నాయకులు కృషి చేయాలని శ్రీనివాస్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ సమావేశాల్లో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే లు లక్ష్మా రెడ్డి,నారాయణ పేట మాజీ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి, దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆలా వెంకటేశ్వర్ రెడ్డి, నేతలు, కార్యకర్తలు భారీ సంఖ్య లో పాల్గొన్నారు.