Cotton : పేరుకే పత్తికి కేంద్రం మద్ధతు ధర
కేంద్రం పత్తి మద్దతు ధర లాంఛనప్రాయం. సీసీఐ కొత్త నిబంధనలతో రైతులు ఇబ్బందులు. తేమ నిబంధన, కొనుగోలు కేంద్రాల లేమితో దళారుల దందా పెరిగి తక్కువ ధరకే అమ్ముతున్న రైతులు.
విధాత, ప్రత్యేక ప్రతినిధి: కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ఈ ఏడాది ప్రయోగాత్మకం పేరుతో తెస్తున్న కొత్త కొత్త నిబంధనలన్నీ పూర్తిగా రైతు నుంచి పత్తిని కొనుగోలు చేయకుండా ఉండేందుకు అనుసరిస్తున్న కుంటిసాకులుగా భావిస్తున్నారు. దీంతో రైతులకు మిల్లర్లకు, కార్మికులకు తీవ్రమైన సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. సీసీఐ తీరు జిన్నింగ్ మిల్లు యజమానులకే కాకుండా ప్రైవేటు ట్రేడర్లకు, రైతులకు, కార్మికులకు కూడా తీవ్రమైన సమస్యలు సృష్టిస్తున్నాయి. సీసీఐని నియంత్రించి రైతును ఆదుకోవాల్సిన కేంద్ర ప్రభుత్వం చోద్యం చూస్తోంది. దీని వల్ల కేంద్రం ప్రకటించే పత్తి మద్ధతు ధర రైతులకు దక్కుండా పోతోంది. పత్తి రైతును నిండా ముంచేందుకు కేంద్రం అనుసరిస్తున్న విధానాలు దోహదం చేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఈ సారి పత్తి క్వింటాల్ కు రూ. రూ.8,110లుగా ప్రకటించింది. ఈ పత్తిలో 8 శాతానికి మించి తేమ శాతం ఉండకూడదని నిబంధన విధించింది. తేమ శాతం ఒకటి పెరిగే కొద్ది క్వింటాల్ కు రూ. 81లు కోత విధిస్తామని స్పష్టం చేశారు. 12కు మించితే అసలు కొనుగోలు చేయమంటూ తేల్చిచెప్పారు. దీంతో కేంద్రం ప్రకటించిన మద్ధతు ధర రూ. 8,110లు కేలలం లాంఛనప్రాయంగా మారింది. పత్తిని ఆరబెట్టుకోలేక, ఇంట్లో నిల్వ చేస్తే తేమ శాతం పెరిగే అవకాశాలున్నందున మార్కెట్కు తీసుకొచ్చి రైతులు ప్రైవేట్ వ్యాపారులకు అమ్ముతున్నారు. మద్దతు ధర కంటే దాదాపు క్వింటాల్ కు రూ. 1000 నుంచి రూ.1,500లు ధర తగ్గించి దళారులు దండుకుంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా సీసీఐ అన్ని చోట్ల పత్తి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదు. ఒక్క ఉమ్మడి వరంగల్ జిల్లాలో 60 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాల్సి ఉండగా సగం కూడా ప్రారంభించలేదు. రైతులకు మరోదారి లేక దళారీలకు తక్కువ ధరకు విక్రయిస్తున్నారు. సాధారణ పత్తి విస్తీర్ణం 48,93, 016 ఎకరాలుండగా, గత ఏడాది పత్తి సాగు 44,75, 252 ఎకరాలలో సాగు చేశారు. ఈ సంవత్సరం 45,94, 685 ఎకరాల్లో పత్తి సాగు జరిగింది. దాదాపు 93.90శాతం పత్తి సాగు చేసినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి.
సీసీఐ అడ్డగోలు నిబంధనలు
ఈ ఏడాది పత్తిని కొనుగోలు చేసేందుకు జిన్నింగ్ మిల్లులను ఎల్ 1, ఎల్ 2, ఎల్ 3 అంటూ మూడు కేటగిరీలుగా విభజించారు. ఈ విభజన మిల్లు యజమానాల మధ్య వివక్షకు కారణమైంది. ఒక రకం మిల్లుల వద్దే ప్రస్తుతం పత్తిని కొనుగోలు చేస్తూ మిగిలిన మిల్లుల వద్ద ఇప్పటీకి కొనుగోలు ప్రక్రియను చేపట్టకపోవడంతో సీసీఐ కొనుగోలు చేసే పత్తి పై ఆధారపడిన మిల్లులు పనిలేక వెలవెలబోతున్నాయి. దీనికి నిరసనగా కాటన్ మిలర్లు, ట్రేడర్ల అసోసియేషన్ నిరవధికంగా కొనుగోళ్ళు నిలిపివేశారు. గతంలో స్లాట్ పద్ధతిలో పత్తిని కొనుగోలు చేసే సీసీఐ ఈ సారి కొత్తగా కపాస్ యాప్ లో ముందుగా రైతులు బుక్ చేసుకుంటేనే పత్తిని కొనుగోలు చేసే విధంగా నిబంధనలు విధించారు. ఇందులో కూడా కౌలు రైతులకు అవకాశం లేకుండా పోయింది. రాష్ట్రంలో మెజార్టీ కౌలు రైతులే ఉన్నారు. దీనికి తోడు అక్షర జ్ఞానం లేని మారుమూల పల్లె రైతులు ఈ యాప్ను వినియోగించడం అగ్నిపరీక్షగా మారింది. రైతులను ఏమైనా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అనుకుంటున్నారా? అనే ప్రశ్నలు వేస్తున్నారు. దీనికి తోడు ఎన్నడూ లేని విధంగా రైతుల నుంచి కేవలం 7 క్వింటాళ్ళ పత్తిని మాత్రమే కొనుగోలు చేస్తామంటూ కొర్రీలు పెట్టారు. రైతు పండించిన మిగిలిన పత్తిని పరోక్షంగా దళారులకు తక్కవ ధరకు విక్రయించుకోండని చెప్పకనే చెబుతున్నారు. 12శాతం తేమ నిబంధన రైతులకు శాపంగా మారింది. ఇప్పటికే సీసీఐ రాష్ట్రంలో పత్తి కొనుగోళ్లలో విఫలమైంది. అందుబాటులో ఉన్న 25 లక్షల టన్నుల పత్తి నిల్వల్లో కేవలం 1.20 లక్ష టన్నులే కొనుగోలు చేసింది. దీంతో రైతులకు మరోదారి లేక దళారులను ఆశ్రయిస్తున్నారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram