DOST – CPGET | దోస్త్ ద్వారానే సీపీగెట్ ప్ర‌వేశాలు.. వివ‌రాలివే..!

DOST - CPGET | రాష్ట్రంలోని అన్ని యూనివ‌ర్సిటీల ప‌రిధిలోని డిగ్రీ కోర్సుల్లో దోస్త్( DOST ) ద్వారా ప్ర‌వేశాలు క‌ల్పిస్తున్న సంగ‌తి తెలిసిందే. అయితే 2026-27 విద్యా సంవ‌త్స‌రానికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర ఉన్న‌త విద్యామండ‌లి కీల‌క నిర్ణ‌యం తీసుకుంది.

  • By: raj |    telangana |    Published on : Apr 23, 2026 9:01 AM IST
DOST – CPGET | దోస్త్ ద్వారానే సీపీగెట్ ప్ర‌వేశాలు.. వివ‌రాలివే..!

DOST – CPGET | రాష్ట్రంలోని అన్ని యూనివ‌ర్సిటీల ప‌రిధిలోని డిగ్రీ కోర్సుల్లో దోస్త్( DOST ) ద్వారా ప్ర‌వేశాలు క‌ల్పిస్తున్న సంగ‌తి తెలిసిందే. అయితే 2026-27 విద్యా సంవ‌త్స‌రానికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర ఉన్న‌త విద్యామండ‌లి కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. సీపీగెట్( CPGET ) ప్ర‌వేశాల‌ను దోస్త్ ద్వారా క‌ల్పించాల‌ని నిర్ణ‌యించింది. అయితే అన్ని పీజీ కోర్సులు కాకుండా కేవ‌లం ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సుల‌కు దోస్త్ ద్వారా అడ్మిష‌న్లు క‌ల్పించాల‌ని నిర్ణ‌యం తీసుకుంది. గ‌తేడాది వ‌ర‌కు కూడా ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సుల సీట్ల‌ను సీపీ గెట్ ద్వారానే భ‌ర్తీ చేశారు.

ఇక ఈ విద్యా సంవ‌త్స‌రం నుంచి.. ఎమ్మెస్సీ బ‌యో టెక్నాల‌జీ, ఎమ్మె్సీ కెమిస్ట్రీ, ఎమ్మెల్సీ కెమిస్ట్రీ(ఫార్మాస్యూటిక‌ల్ కెమిస్ట్రీ), ఎంఏ అప్లైడ్ ఎకాన‌మిక్స్, ఎంబీఏ వంటి కోర్సుల్లో దోస్త్ ద్వారా ప్ర‌వేశాలు క‌ల్పించ‌నున్నారు.

ఈ కోర్సుల్లో మొత్తం 370 సీట్లు అందుబాటులో ఉన్నాయ‌ని అధికారులు పేర్కొన్నారు. కాక‌తీయ‌, పాల‌మూరు, తెలంగాణ‌, మ‌హాత్మా గాంధీ యూనివ‌ర్సిటీతో పాటు తెలంగాణ ట్రైబ‌ల్ వెల్ఫేర్ రెసిడెన్షియ‌ల్ డిగ్రీ కాలేజీల్లోనూ ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సుల్లో ప్ర‌వేశాలు క‌ల్పించ‌నున్న‌ట్లు పేర్కొన్నారు.

అర్హులు వీరే..

ఇంట‌ర్ పూర్తి చేసిన విద్యార్థులు ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సుల‌కు అర్హులు. ఈ కోర్సుల వ‌ల్ల డిగ్రీతో పాటు పీజీ కూడా పూర్తి చేసే అవ‌కాశం ల‌భిస్తుంది అని ఉన్న‌త విద్యామండ‌లి చైర్మ‌న్, దోస్త్ క‌న్వీన‌ర్ ప్రొఫెస‌ర్ వీ బాల‌కిష్టా రెడ్డి ప్ర‌క‌టించారు.

దోస్త్ వెబ్‌సైట్ ఇదే.. https://dost.cgg.gov.in/welcome.do