విధాత: కేబినెట్ నుంచి బర్తరఫ్ కు గురైన మాజీ మంత్రి కొండా సురేఖకు సొంత వరంగల్ జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య నుంచి గట్టి సవాల్ ఎదురైంది. తన బర్తరఫ్ అనంతరం మీడియాతో మాట్లాడిన సందర్బంలో కొండా సురేఖ.. ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్యను ఉద్దేశించి పరోక్షంగా. భార్య కూడా ఓటు వేయని నాయకులు నాపై హీరో తరహాలో రెచ్చిపోతున్నారంటూ విమర్శించారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో కొండా సురేఖపై రగిలిపోయిన బస్వరాజు సారయ్య ఆసక్తికర సవాల్ విసిరారు. దమ్ముంటే కొండా సురేఖ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని, ఇద్దరం ఎన్నికల్లో ఇండిపెండెంట్‍గా పోటీ చేద్దామని బస్వరాజు సారయ్య సవాల్ చేశారు.
సీఎంను తిడితే ఊరుకోననని..అందుకే కొండా సుస్మిత వ్యాఖ్యలపైన, సురేఖపైన నేనే అధిష్టానానికి ఫిర్యాదు చేశానంటూ పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి అధిష్టానాన్ని బ్లాక్ మెయిల్ చేయలేదని..బ్లాక్ మెయిల్ కల్చర్ మొదటి నుంచి కొండా కుటుంబందేనని మండిపడ్డారు. వరంగల్ జిల్లా కాంగ్రెస్ రాజకీయాల్లో బస్వరాజు సారయ్య కు, కొండా ఫ్యామిలీకి గతం నుంచి రాజకీయ ఆధిపత్య పోరు కొనసాగుతుంది. కేబినెట్ నుంచి కొండా రేఖ బర్తరఫ్ నేపథ్యంలో మరోసారి ఇరువర్గాల మధ్య బహిరంగ సవాళ్లలు చోటుచేసుకోవడం వరంగల్ కాంగ్రెస్ రాజకీయాలను రసవత్తరంగా మారుస్తుంది.
మీడియాలో హైలెట్ కోసం సుస్మిత వ్యాఖ్యలు : గుండు సుధారాణి
సోషల్ మీడియాలో హైలైట్ అవ్వాలని కొండా సుస్మిత సీఎం రేవంత్ రెడ్డిపై అర్థం లేని మాటలు మాట్లాడుతున్నారని కాకతీయ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ చైర్‌పర్సన్ గుండు సుధారాణి అన్నారు. రాష్ట్రంలో అచ్చ కాంగ్రెస్.. పచ్చ కాంగ్రెస్ అంటూ ఏం లేవని, అంతా ఒకే జెండా.. ఎజెండా అని చెప్పుకొచ్చారు. ఇక నుంచి సీఎం రేవంత్ రెడ్డి, ప్రభుత్వంపై విమర్శలు చేస్తే మాత్రం సహించేది లేదని అన్నారు. వరంగల్‌లో మీడియాతో మాట్లాడుతూ.. తనకు చైర్ పర్సన్ పదవి వస్తుందని అసలు ఊహించలేదని అన్నారు. బీసీ బిడ్డగా సీఎం రేవంత్ రెడ్డి తనకు ఈ గౌరవం కల్పించినందుకు ధన్యవాదాలు చెబుతున్నానన్నారు. రాబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగురవేసి తీరుతామని అన్నారు. కొండా సురేఖపై ఎలాంటి కుట్రలు చేయాల్సిన అవసరం సీఎం లేదని తెలిపారు. నిత్యం నెగిటెవ్ ప్రచారంతో ప్రజల్లో నిలవాలని కొండా సురేఖ చూస్తున్నారని సుధారాణి విమర్శించారు.
