Deputy CM Bhatti | రుణమాఫీ పండుగను ఇంటిల్లిపాదితో జరుపుకోండి: డిప్యూటీ సీఎం భట్టి

రైతు రుణమాఫీ పండుగను మీ ఇంటిల్లిపాది అందరితో కలిసి జరుపుకోవాలని డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క రైతులకు సూచించారు

Deputy CM Bhatti | రుణమాఫీ పండుగను ఇంటిల్లిపాదితో జరుపుకోండి: డిప్యూటీ సీఎం భట్టి

11 లక్షల 50,193 మంది రైతులకు రూ. 6098.93 కోట్లు లబ్ధి
ఎన్నికల హామీ నిలబెట్టుకున్నాం..వ్యవసాయం లాభసాటిగా సాగాలి
మీ దీవెనలు..మా ప్రభుత్వంపై నిండుగా ఉండాలి
డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క

విధాత, హైదరాబాద్ : రైతు రుణమాఫీ పండుగను మీ ఇంటిల్లిపాది అందరితో కలిసి జరుపుకోవాలని డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క రైతులకు సూచించారు. రైతు రుణమాఫీ తొలి విడత లక్ష రూపాయల వరకు రుణమాఫీకి సంబంధించి గురువారం నిధుల విడుదల సందర్భంగా ఆయన రైతులనుద్ధేశించి ట్విటర్ వేదిగా సందేశం వినిపించారు. తెలంగాణ రైతన్నలకు రైతు రుణమాఫీ సందర్భంగా మా శుభాకాంక్షలని, మా నాయకుడు రాహుల్ గాంధీ ఇచ్చిన మాటను విశ్వసించి మాకు ఓట్లు వేసి కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారని, అందుకు మీ అందరికీ పేరుపేరునా నా ధన్యవాదాలని చెప్పారు. మీకు ఇచ్చిన మాట ప్రకారం రైతు రుణమాఫీ పథకం ద్వారా మీ ఖాతాలలో డబ్బులు జమ చేయడం జరిగిందని, వ్యవసాయం లభసాటిగా సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తెలంగాణ పునర్నిర్మాణంలో మునుముందు మీ అందరి ఆశీస్సులు దీవెనలు మా ప్రభుత్వం పై నిండుగా ఉండాలని కోరుకుంటూ ఈ రుణమాఫీ పండుగను మీ ఇంటిల్లిపాది అందరితో కలిసి జరుపుకోవాలని ఆకాంక్షించారు.

11లక్షల 50,193 మంది రైతులకు 6098.93 కోట్లు లబ్ధి

పంట రుణమాఫీ పథకం 2024 కోసం మార్గదర్శకాలు జీవో ఆర్టీ నెంబర్ 567ను ఈనెల 15వ తేదీన జారీ చేయబడిందని భట్టి తెలిపారు. తెలంగాణలో భూమి కలిగిన ప్రతి రైతు కుటుంబానికి రెండు లక్షల వరకు పథకం ప్రయోజనాలకు అర్హులని, 32 బ్యాంకులకు సంబంధించిన 4276 బ్యాంకు శాఖలు టీజీసీఏబీ కింద ఉన్న తొమ్మిది డీసీసీబీలు, రాష్ట్రంలోని ఐదు వాణిజ్య బ్యాంకులకు చెందిన 61 సీడెడ్ సొసైటీలు డేటాను సమర్పించాయని వెల్లడించారు. మొదటి విడతలో ఈరోజు గురువారం ప్రతి రైతు కుటుంబానికి ఒక లక్ష రూపాయల స్లాబ్ వరకు రుణమాఫీ పంపిణీ చేపట్టామన్నారు.

తద్వార 11 లక్షల 8171కుటుంబాలకు చెందిన 11 లక్షల 50 వేల 193 మంది రైతులకు 6098.93 కోట్లు లబ్ధి జరుగనుందన్నారు. మొదటి విడతలో అత్యధికంగా నల్గొండ జిల్లాలో 78,463 కుటుంబాలకు చెందిన 83124 రైతులకు 454.49 కోట్ల పంట రుణమాఫీ జరగనుందని, అదేవిధంగా ఆందోల్ నియోజకవర్గంలో 19186 కుటుంబాలకు చెందిన 20216 రైతులకు 107.83 కోట్ల పంట రుణమాఫీ జరగనుందని వివరించారు. పథకం గురించి రైతులు తమ సందేహాలను, ఇబ్బందులను పరిష్కరించుకోవడానికి వ్యవసాయ శాఖ సంచాలకులపరిష్కార విభాగాన్ని, లేదా ఐటి పోర్టల్ ద్వారా మండల స్థాయిలో స్థాపించిన సహాయ కేంద్రాల వద్ద సంప్రదించవచ్చని తెలిపారు.