Deputy CM Bhatti | ప్రత్యామ్నాయ మైనింగ్‌లోకి సింగరేణి విస్తరించాలి : డిప్యూటీ సీఎం భట్టి
సింగరేణి సంస్థ అభివృద్ధికి ఇతర మైనింగ్ రంగాల్లో విస్తరించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారులకు సూచించారు. అంబేద్కర్ సచివాలయంలో సంస్థ భవిష్యత్ ప్రణాళికలు, అభివృద్ధిపై జరిగిన సమీక్ష నిర్వహించారు

విధాత, హైదరాబాద్ : సింగరేణి సంస్థ అభివృద్ధికి ఇతర మైనింగ్ రంగాల్లో విస్తరించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారులకు సూచించారు. అంబేద్కర్ సచివాలయంలో సంస్థ భవిష్యత్ ప్రణాళికలు, అభివృద్ధిపై జరిగిన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెట్రోల్, డీజిల్, బొగ్గు వంటి సాంప్రదాయ ఇంధన వనరులకు కాలం చెల్లుతోందని.. భవిష్యత్ అంతా విద్యుత్తు బ్యాటరీలే కేంద్రంగా మారబోతున్నాయన్నారు. ఈ పరిస్థితుల్లో లిథియం, అనేక మూలకాల అన్వేషణ, వాటిని వెలికితీయడంపై సింగరేణి దృష్టి సారించాలన్నారు. సింగరేణి సంస్థ మెటల్స్, నాన్ మెటల్స్ మైనింగ్‌లో ప్రపంచవ్యాప్తంగా విస్తరించాలన్నారు. ఇందుకు అవసరమైతే ఓ కన్సెల్టెన్సీని నియమించుకోవాలని అధికారులకు స్పష్టం చేశారు. సింగరేణి సంస్థ తన మనుగడను కొనసాగిస్తూ ఆస్తులను, సంపదను సృష్టించుకోవాలని సూచించారు. తద్వారా రాష్ట్ర ప్రజల సంపదైన సింగరేణి ద్వారా ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పన జరుగుతుందన్నారు. గ్రీన్ ఎనర్జీలో భాగంగా రాష్ట్రంలో ఫ్లోటింగ్ సోలార్, పంప్డ్ స్టోరేజ్ పవర్ ప్లాంట్ల ఏర్పాటుకు సన్నాహకాలు చేస్తున్నట్లు అధికారులు డిప్యూటీ సీఎంకు వివరించారు. ఇందుకు సంబంధించి పూర్తీ డీపీఆర్‌లు రూపొందిస్తున్నామని.. త్వరలోనే వాటిని ప్రభుత్వానికి అందిస్తామని విక్రమార్కకు వివరించారు. ఒడిశాలోని నైనీ బ్లాక్‌లో బొగ్గు ఎప్పటినుంచి ఉత్పత్తి ఆరంభిస్తారని భట్టి ఆరా తీశారు. సమీక్షా సమావేశంలో ఎనర్జీ సెక్రెటరీ సందీప్ కుమార్ సుల్తానియా, స్పెషల్ సెక్రెటరీ కృష్ణభాస్కర్, సింగరేణి సీఎండీ బలరామ్ నాయక్ పాల్గొన్నారు.