Diwali Bonus for Singareni Workers | సింగరేణి కార్మికులకు రూ.400కోట్ల దీపావళి బోనస్ : డిప్యూటీ సీఎం భట్టి
సింగరేణి కార్మికులకు దీపావళి కానుకగా ₹400 కోట్ల బోనస్ ప్రకటిస్తున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు. బీసీ రిజర్వేషన్లకు బీజేపీ అడ్డుపడుతోందని విమర్శించారు. బీసీ బంద్‌లో పాల్గొనాలని, 42% రిజర్వేషన్లపై అక్టోబర్ 23న కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.

విధాత: సింగరేణి కార్మికులకు దీపావళి కానుకగా రూ.400 కోట్ల రూపాయల బోనస్ ప్రకటిస్తున్నట్లుగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు. ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. దేశానికి వెలుగులు పంచుతున్న సింగరేణి కార్మికులకు దీపావళి బోనస్ ప్రకటన పట్ల రాష్ట్ర ప్రభుత్వం తరఫున సంతోషం వ్యక్తం చేస్తున్నానని తెలిపారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ దక్కకుండా అడ్డుకున్నది కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మాత్రమే అని, బీజేపీ నైజం రాష్ట్ర ప్రజలకే కాదు దేశం మొత్తానికి తెలిసిపోయిందన్నారు. రాష్ట్రం నుంచి అఖిలపక్షంగా వచ్చి రాష్ట్రపతిని, ప్రధానమంత్రిని కలుస్తామని పదేపదే లిఖితపూర్వకంగా విజ్ఞప్తి చేసిన కేంద్ర నుంచి అనుమతి ఇవ్వలేదు అని భట్టి ఆరోపించారు.
ఈనెల 18న రాష్ట్రంలో బీజేపీకి వ్యతిరేకంగా జరుగుతున్న బీసీ బంద్ నిరసన కార్యక్రమంలో అందరూ పాల్గొనాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను అన్నారు. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, రాష్ట్ర బీజేపీఅధ్యక్షుడు రామచందర్ రావులు.. ప్రధాని మోదీ, రాష్ట్రపతి వద్ద బీసీ బిల్లు ఆమోదం కోసం సమయం తీసుకునేందుకు నాయకత్వం వహించాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు రాష్ట్రం నుంచి అఖిలపక్ష పార్టీలు బీజేపీ నాయకత్వంలో ఢిల్లీకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. మేము అడిగితే కేంద్ర పెద్దలు సమయం ఇవ్వడం లేదు అని విమర్శించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ పై కాంగ్రెస్ ప్రభుత్వానికి, పార్టీకి చిత్తశుద్ధి ఉంది అన్నారు. సుప్రీంకోర్టు తీర్పు కాపి రాగానే బీసీల రిజర్వేషన్ అంశంపై చర్చించి ఈనెల 23న జరగనున్న క్యాబినెట్ సమావేశంలో బీసీ రిజర్వేన్లపైన, స్థానిక సంస్థల ఎన్నికలపైన ఒక నిర్ణయం తీసుకుంటాం అని భట్టి తెలిపారు.