Deputy CM Bhatti | ప్రాజెక్టుల నాసిరకం పనులకు సుంకిశాల మరో నిదర్శనం: డిప్యూటీ సీఎం భట్టి
బీఆరెస్ ప్రభుత్వ హయంలో నిర్మించిన ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో నాసిరకం నిర్మాణాలకు, అవినీతికి కాళేశ్వరం మేడిగడ్డ సహా నల్లగొండ జిల్లా సుంకిశాల తాగునీటి పథకం మరో నిదర్శనమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆరోపించారు

కాంగ్రెస్ ప్రభుత్వంపై బురద చల్లెందుకు బీఆరెస్ యత్నం
విచారణకు ఆదేశిస్తామని ప్రకటించిన డిప్యూటీ సీఎం భట్టి
విధాత, హైదరాబాద్ : బీఆరెస్ ప్రభుత్వ హయంలో నిర్మించిన ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో నాసిరకం నిర్మాణాలకు, అవినీతికి కాళేశ్వరం మేడిగడ్డ సహా నల్లగొండ జిల్లా సుంకిశాల తాగునీటి పథకం మరో నిదర్శనమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆరోపించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటున్న కాళేశ్వరం ప్రాజెక్టులోనే నాణ్యత లేదనుకున్నామనని, బీఆరెస్ పాలకులు కమిషన్లు దండుకోవడంలో కృష్ణా నది పరిధిలోని ప్రాజెక్టులలో సైతం వదలలేదని సుంకిశాల ఘటనతో తేలిపోయిందన్నారు.
సుంకిశాల కూలిపోయిన తీరుతో బీఆరెస్ పాలన ఎలా ఉందో అర్ధమవుతుందన్నారు. సుంకిశాల రిటైనింగ్ వాల్ కూలిపోవడం బీఆరెస్ పుణ్యమేనని, రాష్ట్ర ప్రజల సొమ్మును వృధా చేశారని విమర్శించారు. 2021లో సుంకిశాల పథకానికి అనుమతులిచ్చిన బీఆరెస్ ప్రభుత్వం 2022లో నిర్మాణం ప్రారంభించారని తెలిపారు. బీఆరెస్ పాలకులు చేపట్టిన సుంకిశాల పథకం కూలిపోతే దానిని కాంగ్రెస్ ప్రభుత్వం పై నెట్టివేయాలని బీఆరెస్ చూస్తుందని మండిపడ్డారు. సుంకిశాల పంప్‌హౌజ్ రిటైనింగ్ వాల్ కూలిన ఘటనపై విచారణకు ఆదేశిస్తామని ప్రకటించారు.