పాలమూరు కాంగ్రెస్‌లో అసంతృప్తి జ్వాల

- టికెట్ రాని నేతల తలో దారి..
- అధిష్టానంపై నాగం విమర్శలు
- కొల్లాపూర్ లో జగదీశ్వర్ రావు అలక
- గద్వాలలో విజయకుమార్ సస్పెన్షన్
విధాత, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి: పాలమూరు కాంగ్రెస్ లో అసంతృప్తి జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. టికెట్ దక్కని ఆశావహులు తలో దారి వెతుక్కునే పనిలో నిమగ్నమయ్యారు. ఒకవైపు అధిష్టానంపై విమర్శలు గుప్పిస్తూనే, మరోవైపు పార్టీ వీడాలా? వద్దా? అనే సంశయంలో ఉన్నారు. కార్యకర్తల అభీష్టం మేరకు నిర్ణయం ప్రకటిస్తామని అంటున్నారు.
ఇంతకాలం పార్టీకి సేవ చేసినా ఫలితం లేదని వాపోతున్నారు. పార్టీలో వలస నేతలకు పెద్ద పీట వేసి, మమ్మల్ని తరిమి కొట్టారంటూ టికెట్ రాని నేతల ఆవేదన వర్ణనాతీతం. పార్టీని నమ్ముకున్న నేతలను విస్మరించి, వేరే ఎవరికో టికెట్ ఇస్తే తామెలా ప్రచారం చేస్తామని అసంతృప్తి నేతలు ప్రశ్నిస్తున్నారు. నాగర్ కర్నూల్ నియోజకవర్గంలో సీనియర్ నేత నాగం జనార్దన్ రెడ్డి పరిస్థితి దారుణంగా మారింది. ఇంతకాలం కాంగ్రెస్ కు సేవలందించిన ఆయనకు టికెట్ ఇవ్వలేదు.
ఇటీవల పార్టీలో చేరిన ఎమ్మెల్సీ కూచుకుళ్ళ దామోదర్ రెడ్డి కుమారుడు రాజేష్ రెడ్డికి టికెట్ ఇచ్చారు. నిన్న, మొన్న పార్టీలోకి వచ్చిన వారికి టికెట్ ఎలా ఇస్తారని కాంగ్రెస్ అధిష్టానం నేతలను నాగం ప్రశిస్తున్నారు. మొదటి నుంచి ఈ నియోజకవర్గం టికెట్ కోరుతున్నా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా రాజకీయాల్లో ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన నాగంకు టికెట్ నిరాకరించడంతో తీవ్ర మనస్తాపం చెందారు. పార్టీలో కొనసాగడంపై నిర్ణయాన్ని కార్యకర్తల అభీష్టం మేరకు తీసుకుంటానని నాగం ప్రకటించారు.
కాంగ్రెస్ అధిష్టానం నాగంను బుజ్జగిస్తుందా? లేదా పార్టీ నుంచి పంపిస్తుందా వేచిచూడాలి. కొల్లాపూర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన జూపల్లి కృష్ణారావు కు టికెట్ లభించడంతో, ఇంతకాలం పార్టీకి సేవలందించిన చింతలపల్లి జగదీశ్వర్ రావు రగులుతున్నారు. టికెట్ జూపల్లికి ఇవ్వొద్దని మొత్తుకున్నా అధిష్టానం పట్టించుకోలేదు. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీలో ఉంటారా? లేక రెబల్ అభ్యర్థిగా పోటీచేస్తారా? ప్రకటించాల్సి ఉంది.

విజయకుమార్ సస్పెండ్
గద్వాల నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో ఉండాలని ఆశించిన ఆపార్టీ సీనియర్ నేత డాక్టర్ విజయకుమార్ కు అధిష్టానం షాక్ ఇచ్చంది. ఇటీవల బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన గద్వాల జడ్పీ చైర్ పర్సన్ సరిత కు టికెట్ రావడంతో విజయకుమార్ ఖంగుతిన్నారు. ఇంతకాలం పార్టీకి పనిచేసినా ఫలితం దక్కలేదని ఆవేదన చెందుతున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ గన్ పార్క్ వద్ద తన ఆవేదన వెళ్ళగక్కుతూ టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు.
నోటుకు ఓటు కేసులో ఆరితేరిన రేవంత్ రెడ్డి ప్రస్తుతం సీటుకు రేటు అనే విధంగా ప్రవర్తించి భారీగా డబ్బులు దండుకుని సరిత కు టికెట్ ఇచ్చారని ప్లకార్డ్ లతో నిరసన చేపట్టారు. దీన్ని తీవ్రంగా పరిగణించిన కాంగ్రెస్ అధిష్టానం ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తే వేటు తప్పదనే సంకేతాన్ని ఇచ్చింది. అసంతృప్తి నేతలు పార్టీ అభ్యర్థికి మద్దతుగా ఉంటారా? లేదా సొంతంగా పోటీ చేసి రెబల్ గా మారుతారా? అనే విషయం త్వరలో తెలియనుంది. అసంతృప్తి నేతలతో పార్టీకి కొంత నష్టం జరుగుతుందనే భావనను రాజకీయ విశ్లేషకులు తెలుపుతున్నారు.