Kavitha| వారికి లీగల్ నోటీసులు..గుంటనక్కపై సీబీఐకి ఫిర్యాదు: కవిత

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత మరోసారి బీఆర్ఎస్ మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలపై తీవ్ర ఆరోపణలతో విరుచుకపడ్డారు. కవిత, ఆమె భర్తపై భూకబ్జా ఆరోపణలు చేసిన కూకట్ పల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి, టీ న్యూస్ చానెళ్లకు లీగల్ నోటీసులు పంపిస్తున్నట్లుగా వెల్లడించారు.

Kavitha| వారికి లీగల్ నోటీసులు..గుంటనక్కపై సీబీఐకి ఫిర్యాదు: కవిత

విధాత, హైదరాబాద్ : తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత (Kavitha) మరోసారి బీఆర్ఎస్ మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలపై తీవ్ర అవినీతి(BRS corruption) ఆరోపణలతో విరుచుకపడ్డారు. కవిత, ఆమె భర్తపై భూకబ్జా ఆరోపణలు చేసిన కూకట్ పల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి, టీ న్యూస్ చానెళ్లకు లీగల్ నోటీసులు పంపిస్తున్నట్లుగా వెల్లడించారు. శుక్రవారం జాగృతి కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన కవిత వారం రోజుల్లోగా మాపై అరోపణలు చేసిన మాధవరం, ఏలేటి, టీ, న్యూస్ చానెళ్లు క్షమాపణలు చెప్పాలని లేదంటే చట్టపరంగా ముందుకెలుతానని ప్రకటించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులపై నేను విమర్శలు చేస్తే..బీజేపీ నాయకులకు బాధ ఎందుకని ప్రశ్నించారు. మాధవరం కృష్ణారావు వెనుక ఉన్న గుంటనక్క వివరాలు త్వరలో బయటపెడుతానని, ఆ గుంట నక్కపై విజిలెన్స్, సీబీఐకి ఫిర్యాదు చేయబోతున్నట్లుగా తెలిపారు.

బీఆర్ఎస్ అవినీతి చిట్టా విప్పలేదు..టాస్ మాత్రమే వేశాను

బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 14ఏళ్లలో ఎన్నోఅవినీతి, అక్రమాలు, భూకబ్జాలు జరిగాయని కవిత ఆరోపించారు. తాను ఏదో ఒక రోజు సీఎం అవుతానని, అప్పుడు బీఆర్ఎస్ హాయంలో జరిగిన అన్ని విషయాలపై విచారణ జరిపిస్తానన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రుల అవినీతి చిట్టా తాను ఇంకా విప్పలేదని..తాను టాస్ మాత్రమే వేశానని, టెస్టు మ్యాచ్ ముందుందన్నారు. జనం బాటలో నా దృష్టికి వచ్చిన సమస్యలనే తాను ప్రస్తావించానని..బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అక్రమాలపై నాకు నిత్యం ఎన్నో ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఎంతోమందిని బెదిరించి డబ్బులు వసూలు చేశారన్నారు. ఇంతకాలం తాను ఆ విషయాలను వెల్లడించలేదని..ఇక ఊరుకోబోనన్నారు. తనపై విమర్శలు చేస్తే ప్రతిస్పందన ఘాటుగా ఉంటుందని హెచ్చరించారు. ఉద్యమ సమయంలో నా నగలు కుదవ పెట్టి మరి బతుకమ్మ నడిపించానని..మీలాగా నేను బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఒక్క రూపాయి లాభం పొందలేదని, అవినీతికి పాల్పడలేదని కవిత స్పష్టం చేశారు. మీరు చేసిన అవినీతిని నాపై రుద్దే ప్రయత్నం చేస్తే సహించేది లేదన్నారు. నేను నిజమాబాద్ ఎంపీగా ఢిల్లీలో ఉంటే…మీరు ఇక్కడ కేసీఆర్ నీడన పందికొక్కుల్లాగా దోచుకున్నారని కవిత ఆరోపించారు. బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేశాక కూడా ఇంకా మీ కళ్లు చల్లబడలేదా అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై మండిపడ్డారు. మీ వెనుక ఉన్న గుంటనక్కను మాత్రం వదిలేది లేదన్నారు.

హిల్ట్ పాలసీ తెచ్చిందే కేటీఆర్

హిల్ట్ పాలసీపై ఇప్పుడు బీఆర్ఎస్ గగ్గోలు పెట్టడం విడ్డూరంగా ఉందని..అసలు చేంజ్ ఆఫ్ ల్యాండ్స్ జీవోలపై సంతకం పెట్టిందే కేటీఆర్ అని కవిత కీలక ఆరోపణలు చేశారు. భూ కేటాయింపులు, బదలాయింపులపై బీఆర్ఎస్ కిటికీలు తెరిస్తే..కాంగ్రెస్ ప్రభుత్వం తలుపులు తెరిచి దోచుకుంటుందని కవిత ఆరోపించారు. బీఆర్ఎస్ పాలకులు అవినీతి చేశారని..వారిని అరెస్టు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి ఇప్పుడెందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. బీఆర్ఎస్ చేసిన అవినీతిలో కాంగ్రెస్ నేతల భాగస్వామ్యం కూడా ఉందని అందుకే చర్యలు లేవన్నారు. బీఆర్ఎస్ హయాంలోనే పరిశ్రమల భూమిని నివాస భూమిగా మార్చి మాధవరం కృష్ణారావు కొడుకు, కేటీఆర్ బినామీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డిలు భారీ విల్లాలు, అపార్ట్ మెంట్లు కట్టారని కవిత ఆరోపించారు. బీఆర్ఎస్ అవినీతిలో కాంగ్రెస్ కు భాగస్వామ్యం లేకపోతే.. పోచంపల్లి ఫామ్ హౌస్ కేసును ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదని కవిత నిలదీశారు. కృష్ణారావు, ఆయన కొడుకు వేసిన రియల్ ఎస్టేట్ వెంచర్ లో భారీ అక్రమాలు జరిగాయని.. పది ఎకరాలు ఉన్న చెరువును ఆరు ఎకరాలకు కుదించి..నాలుగు ఎకరాలను మింగారని..అదేమన్న మీ అయ్య జాగిరా అని ప్రశ్నించారు. ఊరు ప్రజలు ఉపయోగించుకోవాల్సిన చెరువు చుట్టూ ప్రహరి కట్టారని కేజీఎఫ్ సామ్రాజ్యాన్ని సృష్టించారని కవిత ఆరోపించారు.