డీఎస్సీ దరఖాస్తుల గడువు పొడిగింపు.. ఎప్పటి వరకు అంటే..?

విధాత: ఇప్పటికే డీఎస్సీ రాత పరీక్షలు వాయిదా పడగా, తాజాగా దరఖాస్తుల గడువును పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నెల 21తో గడువు ముగియనుండగా, ఆ గడువును 28వ తేదీ వరకు పొడిగించింది. ఈ మేరకు స్కూల్ ఎడ్యుకేషన్ ఉత్తర్వులు జారీ చేసింది. డీఎస్సీకి ప్రిపేరయ్యే అభ్యర్థుల విజ్ఞప్తుల మేరకు డీఎస్సీ దరఖాస్తుల గడువును పొడిగిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
వాస్తవానికి నోటిఫికేషన్‌లో ఇచ్చిన ప్రకారం ఈ నెల 21తో గడువు ముగుస్తుంది. రేపటి వరకు డబ్బులు చెల్లించేందుకు అవకాశం కల్పించగా, 21తో దరఖాస్తుల సమర్పణకు అవకాశం ఇచ్చారు. కానీ ఈ గడువును 28 వరకు పొడిగించారు. రాష్ట్రంలో 5089 టీచర్ పోస్టుల భర్తీకి కొద్ది రోజుల క్రితం నోటిఫికేషన్ వెలువడిన సంగతి తెలిసిందే.
కాగా, మంగళవారం సాయంత్రం నాటికి ఎస్‌జీటీ, ఎస్ఏ, భాషా పండిట్లు, పీఈటీ పోస్టులకు కలిపి మొత్తం 1,01,176 దరఖాస్తులు అందాయని పాఠశాల విద్యాశాఖ వర్గాలు వెల్లడించాయి. సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులకు 43,634 దరఖాస్తులు వచ్చాయి. స్కూల్ అసిస్టెంట్స్ సోషల్ స్టడీస్‌కు అత్యధికంగా 16,311, బయోలాజికల్ సైన్స్‌కు 13,547 దరఖాస్తులు వచ్చాయి.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నవంబర్ 20 నుంచి 30 వరకు నిర్వహించాల్సిన డీఎస్సీ పరీక్షలను వాయిదా వేసిన విషయం విదితమే. వాయిదా పడ్డ పరీక్షలను వచ్చే ఏడాది ఫిబ్రవరిలో నిర్వహించే అవకాశం ఉంది. తేదీలు ఇంకా ఖరారు కాలేదు.