మాదాపూర్‌ డ్రగ్స్‌ వ్యవహారంలో కీలక పరిణామం.. నవదీప్‌కు ఈడీ నోటీసులు

మాదాపూర్‌ డ్రగ్స్‌ వ్యవహారంలో కీలక పరిణామం.. నవదీప్‌కు ఈడీ నోటీసులు

విధాత‌: డ్రగ్స్‌ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకున్నది. టాలీవుడ్‌ నటుడు నవదీప్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 10న నవదీప్‌ హాజరుకావాలని నోటీసులు జారీ చేసింది. ఇటీవల సంచలనంగా మారిన మాదాపూర్‌ డ్రగ్స్‌ వ్యవహారంలో నవదీప్‌ పేరు ప్రముఖంగా వినిపించింది. నార్కోటిక్స్‌ బ్యూరో కేసులో నిందితుడిగా చేర్చడంతో పాటు సుధీర్ఘంగా విచారించిన విషయం విధితమే.


ఈ క్రమంలోనే నార్కోటిక్స్‌ బ్యూరో కేసు ఆధారంగానే ఈడీ నవదీప్‌కు నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. గతంలోనూ టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసులో నవదీప్‌ పేరు వెలుగులోకి వచ్చిన విషయం తెలిసింది. ఆ సమయంలోనూ పలువురు హీరో హీరోయిన్లను ఈడీ విచారించింది. ఆ సయంలో నవదీప్‌కు ఈడీ నోటీసులు జారీ చేసింది. అప్పుడు ఈడీ విచారణకు హాజరుకాలేదు.


మాదాపూర్‌ డ్రగ్స్‌ పార్టీ వ్యవహారంలోనూ పేరు ప్రముఖంగా వినిపించడంతో తాఖీదులు పంపినట్లు తెలుస్తున్నది. ఇందుకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. డ్రగ్స్‌ వ్యవహారంలో నార్కోటిక్స్‌ బ్యూరో నటుటి ఇంట్లో సోదాలు నిర్వహించింది. ఈ కేసులో 37వ నిందితుడిగా చేర్చారు. డ్రగ్స్‌ కేసులో అరెస్టయిన రాంచందర్‌ నుంచి హీరో నవదీప్‌ డ్రగ్స్‌ తీసుకున్నట్లు నార్కోటిక్స్‌ బ్యూరో అప్పట్లో తెలిపింది.


మరోవైపు, మాదాపూర్ డ్రగ్స్ కేసులో నవదీప్ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు ఇటీవల కొట్టివేసింది. నవదీప్ బెయిల్ రద్దు చేయాలని పోలీసులు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపింది. బెయిల్‌ను రద్దు చేయాలని కోరిన అధికారులు.. నిందితులతో నటుడికి సంబంధాలున్నాయని కోర్టుకు తెలిపారు. అయితే, వాదనలు విన్న కోర్టు 21ఏ కింద నోటీసులు ఇచ్చి విచారించాలని ఆదేశించింది. ఈ మేరకు పోలీసులు నోటీసులు జారీ చేసి విచారించారు.