రాడిసన్ డ్రగ్స్‌ కేసులో సినీ నటి! 8వ నిందితుడిగా డైరెక్టర్ క్రిష్

గచ్చిబౌలి రాడిసన్‌ హోటల్‌ డ్రగ్స్‌ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో టాలీవుడ్‌ డైరెక్టర్‌ క్రిష్‌ జాగర్లమూడి పేరు తెరపైకి వచ్చింది

రాడిసన్ డ్రగ్స్‌ కేసులో సినీ నటి! 8వ నిందితుడిగా డైరెక్టర్ క్రిష్
  • డైరక్టర్‌ క్రిష్‌ సహా ఐదుగురు సినీ సెలబ్రెటీలు
  • 10మందిపై ఎఫ్‌ఐఆర్‌


విధాత, హైదరాబాద్‌ : గచ్చిబౌలి రాడిసన్‌ హోటల్‌ డ్రగ్స్‌ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో టాలీవుడ్‌ డైరెక్టర్‌ క్రిష్‌ జాగర్లమూడి పేరు తెరపైకి వచ్చింది. ఈ కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్‌లో గచ్చిబౌలి పోలీసులు డైరెక్టర్ క్రిష్ పేరును చేర్చారు. డ్రగ్స్‌ పెడ్లర్‌ అబ్బాస్ స్టేట్‌మెంట్‌లో క్రిష్‌ పేరు ప్రస్తావించినట్లు పోలీసులు పేర్కొన్నారు. పార్టీ జరిగే సమయంలో వివేకానందతో పాటు రాడిసన్‌ హోటల్‌లో డైరెక్టర్‌ క్రిష్‌ ఉన్నట్లు తెలిపారు.


గజ్జెల వివేక్‌ నిర్వహించిన పలు పార్టీలకు క్రిష్‌ హాజరైనట్లు పోలీసులు గుర్తించారు. దీంతో ఈ కేసులో ఆయన పేరును కూడా చేర్చారు. అయితే, ఆయన డ్రగ్స్ తీసుకున్నారా లేదా అనేది తెలియాల్సి ఉంది. క్రిష్‌తో పాటు టాలివుడ్‌ సినీ సెలబ్రెటీలు కేథార్‌నాథ్‌, లిషి గణేశ్‌, నిర్భయల్‌ల పేర్లను కూడా పోలీసులు కేసులో చేర్చారు. ఆ ఐదుగురిని విచారించి వారి శాంపిల్స్‌ను సేకరించి ల్యాబ్‌కు పంపిస్తామని పోలీసుల తెలిపారు.


లిషి గణేశ్‌ సోదరి కుషిత కూడా డ్రగ్స్‌ వాడుతున్నట్లుగా పోలీసులు భావిస్తున్నారు. ఎఫ్‌ఐఆర్‌లో క్రిష్‌ను ఎ-8గా పేర్కొన్నారు. డ్రగ్‌ పార్టీ సమయంలో తాను రాడిసన్ బ్లూ హోటల్‌లో ఉన్నది నిజమేనని క్రిష్‌ పోలీసుల విచారణలో అంగీకరించారు. ఫ్రెండ్స్ పిలవడంతో వెళ్లానని, హోటల్లో అరగంటే ఉన్నానని, ఆ తర్వాత డ్రైవర్ రాగానే వెళ్లిపోయానని స్పష్టం చేశారు.


ఈ విషయంపై పోలీసులు తనను ప్రశ్నించారని, అక్కడికి ఎందుకు వెళ్లానో ఎవరిని కలిశానో పోలీసులకు స్టేట్మెంట్ ఇచ్చినట్లు క్రిష్ పేర్కొన్నారు. ఇదే డ్రగ్స్ కేసులో మరోసారి పట్టుబడ్డ మోడల్ లిషి గణేష్ రెండేళ్ల క్రితం రాడిసన్ హోటల్, మింక్ పబ్ డ్రగ్ కేసులో తన సోదరి కల్లపు కుషితతో కలిసి పట్టుబడగా లిషి గణేష్ మరోసారి పట్టుబడింది. ఈ అక్కచెల్లెళ్ళు గతంలో డ్రగ్స్ కేసులో పట్టుబడిన సమయంలో మేము డ్రగ్స్ తీసుకోలేదని, పార్టీకి వచ్చి చీజ్ బజ్జీలు మాత్రమే ఆర్డర్ ఇచ్చామని ప్రకటించారు.


మళ్లీ టాలీవుడ్‌లో డ్రగ్స్‌ కలకలం


రాడిసన్‌ బ్లూ హోటల్‌ డ్రగ్‌ కేసులో డైరక్టర్‌ క్రిష్‌ సహా ఐదుగురు టాలీవుట్‌ సినీ సెలబ్రెటీల పేర్లు తెరపైకి రావడంతో మరోసారి టాలీవుడ్ ఇండస్ట్రీలో డ్రగ్స్ కలకలం మొదలైంది. మరికొందరు సినీ సెలబ్రిటీల పాత్రపైనా పోలీసులు ఆరా తీస్తున్నారు. 2018లో దర్శకుడు పూరీ జగన్నాథ్, నటులు చార్మి, తరుణ్, నవదీప్, రవితేజ తదితరులపై కేసులు నమోదు కాగా పూరీ, తరుణ్ వెంట్రుకలు, గోళ్ల శాంపిల్స్ను ఫోరెన్సిక్ ల్యాబ్ పంపారు.


అందులో డ్రగ్స్ అనవాళ్లు లేవని తేలడంతో సాక్ష్యాధారాలు లేవంటూ మొత్తం 8 కేసుల్లో అరింటిని కోర్టు ఇటీవలే కొట్టివేసింది. అయితే ఇటీవలే డ్రగ్స్‌తో ఓ యువతి పట్టుబడగా ఆమె టాలీవుడ్ యువ హీరో లవర్ అంటూ ఊహాగానాలు వినిపించాయి. యూట్యూబర్, బిగ్బాస్ ఫేం షణ్ముక్ సైతం రెండురోజుల క్రితం గంజాయితో దొరికాడు. ఈ క్రమంలోనే డ్రగ్స్ కేసులో మరోసారి టాలీవుడ్ లింక్ వెలుగులోకి రావడం హాట్ టాపిక్ గా మారింది.


10మందిపై ఎఫ్‌ఐఆర్‌


కాగా హైదరాబాద్‌లోని స్టార్‌ హోటల్‌లో డ్రగ్స్‌తో పార్టీలు చేసుకుంటున్న రాజకీయ, వ్యాపార, సినీ పరిశ్రమతో సంబంధమున్న ముఠాను ఎస్‌వోటీ పోలీసులు సోమవారం అరెస్ట్‌ చేశారు. సైబరాబాద్‌ కమిషనరేట్‌లో సీపీ అవినాశ్‌ మహంతి వెల్లడించిన వివరాల ప్రకారం గచ్చిబౌలిలోని రాడిసన్‌ బ్లూ హోటల్‌లో కొకైన్‌తో డ్రగ్‌ పార్టీ జరుగుతున్నట్టు సమాచారం అందడంతో పోలీసులు హోటల్‌పై దాడిచేశారు.


అప్పటికే ముఠా పరారు కావడంతో పార్టీ నిర్వాహకుడైన మంజీర గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీస్‌ డైరెక్టర్‌ గజ్జల వివేకానంద ఇంటికి వెళ్లి సోదాలు చేశారు. అక్కడ ఆయనకు పరీక్షలు నిర్వహించగా డ్రగ్స్‌ వాడినట్టు తేలడంతో అదుపులోకి తీసుకున్నారు. ఆయన ఇచ్చిన సమాచారంతో సయ్యద్‌ అబ్బాస్‌ అలీ జెఫ్రీ, నిర్భయ్‌, కేదార్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. పరారీలో ఉన్న మరో ఆరుగురి కోసం వేట ప్రారంభించారు. నిందితుల నుంచి కొకైన్‌ వాడిన కవర్లు, డ్రగ్స్‌కు ఉపయోగించిన పేపర్లు, మూడు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.


ఈ కేసులో ఇప్పటిదాకా 10మందిపై కేసు నమోదు చేశారు. విచారణ క్రమంలో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. ప్రధాన నిందితుడు వివేకానంద బీజేపీ నేత యోగానంద కొడుకు కాగా, కేదార్‌ అలియాస్‌ కేదార్‌నాథ్‌ పలు కంపెనీల్లో డైరెక్టర్‌గా ఉన్నాడు. సినిమా నిర్మాతగానూ వ్యవహరిస్తున్నాడు. ఇక రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసులో వివేకానంద రిమాండ్‌ను కోర్టు తిరస్కరించింది. వ్యక్తిగత పూచీకత్తుపై వివేకానంద విడుదల చేసింది.