Actor Sriram| నటుడు శ్రీరామ్‌కు 14 రోజుల జ్యుడీషియల్‌ కస్టడీ

Actor Sriram| నటుడు శ్రీరామ్‌కు 14 రోజుల జ్యుడీషియల్‌ కస్టడీ

Actor Sriram|  డ్రగ్స్ కేసులో అరెస్టయిన తమిళ సినీ నటుడు శ్రీరామ్‌(శ్రీకాంత్)కు చైన్నై కోర్టు జూలై 7వరకు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. డ్రగ్స్ కేసులో చైన్నై పోలీసులు శ్రీరామ్ ను ఎనిమిది గంటల పాటు సుదీర్ఘ విచారణ జరిపారు. అనంతరం చైన్నై కోర్టులో శ్రీరామ్ ను హాజరుపరుచగా..విచారణ చేసిన కోర్టు అతడికి 14 రోజుల జ్యుడీషియల్‌ కస్టడీ విధించింది. విచారణలో శ్రీరామ్ కు మాదక ద్రవ్యాల నెట్‌వర్క్‌లో ప్రమేయం ఉన్నట్లు పోలీసులు ఆధారాలు గుర్తించి వివరాలు సేకరించినట్లు తెలుస్తోంది.

చెన్నై నుంగంబాక్కంలో గత నెల ఓ బార్‌లో చోటుచేసుకున్న ఘర్షణ సందర్భంగా అన్నాడీఎంకే నాయకులు ప్రసాద్, అజయ్‌ వాండైయార్‌లను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించడంతో డ్రగ్స్ దందా వెలుగుచూసింది. వారు మత్తు పదార్థాలు వాడినట్లు ఫిర్యాదులు రావడంతో వాటిని ఎవరి నుంచి కొనుగోలు చేశారని, ఎవరెవరికి సరఫరా చేశారని పోలీసులు విచారణ చేశారు. ప్రసాద్, అజయ్ లు ఇచ్చిన సమాచారం మేరకు ప్రదీప్‌కుమార్‌ను అదుపులోకి తీసుకుని విచారించారు. తాము ప్రదీప్‌ ద్వారా నటుడు శ్రీరామ్ కు మత్తుపదార్థాలు సరఫరా చేసినట్లు తెలిపారు. ప్రసాద్ నుంచి శ్రీరామ్ కొకైన్‌ కొనుగోలు చేశారని, దానికి సంబంధించి నగదును ఆన్‌లైన్‌లో చెల్లించారని దర్యాప్తులో వెల్లడైంది. సోమవారం శ్రీరామ్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని రక్త నమూనాలను ల్యాబ్‌కు పంపించగా.. మత్తు పదార్థాలు ఉపయోగించినట్లు నిర్ధారణ అయింది. దాంతో వారు శ్రీరామ్‌ను అరెస్టు చేశారు. విచారణ అనంతరం చైన్నై కోర్టు 14రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది.