Drugs Case విధాత: ‘కబాలి’ తెలుగు వెర్షన్ విడుదల చేసి.. నిర్మాతగా సినీ జనాల్లో మసులుతూ, క్రేజ్ ఉన్న తారలందరితోనూ ఫోటోలు, పరిచయాలు పెంచుకున్న నిర్మాత కేపీ చౌదరి. ఈయన ఇటీవల డ్రగ్స్ అమ్ముతూ పట్టుబడటం, సినీ ప్రపంచాన్ని ఓ ఊపు ఊపేస్తుంది. అతనితో సన్నిహితంగా మెలిగిన వారి గుండెల్లో అయితే ఏకంగా రైళ్ళే పరిగెడుతున్నాయి. పోలీసుల విచారణలో తెలుగు సినీ లోకంలోని వారి పేర్లు కూడా బయటికి వస్తుండటంతో.. ఇండస్ట్రీలో దాదాపు ఓ చిన్న తుఫానే […]
Drugs Case
విధాత: ‘కబాలి’ తెలుగు వెర్షన్ విడుదల చేసి.. నిర్మాతగా సినీ జనాల్లో మసులుతూ, క్రేజ్ ఉన్న తారలందరితోనూ ఫోటోలు, పరిచయాలు పెంచుకున్న నిర్మాత కేపీ చౌదరి. ఈయన ఇటీవల డ్రగ్స్ అమ్ముతూ పట్టుబడటం, సినీ ప్రపంచాన్ని ఓ ఊపు ఊపేస్తుంది. అతనితో సన్నిహితంగా మెలిగిన వారి గుండెల్లో అయితే ఏకంగా రైళ్ళే పరిగెడుతున్నాయి. పోలీసుల విచారణలో తెలుగు సినీ లోకంలోని వారి పేర్లు కూడా బయటికి వస్తుండటంతో.. ఇండస్ట్రీలో దాదాపు ఓ చిన్న తుఫానే మొదలైంది.
అయితే ఇప్పటికే ఈ కేసుతో సంబంధం ఉందని భావిస్తున్న పలువురి నటీనటుల పేర్లు బయటకువచ్చాయి. క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖా వాణి, జ్యోతిలపై డ్రగ్స్ తీసుకునే ఉంటారనే రూమర్లు కాస్త ఎక్కువగానే వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయంగా సురేఖా వాణి ఓ వీడియోను విడుదల చేసింది. తన మీద వస్తున్నవన్నీ లేనిపోని ఆరోపణలని, తనకు ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదని, ఇలా తనకు సంబంధం లేని విషయంలోకి తనను లాగితే కుటుంబం, పిల్లల భవిష్యత్ నాశనం అవుతుందని వీడియో ద్వారా వేడుకుంది.
మంచి మిత్రుడిగా మాత్రమే కేపీ చౌదరి తనకు తెలుసునని చెప్పింది. కుటుంబాల మధ్య ఉన్న పరిచయం తప్పితే తనకు ఈ డ్రగ్స్ కేసుతో ఎలాంటి సంబంధం లేదని, ఈ కేస్ విషయంగా తాను ఎలాంటి విచారణకైనా, నార్కొటిక్ టెస్ట్ కైనా సిద్ధమేనని చెప్పుకొచ్చింది. తప్పు చేయనప్పుడు ఎవరికీ భయపడాల్సిన పనిలేదు.. మా పిల్లల మధ్య స్నేహం తప్పితే మరేమీ లేదని తెలిపింది.
ఈ విషయంలో పూర్తి వివరాలు తెలియకుండా లేనిపోనివి ప్రచారం చేయడం భావ్యం కాదని తన ఆవేదనను వీడియో ద్వారా సోషల్ మీడియాలో పంచుకుంది సురేఖా వాణి. మరో వైపు జ్యోతి, అషు రెడ్డి పేర్లు కూడా కేపీ చౌదరి లిస్ట్‌లో ఉండటంతో.. వారిపై కూడా ఆరోపణలు గుప్పుమంటున్నారు. వారు కూడా ఈ విషయంలో ఫైర్ అవుతున్నారు.
కేపీ చౌదరి జస్ట్ తెలుసు అంతే.. అంత మాత్రానికే డ్రగ్స్ తీసుకున్నట్లుగా మా పేర్లని బయటపెడతారా? అంటూ కేసుల వరకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. మొత్తంగా అయితే.. రోజు రోజుకూ కొత్త మలుపులు తీసుకుంటున్న కేపీ చౌదరి డ్రగ్స్ కేసు వ్యవహారం.. ఎప్పుడు ఎవర్ని తన ఖాతాలో జమేసుకుంటుందో అని అటు సినీ జనాలు, ఇటు ప్రేక్షకులు కాస్త ఆతృతగానే ఎదురు చూస్తున్నారు. చూద్దాం ఏం జరగనుందో.