TG Local Body Election Notification | తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు నేడే నోటిఫికేషన్?

తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి అక్టోబర్ 9న నోటిఫికేషన్ జారీ అయ్యే అవకాశం ఉంది. ఎంపీటీసీ, జడ్పీటీసీ తొలి విడత నోటిఫికేషన్ నేడు విడుదల కానుంది.

TG Local Body Election Notification | తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు నేడే నోటిఫికేషన్?

స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం అక్టోబర్ 9న నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉంది. స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు నుంచి ఎలాంటి అడ్డంకులు లేనందున నోటిఫికేషన్ జారీ చేసే అవకాశాలున్నాయి. హైకోర్టు ఆదేశాల మేరకు నడుచుకుంటామని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ పై స్టే ఇవ్వాలని పిటిషనర్లు కోరినా కూడా హైకోర్టు నిరాకరించింది. హైకోర్టులో బుధవారం నాడు జరిగిన విచారణకు సంబంధించిన అంశాలపై రాష్ట్ర ఎన్నికల సంఘం న్యాయ నిపుణులతో చర్చిస్తోంది. హైకోర్టు ఇప్పటివరకు స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఎలాంటి అడ్డంకులు చెప్పనందున నోటిఫికేషన్ జారీ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనే న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల కు రాష్ట్ర ఎన్నికల సంఘం సెప్టెంబర్ 29న షెడ్యూల్ ను విడుదల చేసింది.

రాష్ట్రంలో ఐదు దశల్లో స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించనున్నారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను రెండు విడతలుగా, గ్రామ పంచాయితీ ఎన్నికలను మూడు విడతల్లో నిర్వహిస్తారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను రెండు విడతల్లో నిర్వహిస్తారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ తొలి విడత ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ ను రాష్ట్ర ఎన్నికల సంఘం అక్టోబర్ 9న విడుదల చేయనుంది. అక్టోబర్ 23న తొలి విడత, అక్టోబర్ 27న రెండో విడత ఎన్నికలను నిర్వహిస్తారు. ఇక గ్రామ పంచాయితీ ఎన్నికలను తొలి విడత అక్టోబర్ 31న నిర్వహిస్తారు. రెండో విడత నవంబర్ 4న,మూడో విడత నవంబర్ 8న నిర్వహించనున్నారు. గ్రామ పంచాయితీ ఎన్నికల ఫలితాలు అదే రోజున వెలువడుతాయి.నవంబర్ 11న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఫలితాలు వెల్లడిస్తారు. అక్టోబర్ 13న ఎంపీటీసీ, జడ్పీటీసీలకు రెండో విడత ఎన్నికల నిర్వహణకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల కానుంది. ఇక అక్టోబర్ 17న తొలి విడత , అక్టోబర్ 21న రెండో విడత, అక్టోబర్ 25న మూడో విడత గ్రామ పంచాయితీ ఎన్నికలకు నోటిఫికేషన్ ను ఎన్నికల సంఘం జారీ చేయనుంది. మొదటి విడత 2,963 ఎంపీటీసీలకు, 292 జడ్పీటీసీలకు ఎన్నికలు జరుగుతాయి. రెండో విడతలో 2,786 ఎంపీటీసీ, 273 జడ్పీటీసీలకు ఎన్నికలు నిర్వహిస్తారు.