బీఆర్ఎస్ మళ్లీ టిఆర్ఎస్‌గా మార్పు: ఎర్రబెల్లి దయాకర్ రావు

- టాపింగ్ కేసులో ఇరికించే కుట్ర
- మాజీమంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావువిధాత, వరంగల్ ప్రతినిధి: టిఆర్ఎస్ పార్టీ అదే.. బీఆర్‌ఎస్ పార్టీ నుంచి మళ్లీ పోటీ చేస్తా.. పార్టీ పేరును మళ్ళీ టిఆర్ఎస్‌గా మార్చాలని చూస్తున్నాం.. అదే టిఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానంటూ మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పార్టీ మార్చడంపై వ్యాఖ్యానించారు. శనివారం పాలకుర్తి నియోజకవర్గం కేంద్రంలో చేపట్టిన రైతు దీక్ష లో మాజీ మంత్రి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడుతూ పార్టీ పేరును తిరిగి టిఆర్ఎస్ గా మార్చేందుకు ప్రయత్నిస్తున్నామని మాటల సందర్భంలో చెప్పారు. దీంతో అక్కడ ఉన్న పార్టీ కార్యకర్తలు కూడా అదే ఒరిజినల్ అంటూ వ్యాఖ్యానించారు. మంత్రి మాటలకు మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడుతూ 40 ఏళ్ల నా రాజకీయ జీవితంలో నేను ఎలాంటి తప్పు చేయలేదని అన్నారు. నన్ను జైలుకు పంపియాలని కాంగ్రెస్ నాయకులు ప్రయత్నిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఫోన్ టాపింగ్ కేసులో నన్ను ఇరికించేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. గతంలో నేను ప్రజా సమస్యల పైన పోరాటం చేసి జైలుకుపోయిన, ఇప్పుడు మరోసారి సమస్యలపై పోరాడుతుంటే జైలుకు పంపించేందుకు కుట్ర చేస్తున్నారని అన్నారు. మళ్లీ ఎన్నికల్లో ఇక్కడి నుంచి పోరాటం చేస్తా… నాపై ఇటు పోతారు… అటు పోతారు అంటూ పార్టీ మారుతారని ప్రచారాన్ని మీరు నమ్మకూడదని కోరారు. మీరు అధైర్యపడకూడదని కార్యకర్తలకు భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు.
కరువుతో రైతులు గోస పడుతున్నారని వివరించారు. పంటలు ఎండిపోయి ఇబ్బంది పడుతున్నారని చెప్పారు గతంలో తమ ప్రభుత్వ సహాయం లో నీళ్లు తెచ్చినం, కరెంటు తెచ్చినం, రైతుల వెంబడి ఉన్నామన్నారు. ఇప్పటికైనా రైతులను కాపాడుకుందాం… ఇప్పుడు రైతుల పరిస్థితి చూస్తే ఏడుపొస్తుందన్నారు. మన దగ్గర పంటలు ఎండిపోలేదని అబద్ధ ప్రచారం చేస్తున్నారని వేల ఎకరాలు ఎండిపోతే మూడు నాలుగు గుంటల్లో ఎండిపోయినట్లు చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్కటి కాదు వందల బోర్లు వేసినా రైతులకు నీళ్లు రావడం లేదని, రైతుల కాడ మోసం చేయొద్దని విన్నవించారు.