కుంగిన మేడిగడ్డ వంతెన.. కేసీఆర్ రాజీనామా చేయాలని ఈటల డిమాండ్

విధాత: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా చేపట్టిన మేడిగడ్డ(లక్ష్మీ బ్యారేజీ) వంతెన కుంగిపోవడంపై భారతీయ జనతా పార్టీ నాయకులు ఈటల రాజేందర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనకు ముఖ్యమంత్రి కేసీఆర్ పూర్తి బాధ్యత వహించి, సీఎం పదవికి రాజీనామా చేయాలని ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
ఈటల రాజేందర్ సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. గతంలో తమ్మిడిహట్టి వద్ద 160 టీఎంసీలతో ప్రాజెక్టు చేపట్టారు. ఆ ప్రాజెక్టు విషయంలో గత పాలకుల ఆనవాళ్లు ఉండొద్దనే ఉద్దేశంతో కాళేశ్వరం ప్రాజెక్టును కేసీఆర్ చేపట్టారు. తదనంతరం టెండర్లు పిలిచారు.
అంతర్జాతీయ కాంట్రాక్టర్లు టెండర్లలో పాల్గొనలేదు. కాళేశ్వరం ప్రాజెక్టును అనుభవం ఉన్న కాంట్రాక్టర్లు చేపట్టలేదు. 1.62 కిలోమీటర్ల మేర బ్యారేజ్ సైట్‌ను కేసీఆర్ ఎంపిక చేశారు. సాయిల్ పరీక్ష చేయడానికే ఏండ్ల సమయం పడుతుంది. కానీ అలాంటి పరీక్షలేవి చేయకుండా ప్రాజెక్టు పనులు చేపట్టారని ఈటల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
లక్ష్మీ బ్యారేజీ కట్టినప్పటి నుంచే లీక్‌లు అవుతున్నాయని ఈటల గుర్తు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం తప్పిదాల వల్ల రూ. వేల కోట్ల నష్టం జరిగిన పరిస్థితి నెలకొంది. మేడిగడ్డ వంతెన కుంగడంతో పరిసరాల ప్రజలు తీవ్ర భయాందోళనలో ఉన్నారు. బ్యారేజీ పునరుద్ధరించకపోతే ఏండ్ల తరబడి నీల్లు వచ్చే పరిస్థితి లేదు. బ్యారేజీ వద్దకు ఎవర్నీ రాకుండా ఆ పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించారు.
ఈ ఐదేండ్లలో ప్రాజెక్టు ద్వారా ఎత్తిపోసింది కేవలం 172 టీఎంసీలే అని తెలిపారు. ఈ నీటిని ఎత్తిపోసేందుకు విద్యుత్ బిల్లుల కోసం రూ. 9 వేల కోట్లు ఖర్చు పెట్టారు. ప్రాజెక్టుకు పెట్టిన రూ. లక్ష కోట్లు గంగపాలవడం బాధిస్తోంది. పూర్తి బాధ్యత కేసీఆర్ వహించి రాజీనామా చేయాలి. వంతెన కుంగిన ఘటనపై నిపుణుల కమిటీ వేసి శ్వేతపత్రం విడుదల చేయాలి అని ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు.