జర్నలిస్టులకు ఆర్థికసాయం: మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి
జర్నలిస్టుల రాష్ట్ర సంక్షేమ నిధి నుంచి 25 మంది వర్కింగ్ జర్నలిస్టులకు సోమవారంనాడు ఆర్థిక సహాయం మంజూరు చేసినట్లు తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ కే. శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.

హైదరాబాద్, ఆగస్ట్ 18 ( విధాత): జర్నలిస్టుల రాష్ట్ర సంక్షేమ నిధి నుంచి 25 మంది వర్కింగ్ జర్నలిస్టులకు సోమవారంనాడు ఆర్థిక సహాయం మంజూరు చేసినట్లు తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ కే. శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. నాంపల్లిలోని తెలంగాణ మీడియా అకాడమి కార్యాలయంలో జరిగిన జర్నలిస్టుల సంక్షేమ నిధి కమిటీ 3వ సమావేశం చైర్మన్ కే. శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన జరిగింది. ఆర్థిక సహాయం కోసం వచ్చిన దరఖాస్తులను కమిటీ సభ్యులు పరిశీలించి 18 మంది మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు, తీవ్ర ప్రమాదాలకు గురైన, దీర్ఝకాలికంగా అనారోగ్యం బారిన పడిన ఏడుగురు జర్నలిస్టులకు కూడా కమిటీ ఆర్థిక సహాయం మంజూరు చేసినట్లు తెలిపారు.
ఈ కమిటీ సమావేశంలో ఎంపికైన 18 మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు ఒక లక్ష రూపాయల చొప్పున ఆర్థిక సాయం, అలాగే ఆయా కుటుంబాలకు ఆగష్టు, 2025 మాసం నుండి ప్రతి నెల మూడు వేల రూపాయల చొప్పున పెన్షన్ ఐదు సంవత్సరాల పాటు అందజేస్తామని ఆయన తెలిపారు. మరణించిన జర్నలిస్టుల కుటుంబాలలో ఎల్.కే.జి నుండి పదవ తరగతి వరకు చదువుతున్న ఇద్దరు పిల్లలకు ఒక్కొక్కరికి నెలకు ఒక వెయ్యి రూపాయల చొప్పున ట్యూషన్ ఫీజును మంజూరు చేస్తున్నట్లు ఆయన వివరించారు. రోడ్డు ప్రమాదం, రైలు ప్రమాదం కారణంగా శాశ్వతంగా అంగవైకల్యం పాలైనవారు, క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నవారు, బ్రైయిన్ హేమరేజ్, బ్రైన్ ట్యూమర్ వ్యాధి గ్రస్తులు పని చేయలేని స్థితిలో ఉన్న ఆరుగురు జర్నలిస్టులకు ఒక్కొక్కరికి ఒక లక్ష రూపాయల చొప్పున ఆర్థిక సహాయము, మరోకరికి 50 వేల రూపాయల చొప్పున జర్నలిస్టుల సంక్షేమ నిధి నుంచి ఆర్థిక సహాయం చేయనున్నట్లు ఆయన తెలిపారు.
ఈ కమిటీ సమావేశంలో మీడియా అకాడమి కార్యదర్శి నాగులపల్లి వెంకటేశ్వర రావు, సమాచార శాఖ జాయింట్ డైరెక్టర్ డి.ఎస్. జగన్, ఫైనాన్స్ డిప్యూటీ సెక్రటరీ మహమ్మద్ ఇక్బాల్ హుస్సేన్, ఉస్మానియా యూనివర్సిటీ జర్నలిజం కమ్యూనికేషన్ డిపార్టుమెంట్ హెడ్ డాక్టర్ సతీష్ కుమార్ తల్లాడి, డా.బిఆర్. అంబేద్కర్ యూనివర్సిటీ జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ డిపార్టుమెంట్ ఇంచార్జి హెడ్ డా. యాదగిరి కంబంపాటి, దూరదర్శన్ పోగ్రాం ఇంచార్జి సత్యనారాయణ, ఆల్ ఇండియా రేడియా అసిస్టెంట్ డైరెక్టర్ (P), హెడ్ ఆఫ్ ప్రోగ్రాంస్ సుంకశారి రమేష్, మీడియా అకాడమి అకౌంట్స్ ఆఫీసర్ పూర్ణ చందర్ రావు, తదితరులు పాల్గొన్నారు.