Warangal Airport | మామునూరు ఎయిర్‌పోర్టుకు ఎట్టకేలకు మోక్షం
వరంగల్ వాసుల చిరకాల స్వప్నం ఇక నెరవేరనుంది. మామునూరు ఎయిర్‌పోర్టు నుండి ఇక విమానాలు ఎగరనున్నాయి. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అడిగిన అదనపు భూమిని ఇవ్వడానికి అంగీకరించింది.

తెలంగాణ ప్రభుత్వం ఎన్నికలలో ప్రామిస్ చేసిన విధంగా వరంగల్ ఎయిర్పోర్ట్(Warangal Airport)ను పునరుద్ధరించాడానికి చర్యలు చేపట్టింది. ఇందుకోసం భారత విమానాశ్రయాల ప్రాధికార సంస్థ(Airports Authority of India-AAI) అధికారులతో సంప్రదింపులు ఓ కొలిక్కి వచ్చినట్లు తెలిసింది.
నిజానికి 1980ల్లోనే మామునూరు(Mamnoor)కు హైదరాబాద్ నుండి విమాన సర్వీసులు నడిచేవి. కానీ, గత ప్రభుత్వాల పట్టింపు లేక, విమాన ప్రయాణం అప్పట్లో ఖరీదైన వ్యవహారంగా ఉండేది కనుక, క్రమంగా సర్వీసులు రద్దయ్యాయి. అదేకాకుండా, విమానాశ్రయానికి సంబంధించిన భూమిని కబ్జాదారులు రాజకీయనాయకుల అండదండలతో కబ్జా చేయడంతో దాని పరిధి తగ్గిపోయింది. ఒకప్పుడు 1140 ఎకరాలున్న ఎయిర్‌పోర్టు ఇప్పుడు 693 ఎకరాలకు తగ్గిపోయింది.
విమానాశ్రయాన్ని తిరిగి ప్రారంభించాడానికి గత బిఆర్ఎస్(BRS Government) ప్రభుత్వం గట్టిగానే కృషి చేసింది. దాంతో రెండు దఫాలుగా ఏఏఐ అధికారులు(AAI Officers) మామునూరు ఎయిర్‌ఫీల్డ్‌ను క్షుణ్ణంగా తనిఖీలు కూడా నిర్వహించారు. ఆ తర్వాత తమకు రూ.1200 కోట్ల నిధులు కావాల్సిందిగా, అదనంగా రన్‌వే ను 1.8 కి.మీల నుండి 3.9 కి.మీలకు పెంచడానికి మరో 300 ఎకరాల భూమి కూడా ఇవ్వాల్సిందిగా ఏఏఐ(AAI) రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదించింది. ప్రతిగా ప్రభుత్వం, తాము రూ.500 కోట్ల నిధులు, 253 ఎకరాలు మాత్రమే ఇవ్వగలమని చెప్పడంతో ప్రాజెక్టు అటకెక్కింది. గత ఏడాది ఆగస్టులో రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ నిమిత్తం జిఓ నెం. 36 (GO MS No.36)కూడా జారీచేసింది. విమానాశ్రయం చుట్టుపక్కల ఉన్న గడపల్లి, గుంటూర్పల్లి, నక్కలపల్లి, మామునూరు గ్రామాలలో ఈ భూసేకరణ జరపాల్సిందిగా వరంగల్ కలెక్టర్‌ను ఆదేశించింది. వరంగల్‌లో ఎయిర్‌పోర్టు నెలకొల్పడానికి అనుమతి ఇవ్వాల్సిందిగా హైదరాబాద్(Hyderabad)లోని శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు(RGIA) అధికారులకు కూడా విజ్ఞప్తి చేసింది.
కేంద్రం కూడా తమ ఉడాన్(UDAN) పథకంలో వరంగల్ ఎయిర్‌పోర్టును కూడా చేర్చి, దాన్ని అభివృద్ధి చేయాల్సిందిగా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీచేసింది. ఇంతలో ఎన్నికలు రావడంతో పనులు కాస్తా ఆగిపోయాయి. ఈ మధ్య రాష్ట్ర కేబినెట్ నిర్వహించిన సమీక్షాసమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(Revanth Reddy), మంత్రివర్గం ఏఏఐ అధికారులు కోరిన మేరకు భూమిని కేటాయించాలని(Land alotted as per AAI’s request) నిర్ణయించింది. అంతేకాకుండా దీనికి సంబంధించిన తదుపరి చర్యలు వెంటనే చేపట్టాల్సిందిగా సంబంధిత అధికారులకు ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. గతంలో అనుమతులిచ్చిన ప్రభుత్వమే ఇప్పుడు కూడా కేంద్రంలో ఉండటం, కేంద్ర పౌర విమానయాన శాఖా మంత్రి(Central Civil Aviation Minister)గా తెలుగు ఎంపీ కింజారపు రామ్మోహన్ నాయుడు(K. Rammohan Naidu) ఉండటం కలిసొచ్చే అంశంగా, వరంగల్ విమానాశ్రయాన్ని అంతర్జాతీయ విమానాశ్రయం(Internatioanl Airport)గా తీర్చిదిద్దేందుకు ఇదే మంచి అవకాశమని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.