పది రోజుల్లో ఫామ్‌హౌజ్ వస్తా.. కేసీఆర్‌ !

తుంటి ఎముక ఆపరేషన్ తర్వాత జూబ్లీహిల్స్ నివాసంలో రెస్ట్ తీసుకుంటున్న బీఆరెస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ త్వరలో ఎర్రవెల్లి ఫాంహౌస్‌కు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారని

పది రోజుల్లో ఫామ్‌హౌజ్ వస్తా.. కేసీఆర్‌ !
  • తెలంగాణ భవన్‌కు ఎప్పుడొస్తారో మరి..?
  • గులాబీ బాస్ కోసం కేడర్ ఎదురుచూపులు

విధాత : తుంటి ఎముక ఆపరేషన్ తర్వాత జూబ్లీహిల్స్ నివాసంలో రెస్ట్ తీసుకుంటున్న బీఆరెస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ త్వరలో ఎర్రవెల్లి ఫాంహౌస్‌కు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారని తెలుస్తున్నది. తాజాగా ఒంటిమామిడిలో ఉన్న ఎరువుల షాపు యజమానికి ఫోన్ చేసి ఫాంహౌస్ కి విత్తనాలు, ఎరువులు పంపించాలని..తాను పది రోజుల్లో ఫాంహౌస్‌కు వచ్చి వ్యవసాయం చూసుకుంటానని గులాబీ బాస్ చెప్పినట్లుగా నెలకొన్న ప్రచారం వైరల్‌గా మారింది. ఈ సందర్భంగా కేసీఆర్‌ ఆరోగ్యం గురించి ఆ షాపు యజమాని వాకబు చేయగా తాను ఆరోగ్యంగా ఉన్నానని అతడితో చెప్పారని కథనం. దీంతో పది రోజుల్లో లేదా నెలాఖరుకల్లా కేసీఆర్ తన ఫామ్‌హౌజ్‌కు వెలుతారన్న ప్రచారంతో పాటు త్వరలోనే గులాబీ బాస్ మళ్లీ రాజకీయా కార్యకలాపాల్లో క్రియాశీలకం కాబోతున్నారన్న ప్రచారం ఊపందుకుంది.

జన్మదినాన జనంలోకి కేసీఆర్

బీఆరెస్‌ అధినేత కేసీఆర్ ఇక జనంలోకి రాబోతున్నట్లుగా ప్రచారం జోరందుకుంది. తుంటి ఎముక శస్త్ర చికిత్స అనంతరం ఆసుపత్రి నుంచి ఇంటికి చేరుకున్న కేసీఆర్ మరో 3 వారాల్లో పూర్తిగా కోలుకుంటారని వైద్యులు చెప్పారు. ఇప్పటికే ఆయన ఇంట్లో విశ్రాంతి తీసుకుంటునే ఇంకోవైపు పార్టీని మరింత పటిష్టం చేసే పనిలో ఉన్నారని పార్టీ నాయకత్వం చెబుతుంది. ఆయన మార్గదర్శకత్వంలోనే వర్కింగ్ ప్రెసిడెంట్ కేసీఆర్‌, సీనియర్ నేత హరీశ్‌రావులు వరుసగా తెలంగాణ భవన్‌లో జరుగుతున్న పార్లమెంటు నియోజకవర్గాల వారి సన్నాహాక సమావేశాలను నడిపిస్తున్నారని వారి మాటల సారాంశంగా ఉంది. అయితే 22వ తేదీన లోక్‌సభ నియోజకవర్గాల సమావేశాలు ముగియ్యనుండగా, అప్పటి లోపు తెలంగాణ భవన్‌కు కేసీఆర్ వస్తారన్న ప్రచారం కూడా వినిపిస్తున్నది. వచ్చేనెల 17వ తేదీన కేసీఆర్ పుట్టిన రోజు. ఆ రోజు నుంచి పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్‌కు ప్రతీ రోజు వస్తారని విశ్వసనీయ వర్గాల సమాచారం. ముఖ్య నేతలు, శ్రేణులతో భేటీలు నిర్వహించి లోక్ సభ ఎన్నికలు, పార్టీ సన్నద్దత సమస్యలపై చర్చిస్తారని, లోక్‌సభ స్థానాలకు అభ్యర్థుల ఎంపిక చేస్తారన్న ప్రచారం పార్టీ వర్గాల్లో వినిపిస్తున్నది.

గజ్వేల్ నుంచి అసెంబ్లీ నియోజకవర్గాల పర్యటన

కేసీఆర్ లోక్‌సభ ఎన్నికలకు బీఆరెస్‌ను సన్నద్ధం చేసే క్రమంలో ఫిబ్రవరి 20 తర్వాత నియోజకవర్గ పర్యటనలకు వెళతారని పార్టీ వర్గాల కథనం. గజ్వేల్‌లో తొలి పర్యటన ఉంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన ఓటమితో నిరాశలో ఉన్న కేడర్‌ను రెట్టింపు ఉత్సాహంతో లోక్‌సభ ఎన్నికల దిశగా నడిపించే లక్ష్యంతో లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి ఊపు తీసుకొచ్చేలా కేసీఆర్ ప్రచార ప్రణాళికలు రూపొందిస్తున్నారని పార్టీ నాయకత్వం అంతర్గత చర్చల్లో చెప్పుకుంటున్నారు. ఎన్నికల షెడ్యూల్ వచ్చే లోపునే కాంగ్రెస్‌, బీజేపీ టార్గెట్‌గా వరంగల్‌లో లోక్‌సభ ఎన్నికల తొలి ప్రచార సభను నిర్వహించాలని యోచిస్తున్నన్నారని ఆ జిల్లా నాయకులు చెబుతున్నారు.