TELANGANA | పీఆర్ స్టంట్ కోసం వాడుకుని వదిలేశారు :మాజీ డీఎస్పీ నళిని
తెలంగాణ ఉద్యమంలో ప్రఖ్యాతిగాంచిన మాజీ డీఎస్పీ నళిని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సీఎం రేవంత్‌రెడ్డి పిలుపుతో వెళ్లి కలిసి సమర్పించిన దరఖాస్తులపై ట్విటర్‌లో తాజాగా ఆసక్తికర పోస్టు చేశారు

విధాత, హైదరాబాద్ : తెలంగాణ ఉద్యమంలో ప్రఖ్యాతిగాంచిన మాజీ డీఎస్పీ నళిని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సీఎం రేవంత్‌రెడ్డి పిలుపుతో వెళ్లి కలిసి సమర్పించిన దరఖాస్తులపై ట్విటర్‌లో తాజాగా ఆసక్తికర పోస్టు చేశారు. తనను పీఆర్ స్టంట్ కోసం వాడుకొని వదిలేశారని నళిని ఈ పోస్టులో ఆవేదన వ్యక్తం చేశారు. యాచకులకు ఇచ్చిన విలువ కూడా తనకు రేవంత్ ప్రభుత్వంలో ఇవ్వడంలేదన్నారు. రేవంత్ రెడ్డి సీఎం కొలువుకు ఎక్కగానే తనకు ఎక్కువ ప్రచారం కల్పించారని.. ఇప్పుడేమో చప్పుడే చేస్తలేరని నళిని పోస్టులో పేర్కొన్నారు. ఇటీవల తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలు జరిగిన సందర్భంలోనూ నా ఊసే ఎత్తకపోవడం ఆశ్చర్యం కలిగించిందన్నారు. ఇంతకీ తన రెండు దరఖాస్తులు బల్ల మీదనే ఉన్నయో లేక చెత్త బుట్టలోకి పోయినవో అనే అనుమానం కలుగుతుందన్నారు. దీనిపై సీఆర్వో, ఓఎస్డీకి ఓ లేఖ రాశానంటూ ఆమె ఫేస్‌బుక్ పోస్టులో పేర్కొన్నారు.
చిన్నప్పుడు అడుక్కుంటూ ఎవరైనా ఇంటి ముందుకు వస్తే.. ఇంట్లో చల్లన్నం లేకపోతే పైకి వెల్లవయ్య అని మెల్లగా చెప్పేవాళ్లమని.. కనీసం అలాంటి మర్యాద అయినా తనకు ఇస్తారేమో చూడాలని పేర్కొన్నారు. తాను చాలా ఏళ్లుగా ఎవ్వరినీ కలవలేదని.. ఉద్యమం చేసేటప్పుడే తనకు చాలా విషయాలు అర్థం అయ్యాయని చెప్పారు. ఒక నెలలో తన పిటిషన్‌పై విచారణ పూర్తి చేస్తారని భావించానని.. ఏడు నెలలు పూర్తైనా ఎటువంటి స్పందన లేకపోవడంతో.. రిమైండ్ లెటర్ రాయాల్సి వచ్చిందని నళిని తెలిపారు. సచివాలయం చుట్టూ తిరిగేంత సమయం, ఓపిక తన వద్ద లేవనే విషయాన్ని రేవంత్ రెడ్డిని కలినప్పుడే చెప్పానని నళిని తెలిపారు.
చర్చనీయాంశమైన నళిని పోస్టు
తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగానికి రాజీనామా చేసి కీలకంగా పనిచేసిన మాజీ డీఎస్పీ నళిని బీఆరెస్ అధికారంలోకి వచ్చాకా తనను పట్టించుకోకపోవడంతో ఆధ్యాత్మిక మార్గంలోకి వెళ్లిపోయారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే సీఎం రేవంత్‌రెడ్డి తనను కలవాలంటూ పిలిపించుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన సందర్భంలో నళినికి పోలీస్ శాఖలో గతంలో ఆమె పనిచేసిన హోదాకు తగ్గకుండా ఉద్యోగం ఇచ్చేందుకు ప్రతిపాదించగా, ఆమె తిరస్కరించారు. ప్రస్తుతం తాను అధ్యాత్మిక మార్గంలో ఉన్నానని, ఉద్యోగం చేసుందుకు తాను సిద్ధంగా లేనని స్పష్టం చేశారు. పోలీస్ ఉద్యోగానికి అవసరమైన ఫిట్‌నెస్‌తో తాను లేనని చెబుతూ.. ప్రభుత్వం సహాయం చేయాలనుకుంటే వేద విద్య ప్రచారం కోసం సహాయం చేయాలని అడిగారు. దీనికి సంబంధించి రెండు వినతిపత్రాలను సీఎం రేవంత్ రెడ్డికి అందజేశారు. నళిని సీఎం రేవంత్ రెడ్డిని కలిసి దాదాపు 7 నెలలు అవుతున్నా.. ఆమె చేసిన వినతులపై ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో ఆమె మరోసారి ప్రభుత్వానికి లేఖ రాశారు. కొంచెం ఘాటైన పదాలను ఉపయోగిస్తూ ఆమె లేఖ రాయడం తీవ్ర చర్చనీయాంశమవుతోంది.