Harish Rao | విద్యారంగం సమస్యలు పరిష్కరించండి ..సీఎం రేవంత్‌రెడ్డికి మాజీ మంత్రి హరీశ్‌రావు లేఖ

తెలంగాణ విద్యారంగానికి సంబంధించిన సమస్యలు, ఇచ్చిన హామీలను వెంటనే పరిష్కరించాలని సీఎంరేవంత్‌ రెడ్డికి బీఆరెస్ మాజీ మంత్రి టి. హరీశ్‌ రావు, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్‌లు బహిరంగలేఖ రాశారు

Harish Rao | విద్యారంగం సమస్యలు పరిష్కరించండి ..సీఎం రేవంత్‌రెడ్డికి మాజీ మంత్రి హరీశ్‌రావు లేఖ

విధాత, హైదరాబాద్ : తెలంగాణ విద్యారంగానికి సంబంధించిన సమస్యలు, ఇచ్చిన హామీలను వెంటనే పరిష్కరించాలని సీఎంరేవంత్‌ రెడ్డికి బీఆరెస్ మాజీ మంత్రి టి. హరీశ్‌ రావు, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్‌లు బహిరంగలేఖ రాశారు. పదోన్నతి పొందిన ఉపాధ్యాయులతో సమావేశం నిర్వహించడానికి ముందే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలపై స్పష్టమైన విధానపర నిర్ణయాలు వెలువరించి, ఆదేశాలు జారీచేయాలని ఉద్యోగ, ఉపాధ్యాయుల పక్షాన బీఆరెస్‌ పార్టీ డిమాండ్ చేస్తున్నదని అందులో పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రస్తుత ప్రభుత్వం తమవి అని చెప్పుకుంటున్న కొన్ని అంశాలు గత బీఆరెస్‌ ప్రభుత్వ హయాంలో తీసుకున్న నిర్ణయాలు కావడంతో నిజాలు తెలియజేయలనే ఉద్దేశంతో, విద్యారంగ ప్రయోజనాల కోసం ఈ లేఖ రాశామని తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వమే భాషాపండితులకు, పీఈటీలకు అడ్డంకిగా ఉన్న సర్వీసు రూల్స్ 11, 12లను మార్చి కొత్తగా 2,3, 9,10 జీఓలను అనుమతించిందని తెలిపారు.

2023 సెప్టెంబర్ 18న కాళేశ్వరం జోన్ 1లో మా ప్రభుత్వమే 1050 గెజిటెడ్ ప్రదానోపాధ్యాయ ప్రమోషన్లనూ ఇచ్చిందని, ప్రాథమిక పాఠశాలలకు గానూ మా ప్రభుత్వం 10,000 ప్రధానోపాధ్యాయ పోస్టులను మంజూరు చేస్తే ఇప్పటివరకూ పాఠశాలలకు కేటాయించలేదని, వెంటనే కేటాయించి ఎస్జీటీలకు ప్రమోషన్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నామన్నారు మీరు ఎన్నికల సభలలో మాట్లాడుతూ కేసీఆర్ ప్రకటించిన దానికన్నా గొప్పగా పీఆర్సీని కల్పిస్తామని చెప్పిన హామీని అమలు చేయాలని, న్యూ పెన్షన్ స్కీం స్థానంలో ఓల్డ్ పెన్షన్ స్కీం తీసుకువస్తామన్న హామీని అమలు చేయాలని కోరారు. సర్వశిక్షా అభియాన్‌లో సేవలందిస్తున్న ఉద్యోగులకు ఇచ్చిన హామీ మేరకు వెంటనే వారిని క్రమబధ్ధీకరించాలన్నారు. పాఠశాలలకు స్కావెంజర్స్‌ను అనుమతి, బదిలీల వల్ల ఖాళీలు ఏర్పడిన పాఠశాలలో అవసరమైన మేరకు విద్యావాలంటీర్లను వెనువెంటనే నియమించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు.మధ్యాహ్న భోజనం పథకానికి సంబంధించిన పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని, భోజన పథకం వర్కర్లకు మీరు ఇచ్చిన హామీ మేరకు వెంటనే వేతనాలు పెంచాలని, పాఠశాల విద్యార్థులకు ఉదయం పూట ఉపాహారం అందించే మంచి పథకాన్ని కొనసాగించాలని లేఖలో డిమాండ్ చేశారు.