Singireddy Niranjan Reddy | రైతు క్షేమమే జన సంక్షేమం : మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి

: రైతుల క్షేమమే జన సంక్షేమమని, వ్యవసాయం భారమన్న పరిస్థితులు పెరిగితే ప్రజలకు ఆహార భద్రత కరువవుతుందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు

Singireddy Niranjan Reddy | రైతు క్షేమమే జన సంక్షేమం : మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి

ఆధునిక పద్ధతులతోనే వ్యవసాయం లాభసాటి
విశ్వవిద్యాయాలను మించిన రాజేందర్‌రెడ్డి రైతు సంస్కరణలు

విధాత, హైదరాబాద్ : రైతుల క్షేమమే జన సంక్షేమమని, వ్యవసాయం భారమన్న పరిస్థితులు పెరిగితే ప్రజలకు ఆహార భద్రత కరువవుతుందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. నల్లగొండ జిల్లా కేంద్రం ఎన్‌జీ కళాశాల మైదానంలో రైతుబడి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అగ్రీ ఎక్స్‌పో(వ్యవసాయ ఎగ్జిబిషన్‌) రెండో రోజు ఆదివారం ముఖ్య అతిధిగా హాజరైన నిరంజన్‌రెడ్డి వ్యవసాయ, అనుబంధ రంగాలకు సంబంధించిన ఉత్పత్తులతో ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను సందర్శించారు ఈ సందర్భంగా జరిగిన సభలో రైతులనుద్ధేశించి మాట్లాడారు. భారతదేశంలో వ్యవసాయాన్ని పరిశ్రమగా గుర్తించిన ప్రభుత్వాలే ప్రజాదరణ పొందుతాయన్నారు. రైతుబడి డిజిటల్‌ మీడియా అధినేత జూలకంటి రాజేందర్ రెడ్డి రైతులను ఆధునిక వ్యవసాయ పద్ధతుల వైపు నడిపించేందుకు చేస్తున్న కృషి విశ్వవిద్యాలయాలకు మించిన వ్యవసాయ సంస్కరణల వంటిదన్నారు. రైతులు ఆధునిక వ్యవసాయ పద్ధతులు అనుసరించడం అలవాటు చేసుకుంటే వ్యవసాయాన్ని మించిన పరిశ్రమ ఉండదన్నారు. స్వానుభవం పొందిన రైతే నిజమైన శాస్త్రవేత్తగా మారుతాడన్నారు. వేల ఏండ్లుగా భారత దేశం వ్యవసాయం మూలవృత్తిగా కొనసాగిందని, కాలక్రమేణా రకరకాల వ్యాపారాల రాకతో వ్యవసాయం వెనుకబడిందన్నారు. వ్యవసాయంపై నిర్లక్ష్యం చూపుతున్న పరిణామాలు భవిష్యత్తు తరాలకు ప్రమాద ఘంటికల సూచికలని, అందరం వ్యవసాయాన్ని ప్రోత్సహించాల్సిన అత్యవసర పరిస్థితి ఏర్పడిందన్నారు. రైతులు కాడి క్రింద పడేసిననాడు అందరి భవిష్యత్తు అంధకారమేనని, అందరికీ అన్నం కరువు అవుతుందని హెచ్చరించారు. పాడి పంటల నినాదంతో ఆహార పంటల సాగుతో పాటు పశుపోషణ, ఉద్యానవన పంటలు, పామాయిల్‌, వాణిజ్య పంటలను, గొర్రెలు, మేకలు, పట్టుపురుగులు, కోళ్ల పెంపకం వంటి వాటితో రైతు అధిక లాభాల దిశగా ఆధునిక పద్ధతులతో ముందుకు సాగాలని, ఇందుకు ఈ వ్యవసాయ ఎగ్జిబిషన్‌లు ఎంతగానో దోహదం చేస్తాయన్నారు.

ఓటు బ్యాంకుగా కాదు..అన్నదాతలుగా చూడాలి

నేటీ ప్రభుత్వాలు తమ మనుగడ కోసం రైతులను తమ ఓటు బ్యాంకుగా ఉపయోగించుకుంటున్నాయే తప్ప భవిష్యత్తు తరాల గూర్చి ఆలోచించడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రైతులను ఓటు బ్యాంకుగా కాకుండా అన్నదాతలుగా భావించి సాగు ప్రోత్సాహాక పథకాలు అందించాల్సిన అవసరముందన్నారు. ఆధునిక కాలంతో పోటీపడి రోజువారీ కూలీలు, ట్రాక్టర్, వరికోత వంటి సౌకర్యాలు ఆన్ లైన్ లో బుక్ చేసుకున్న నాడు రైతులకు పెట్టుబడి తగ్గుతుందని ఆ దిశగా రైతులను చైతన్యం చేయాలని విశ్వవిద్యాలయాలకు పిలుపునిచ్చారు. విశ్వవిద్యాలయాలు రైతులకు, రైతు సంఘాలకు, , సోసైటీలకు వాడే మిషనరీని అందుబాటులో ఉంచగలితే వారి పెట్టుబడులు తగ్గి ఆదాయం పెరిగి వ్యవసాయం అభివృద్ధి దిశగా సాగుతుందన్నారు. ఈ దిశలో రైతుబడి రాజేందర్‌రెడ్డి చేస్తున్న కృషి ప్రభుత్వాలకు, విశ్వవిద్యాలయాలకు స్ఫూర్తిదాయకమన్నారు. సమాచార విప్లవానికి తెరలేపిన వ్యవస్థ రాజేందర్‌ రైతుబడి అన్నారు. రైతుల సందేహాలకు, సలహాలకు ఈ ఎగ్జిబిషన్‌లు సమాధానంగా నిలుస్తాయన్నారు. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల నుంచి స్వచ్చందంగా వేలాది మంది తరలివచ్చిన తీరు వారిలో వ్యవసాయం పట్ల ఉన్న జిజ్ఞాస, ఉత్సాహానికి నిదర్శనమని, అదే వ్యవసాయాన్ని బతికిస్తుందన్నారు. ప్రపంచ మానవాళికి ఆహారాన్ని అందించే రైతాంగాన్ని ప్రోత్సహించడం ప్రభుత్వాల బాధ్యతన్నారు. రైతు భూమిని తల్లిగా.. పంటను బిడ్డగా.. పంట పండే వరకు ఒక తప్పస్సుగా రైతు ఆచరిస్తాడని అందుకే రైతే రాజు అన్న నినాదం నిలబడిందన్నారు. తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం రైతుబంధు, రైతు భీమా, రుణ మాఫీ సకాలంలో ఇచ్చి రైతును అగ్రభాగాన నిలిపిందన్నారు. నేటి ప్రభుత్వం రైతులను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చి రైతును గోసపెడుతుందని, రుణమాఫీ అందరికీ అని చెప్పిఅసంపూర్తిగా రైతులను రోడ్డు పాలుజేసిందని ఆరోపించారు. అగ్రీ ఎక్స్‌పో నిర్వాహకులు, రైతుబడి డిజిటల్ మీడియా ఎండీ జూలకంటి రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి ఇచ్చిన వ్యవసాయ సలహాలు సూచనలు నన్ను ఈ బృహత్ కార్యక్రమానికి పురిగొల్పాయని, ఇందుకు ఆయనకు తజ్ఞతలు తెలియజేస్తున్నానన్నారు. భవిష్యత్తులో అన్ని జిల్లా కేంద్రాల్లో వ్యవసాయ ఎగ్జిబిషన్‌లను ఏర్పాటు చేసి ఆధునిక సాగు పద్ధతులను, వంగడాలను రైతుల దరిచేర్చేందుకు నా కృషి కొనసాగిస్తానన్నారు. ఈ కార్యక్రమంలో బీఆరెస్ రాష్ట్ర కార్యదర్శి చాడ కిషన్‌రెడ్డి, వ్యవసాయ, ఉద్యానవన శాఖల అధికారులు, వేలాది మంది రైతులు పాల్గొన్నారు.

రాజేందర్ ఒక వ్యవసాయ విశ్వవిద్యాలయం : మండలి చైర్మన్ గుత్తా

రైతుబడి డిజిటల్ మీడియా ఎండీ జూలకంటి రాజేందర్ యూట్యూబ్ చానల్‌, మ్యాగజైన్‌, అగ్రీ ఎక్స్‌పోల ద్వారా వ్యవసాయ రంగ ప్రగతికి చేస్తున్న సేవలు యూనివర్సిటీలకు, ప్రభుత్వాలకు స్ఫూర్తిదాయకమని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. రెండు రోజుల అగ్రీ ఎక్సపో ముగింపు కార్యక్రమానికి గుత్తా హాజరై మాట్లాడారు. అన్ని జిల్లాలలకు అగ్రీ ఎక్స్‌పో విస్తరించాలన్న రాజేందర్‌ ఆలోచన మరింత మంది రైతులకు ఆధునిక వ్యవసాయ విజ్ఞాన సమాచారం చేరువ చేస్తుందని, ఈ దిశగా రాజేందర్ ప్రయాణం విజయవంతం కావాలని ఆకాంక్షించారు. వేలాది మంది రైతుల సమక్షంలో రాజేందర్‌రెడ్డిని గుత్తా ఘనంగా సన్మానించారు.