సింగరేణిని దోచుకున్న బీఆర్ఎస్ ప్రభుత్వం: మాజీ ఎంపీ వివేక్
తెలంగాణకు గుండెకాయ లాంటి సింగరేణిని బీఆరెస్ ప్రభుత్వం దోచుకుందని చెన్నూర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, మాజీ ఎంపీ గడ్డం వివేక్ ఆరోపించారు.

- కాళేశ్వరం ప్రాజెక్టు నిర్వాసితులకు పరిహారమేది?
- 5 వేలతో ఓట్లు కొంటామంటున్న బాల్క సుమన్
- ఇసుక దందా, అక్రమ వ్యాపారాలతో దోపిడీ
- చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థి వివేక్
విధాత ప్రతినిధి, ఉమ్మడి ఆదిలాబాద్: తెలంగాణకు గుండెకాయ లాంటి సింగరేణిని బీఆరెస్ ప్రభుత్వం దోచుకుందని చెన్నూర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, మాజీ ఎంపీ గడ్డం వివేక్ ఆరోపించారు. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం టేకుమట్ల, రామారావు పేట తదితర గ్రామాల్లో శనివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు ఇతర పార్టీల నాయకులు కాంగ్రెస్ చేరారు. కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన వివేక్ అనంతరం మాట్లాడారు.
నీళ్లు, నిధులు, నియామకాల హామీలతో గద్దెనెక్కిన తెలంగాణ ప్రభుత్వం ప్రజాసంక్షేమాన్ని విస్మరించిందని విమర్శించారు. మహా అద్భుతమని నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు మూలంగా గోదావరి పరివాహక ప్రాంతమైన జైపూర్, చెన్నూర్, భీమారం ముంపునకు గురయ్యాయన్నారు. ఇప్పటికీ రూపాయి నష్టపరిహారం చెల్లించని ఎమ్మెల్యే బాల్క సుమన్… వీరిని ఏముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతారని ప్రశ్నించారు. చెన్నూర్ నియోజకవర్గంలో బాల్క సుమన్ అక్రమ వ్యాపారాలపై దృష్టి పెట్టారే తప్ప, యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్న ఆలోచన చేయలేదని విమర్శించారు.
ప్రభుత్వ పన్ను ఎగ్గొట్టి ఇసుక వ్యాపారం చేశాడని ఆరోపించారు. ఎన్నికల్లో ఓటుకు 5000 ఇచ్చి గెలుపొందుతానే ధీమాగా ఉన్నారని, ఇక్కడి ప్రజలు డబ్బుకు అమ్ముడు అయ్యేవారు కాదన్నారు. రాబోయే ఎన్నికల్లో బీఆరెస్ కు తగిన గుణపాఠం చెప్తారని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే 2 లక్షల ఉద్యోగాలు, రూ.2 లక్షల రైతు రుణమాఫీ చేస్తామని అన్నారు. 6 గ్యారంటీలతో ప్రతిఒక్కరికి దాదాపు రూ.10 లక్షల లబ్ధి చేకూరుతుందని హామీ ఇచ్చారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకు ఓటేసి బాల్క సుమన్ ను ఇంటికి పంపించాలని ఓటర్లను కోరారు.