విధాత, హైదరాబాద్ : గచ్చిబౌలి పరిధి అంజయ్యనగర్‌లో 48 గజాలలో నిర్మిస్తున్న ఏడంతస్తుల భవనం కూలిన ఘటనలో అధికారులు చర్యలు చేపట్టారు. బిల్డింగ్ యజమాని సాజిద్ ఖాన్‌ను రాయదుర్గం పోలీసులు అరెస్ట్ చేశారు. భవనం కుప్పకూలిన ఘటనలో ఇద్దరు మృతిచెందిన విషయం తెలిసిందే. మృతులను మధ్యప్రదేశ్‌కు చెందిన కార్మికులుగా అధికారులు గుర్తించారు. ప్రస్తుతం ప్రమాద ప్రాంతంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. శిథిలాల కింద ఇంకా ఎవరైనా చిక్కుకుని ఉన్నారా అన్న అనుమానంతో రెస్క్యూ బృందాలు గాలింపు చేపట్టాయి.
భవనం నాలాను ఆనుకుని నిర్మించినట్లు, సరైన సెట్‌బ్యాక్‌లు కూడా లేవని అధికారులు చెబుతున్నారు. భవనానికి సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి అనుమతి లేదని అధికారుల నుంచి సమాచారం. ఇంత చిన్న స్థలంలో ఇంత భారీ నిర్మాణం ఎలా కొనసాగిందన్న ప్రశ్నలు ఇప్పుడు తలెత్తుతున్నాయి. నిర్మాణం దాదాపు పూర్తయ్యే దశకు చేరుకున్నప్పటికీ అధికారులు ఎందుకు అడ్డుకోలేకపోయారన్న అంశంపైనా విచారణ జరుగుతోంది.
వాస్తవానికి ఇక్కడ సాజిద్ కు 38గజాల స్థలమే ఉందని, 10గజాల నాలా స్థలం ఆక్రమించి 48 గజాలలో ఏడంతస్తుల భవనం, పెంట్ హౌజ్ తో నిర్మాణం చేపట్టాడని అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఆటో డ్రైవర్ గా పనిచేసిన సాజిద్ ఇలాగే అక్రమంగా మరో మూడు భవనాలు కట్టారని, మున్సిపల్, టౌన్ ప్లానింగ్ అధికారులకు డబ్బులు ఇచ్చి మేనేజ్ చేస్తూ అక్రమ భవనాల నిర్మాణలు చేయడం కొనసాగిస్తున్నాడని గుర్తించారు.
మాదాపూర్ టౌన్‌ప్లానింగ్ అధికారి సంతోష్‌కుమార్ సస్పెండ్
మాదాపూర్ టౌన్‌ప్లానింగ్ అధికారి సంతోష్‌కుమార్‌ను సస్పెండ్ చేశారు. అక్రమ నిర్మాణాలను అడ్డుకోనందుకు సంతోష్ కుమార్‌ను సస్పెండ్ చేస్తూ సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (సీఎంసీ) ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు అంజయ్యనగర్‌లో భవనం శిథిలాలను రెస్క్యూ సిబ్బంది తొలగిస్తున్నారు. శిథిలాలు పడడంతో దెబ్బతిన్న పక్కనే ఉన్న అపార్ట్‌మెంట్‌ను హైడ్రా కూల్చి వేయనుంది.అంజయ్యనగర్‌లో ఇలాంటి అక్రమ నిర్మాణాలు మరిన్ని ఉన్నాయని, వాటిపై చర్యలు తీసుకుంటామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు.
