గోదావరి, కృష్ణా ప్రాజెక్టులకు వరద పరవళ్లు

ఎగువ రాష్ట్రాలతో పాటు తెలుగు రాష్ట్రాలలో కురిసిన తాజా వర్షాలతో పొటెత్తిన గోదావరి, కృష్ణా నదులు క్రమంగా శాంతిస్తున్నాయి. భారీ వరదల రాకతో గోదావరి, కృష్ణా ప్రాజెక్టులు పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుతున్నాయి.

గోదావరి, కృష్ణా ప్రాజెక్టులకు వరద పరవళ్లు

విధాత : ఎగువ రాష్ట్రాలతో పాటు తెలుగు రాష్ట్రాలలో కురిసిన తాజా వర్షాలతో పొటెత్తిన గోదావరి, కృష్ణా నదులు క్రమంగా శాంతిస్తున్నాయి. వరద ప్రవాహం తగ్గుముఖం పట్టినప్పటికి పరివాహక ముంపు గ్రామాల ప్రజల కష్టాలు మాత్రం ఇంకా కొనసాగుతున్నాయి. భద్రాచలం వద్ద క్రమంగా తగ్గుతున్న వరద ప్రవాహంతో ప్రస్తుత నీటి మట్టం 47 అడుగులకు చేరింది. గోదావరి వరదలలో లంక గ్రామాలు, లోతట్టు ప్రాంతాలు ఇంకా జలదిగ్భంధంలోనే ఉన్నాయి.

బూర్గంపాడు మండల శివారులో సారపాక నాగినేనిపల్లి ప్రధాన రహదారి మీదుగా వరద ప్రవాహం కొనసాగుతుండటంతో ఆ మార్గంలోని గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. వందల ఎకరాల్లో పంట పొలాలు నీట మునిగాయి. ముంపు గ్రామాల బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించారు. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం దగ్గర ఉదృతంగా వశిష్ట గోదావరి నుంచి భారీగా వరద ప్రవాహం కొనసాగుతుంది. గోదావరికి, శబరి తోడవడంతో కూనవరం, వీఆర్‌పురం మండలాల్లోని పలు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. దాదాపు 13 లక్షల క్యూసెక్కులు సముద్రంలోకి విడిచిపెడుతున్నారు.

కృష్ణానది పరివాహక ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు జలాశయాలన్నీ నిండుకుండలా మారాయి. బీమా, తుంగభద్రల వరద కూడా తోడవ్వడంతో కృష్ణా ప్రాజెక్టులకు వరద ఉదృతి కొనసాగుతుంది. మహబూబ్‌నగర్ జిల్లా జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరుతుంది. ఎగువన వర్షాలు కురువడంతోపాటు నారాయణపూర్‌ డ్యాం నుంచి దిగువకు వరద నీటిని విడుదల చేస్తున్న నేపథ్యంలో జూరాల ప్రాజెక్టులోకి వరద నీరు వచ్చి చేరుతుంది. ప్రాజెక్టు 29 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ఇన్‌ఫ్లో 1,67,000 , అవుట్‌ఫ్లో 1,74,711 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నిల్వ సామర్థ్యం 9.657 టీఎంసీలు. ప్రస్తుతం 8.631 టీఎంసీల నీటి నిల్వ కొనసాగుతుంది. ఎగువ, దిగువ జలవిద్యుత్ కేంద్రాల్లోని 11 యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుంది.

జూరాల ప్రాజెక్టు నుంచి వస్తున్న 1,74,711 క్యూసెక్కుల వరద నీటితో శ్రీశైలం జలాశయం నీటిమట్టం ఆదివారం 846. 10 అడుగులు ఉంది. నీటి నిల్వ 72.1974 టీఎంసీల నీరు ఉంది. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు, కాగా 215 టీఎంసీలు. మరో వారం రోజులపాటు వరద ప్రవాహం కొనసాగితే శ్రీశైలం గేట్లు ఎత్తే అవకాశాలు ఉన్నాయి. గతేడాది ఆగస్టు 5వ తేదీ నాటికి శ్రీశైలం ప్రా జెక్టుకు 2,32,164 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో రాగా, నీటి మట్టం 877.6 అడుగులుగా నమోదైంది. నీటి నిల్వ 176.33 టీఎంసీలుగా నమోదైంది.

తుంగభద్ర జలాశయానికి వరద ఉదృతి కొనసాగుంది. పూర్తి స్థాయి నీటి మట్టం:1633 అడుగులు కాగా, ప్రస్తుతం నీటి మట్టం:1611.59 అడుగులు ఉంది. ఇన్ ఫ్లో 24,468 క్యూసెక్కులు, అవుట్ ఫ్లో 1195 క్యూ సెక్కులు, పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్ధ్యం 105.788 టీఎంసీలుగా ఉంది.

 

Latest News