Hyderabad Metro New Trains | హైదరాబాద్‌ మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్… త్వరలో కొత్త రైళ్లు

Reported by: Jagan Mohan Talluri | తెలంగాణ‌ | Jul 09, 2025, 4:12 pm IST
Read Time: 4 mins
Hyderabad Metro New Trains | హైదరాబాద్‌ మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్… త్వరలో కొత్త రైళ్లు

Hyderabad Metro New Trains | హైదరాబాద్ లో త్వరలో కొత్త మెట్రో రైళ్లు తీసుకురావడానికి ఎల్‌అండ్‌టీ సంస్థ కసరత్తు చేపట్టింది. ఈ మేరకు మెట్రో రైళ్ల తయారీ సంస్థ బీఈఎంఎల్‌తో ఒప్పందం కుదుర్చుకోనుంది. ప్రస్తుతం మూడు రూట్లలో 57 మెట్రోలు తిరుగుతున్నాయి. బెంగళూరు కేంద్రంగా ఉన్న బీఈఎంఎల్‌ సంస్థ ఇప్పటికే మెట్రోలను తయారు చేసి పలు నగరాలకు అందజేస్తోంది.. దీంతో ఆ సంస్థతోనే ఒప్పందం చేసుకొనే అవకాశం ఉందని సమాచారం. ఏడాదిన్నర సమయంలో మెట్రోలను తయారు చేసి అందజేసేలా ఈ సంస్థతో ఒప్పందం చేసుకోనున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ లో మూడు రూట్లలో 57 మెట్రోలు తిరుగుతున్నాయి. ప్రయాణికుల రద్దీ కూడా ఎక్కువైంది. ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి 11: 30 గంటల వరకు రైళ్లు నడిచినా ప్రయాణికుల రద్దీ మాత్రం వీపరితంగా ఉంటుంది.

చార్జీలు పెంచినప్పటికీ.. నిలుచుని వెళ్లడం పట్ల ప్రయాణికులు మెట్రోపైన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో కొత్తగా మరో 10 రైళ్లను కొనుగోలు చేసేందుకు ఎల్‌అండ్‌టీ ఫోకస్ చేసింది. కొత్త రైళ్లను కొనుగోలు కోసం రూ.650 కోట్లకు పైగా ఖర్చు కానున్నట్లుగా ఎల్‌అండ్‌టీ అంచనా వేస్తోంది. ఒక్కో ట్రైన్‌కు రూ.60 కోట్ల నుంచి రూ.70 కోట్ల వరకు ఖర్చవుతుందని అధికారులు అంటున్నారు. ప్రస్తుతం ప్రతి మూడు నిమిషాలకు ఒక ట్రైన్‌ నడుస్తోంది. కోచ్‌ల సంఖ్యను పెంచడంతో స్టేషన్‌ల మధ్య రైళ్లు నిలిచిపోయే అవకాశం ఉంటుంది. ఈ టెక్నికల్ ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొనే అదనపు కోచ్‌లకు బదులు కొత్త రైళ్లనే కొనుగోలు చేయాలని నిర్ణయించింది. ఇదిలావుంటే రెండో దశ మెట్రో విస్తరణ దృష్ట్యా కూడా మెట్రో రైళ్లను పెంచడం అనేది అనివార్యం అవుతుంది. రెండో దశలో ఐదు కారిడార్‌లలో మెట్రో సేవలు అందుబాటులోకి వస్తే ప్రయాణికుల సంఖ్య 15 లక్షలకు పెరుగుతుంది.