Telangana : బీసీ రిజర్వేషన్ బిల్లుపై గవర్నర్ తో అఖిల పక్షం భేటీ
42% బీసీ రిజర్వేషన్ బిల్లును ఆమోదించాలని అఖిలపక్ష నేతలు గవర్నర్ జిష్ణు దేవ్ వర్మను కలిశారు, అసెంబ్లీ ఆమోదాన్ని గుర్తు చేశారు.

Telangana | విధాత, హైదరాబాద్ : 42 శాతం బీసీ రిజర్వేషన్స్ బిల్లును(42% BC Reservation Bills) ఆమోదించాలంటూ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని అఖిల పక్షం సోమవారం రాజ్ భవన్ లో గవర్నర్ జిష్ణు దేవ్ వర్మతో(JIshnu Dev Varma) భేటీ అయ్యారు. మంత్రులు పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar), సీతక్క(Seethakka), ప్రభుత్వ విప్ లు ఆది శ్రీనివాస్…బీర్ల ఐలయ్య, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్(Mahesh Kumar Goud) తో పాటు బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యే కే.పీ.వివేకానంద గౌడ్(BRS MLA K.P.Vivekananda Goud), సీపీఐ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం(CPI MLC Nellikanti Satyam), సీనియర్ నేత కే.నారాయణలు(K. Narayana) అఖిల పక్షం బృందంలో ఉన్నారు. గవర్నర్ తో భేటీ అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ అసెంబ్లీ ఆమోదించిన 42శాతం రిజర్వేషన్ బిల్లును ఆమోదించాలని గవర్నర్ ను కోరడం జరిగిందన్నారు.
గవర్నర్ రాష్ట్రంలోని బీసీ జనాభా వివరాలను అడిగి తెలుసుకున్నారని..బిల్లును డాక్యుమెంట్ మేరకు ఆమోదించాలని తాము కోరడం జరిగిందని వివరించారు. బీసీలకు స్థానిక సంస్థల్లో ఉన్న 50 శాతం నిబంధన ఎత్తివేస్తూ బీసీలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు పెంచుతూ శాసన సభలో ప్రవేశపెట్టిన పంచాయతీరాజ్ సవరణ బిల్లు ఏకగ్రీవ ఆమోదం పొందిందని మూడ్ ఆఫ్ హౌజ్ పరిగణనలోకి తీసుకొని బీసీలకు రిజర్వేషన్ల పెంపు బిల్లు ఆమోదించాలని గవర్నర్ ను కోరినట్లుగా తెలిపారు.