ఉద్యోగ వేటలో మరో ‘బతుకమ్మ’ బలి

  • Publish Date - October 14, 2023 / 06:14 AM IST
  • యువతి ప్రవళిక ఆత్మహత్య
  • పండుగ పూట జిల్లాలో విషాదం


విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: ఉద్యోగం ప్రయత్నాలు ఆ యువతి నిండు ప్రాణాలను బలి తీసుకున్నాయి. ప్రభుత్వ ఉద్యోగం లక్ష్యంగా గ్రూపు ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న యువతీని పరీక్షల లీకేజీ, గ్రూప్ 2 వాయిదాల పర్వం ఆమె ఆత్మహత్యకు కారణమయ్యింది. ఆ బతుకమ్మ అర్ధాంతరంగా ప్రాణాలు తీసుకుంది.


ఎంగిలిపూల బతుకమ్మ పండుగ పూట ఆ ఇంట్లో విషాదం నింపి, కన్న తల్లిదండ్రులకు కడుపు కోత మిగిల్చింది. కాగా, మరో నిరుద్యోగి ప్రాణాలను ప్రభుత్వ నిర్లక్ష్యం బలిగొంది అంటూ విపక్షాలు నిరుద్యోగులు మండిపడుతున్నారు. హైదరాబాద్ అశోక్ నగర్ లో జరిగిన ఈ ఆత్మహత్యకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.



ఆత్మహత్యకు పాల్పడిన ప్రవళిక


వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం బిక్కాజీపల్లికి చెందిన ప్రవళిక హైదరాబాద్ అశోక్ నగర్లో శనివారం ఆత్మహత్య చేసుకున్నది. గ్రూపు 2 పరీక్షల కోసం ప్రైవేట్ హాస్టల్లో ఉంటూ ప్రిపేర్ అవుతున్న ప్రవళిక హాస్టల్ రూమ్ లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడడం సంచలనం సృష్టించింది. ఈ సంఘటనపై నిరుద్యోగులు, రాజకీయ పక్షాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.


కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిరుద్యోగ వ్యతిరేక విధానాలను నిరసిస్తూ రాజకీయ విద్యార్థి ఐక్య కార్యాచరణ సమితి ఒకవైపు ఆదివారం సడక్ బంద్కు పిలుపునిచ్చిన నేపథ్యంలో ప్రవళిక ఆత్మహత్య మరింత చర్చకు దారి తీసింది. ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరిపై నిరుద్యోగుల నిప్పులు కురిపిస్తున్నారు. నిరుద్యోగుల నిరసనపై పోలీసులు లాఠీచార్జికి పాల్పడ్డారని విమర్శిస్తున్నారు.



అమ్మానాన్న నన్ను క్షమించండి


అమ్మానాన్న నన్ను క్షమించండి. నేను చాలా నష్ట జాతకు రాలిని. నా వల్ల మీరు ఎప్పుడూ బాధపడుతూనే ఉన్నారు. మీకు చాలా అన్యాయం చేస్తున్నాను. నన్ను క్షమించండి. కాలు కింద పెట్టకుండా నన్ను పెంచి పెద్ద చేశారు. మీ రుణం తీర్చుకోలేకపోతున్నాను.ఏం చేయలేక పోతున్నా అంటూ ప్రవళిక తన ఆత్మహత్య సందర్భంగా రాసిన లేఖలో ఆవేదన వ్యక్తం చేసింది.


తల్లిదండ్రుల కన్నీరు మున్నీరు


తమ బిడ్డ ఆత్మహత్య చేసుకుందని సమాచారం తెలియగానే తల్లిదండ్రులు హుటాహుటిన హైదరాబాదుకు వెళ్లి విగత జీవిగా ఉన్న బిడ్డని చూసి లింగయ్య దంపతులు మున్నేరుగా విలపించారు. అల్లారు ముద్దుగా పెంచుకున్న బిడ్డ అర్ధాంతరంగా ప్రాణాలు కోల్పోయిందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు.


సర్కారు తమ బిడ్డను బలి తీసుకుంది


ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న తన బిడ్డను ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా బలిగొందని మృతురాలు ప్రవళిక తండ్రి లింగయ్య ఈ సందర్భంగా మాట్లాడుతూ విమర్శించారు. గ్రూప్ పేపర్ లీకేజీ, పరీక్షల వాయిదా కారణంగానే మనస్థాపానికి గురైన నా బిడ్డ ప్రాణాలు తీసుకుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా నిరుద్యోగుల ప్రాణాలు బలికొంటున్న ప్రభుత్వానికి తమ ఉసురు తగులుతుందని శాపనార్ధాలు పెట్టారు.



బిక్కాజీపల్లికి చేరుకున్న మృతదేహం.. పోలీసుల భారీ బందోబస్తు


వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం బిక్కాజి పల్లికి చెందిన ప్రవళిక మృతదేహానికి హైదరాబాదులో పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం స్వగ్రామానికి తరలించారు. ఈ సందర్భంగా గ్రామంలో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ఎలాంటి నిరసనలకు పాల్పడకూడదు అంటూ పోలీసులు ఆంక్షలు విధించారు. అయినప్పటికీ నిరుద్యోగ సంఘాల ప్రతినిధులు, ఓయూ జేఏసీ ప్రతినిధులు, స్థానికులు పెద్ద సంఖ్యలో గ్రామానికి చేరుకున్నారు. ప్రభుత్వ పోలీసు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉద్రిక్త పరిస్థితుల మధ్య అంత్యక్రియలు పూర్తి.