విధాత బ్యూరో, ఉమ్మడి నల్గొండ: కేసీఆర్ పై మోడీ వ్యాఖ్యలు హాస్యాస్పదమని, తెలంగాణ పర్యటనలో ప్రధాని స్థాయిని దిగజార్చుకున్నారని తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి విమర్శించారు. మిర్యాలగూడ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
ప్రధానమంత్రి హోదాలో ఉండి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిపైన, ఆయన కుటుంబ సభ్యులపైన అసత్య ఆరోపణలు చేయడం సిగ్గుచేటన్నారు. తొమ్మిదేళ్లలో రాష్ట్రానికి ఒక్క పైసా ఇవ్వని ప్రధానమంత్రికి తెలంగాణ గడ్డపై మాట్లాడే అర్హ్వత లేదన్నారు. విభజన హామీలను తుంగలో తొక్కిన ఘనుడు మోదీ అని విమర్శించారు.
పార్లమెంట్ లోపల, బయటా తెలంగాణ రాష్ట్రాన్ని అవహేళన చేస్తూ పలుమార్లు ప్రధాన ప్రసంగించడం ఎంతో బాధ కలిగించిందన్నారు. వెంటిలేటర్ పైన ఉన్న బీజేపీని కాపాడుకోవడానికి మోదీ.. కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులపైన ఆరోపణలు చేశారే తప్ప వాస్తవాలు మాట్లాడలేదన్నారు.
అవినీతిపరులు నా పక్కన కూర్చోవడానికి బయపడుతారని చెప్పే ప్రధాని, ఈడీ, సీబీఐ ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని బీజేపీలో ఎందుకు చేర్చుకుంటున్నారని ప్రశ్నించారు. కేటీఆర్ ని ముఖ్యమంత్రి చేయాలి అంటే మోడీ ఆశీర్వాదం అవసరం లేదని చెప్పారు.
కేటీఆర్ ప్రజల్లో గొప్ప అభిమానాన్ని సాధించుకున్న నాయకుడని, ఆయన భవిష్యత్ లో తప్పకుండా ముఖ్యమంత్రి అవుతారని, సందేహం అవసరం లేదన్నారు. రాజకీయ లబ్ధికోసం తప్పుడు ఆరోపణలు చేయడం సబబు కాదన్నారు. ప్రధానమంత్రి మోదీ ఒక నియంతలా ఆలోచిస్తున్నారని, కక్ష్యపూరితంగా వ్యవహరించడం సరికాదన్నారు.