సిరుల సింగరేణిని..స్కామ్ ల గనిగా మార్చారు: కాంగ్రెస్ పై హరీశ్ రావు ఫైర్

సింగరేణిని కాంగ్రెస్ ప్రభుత్వం స్కామ్‌ల గనిగా మార్చిందని హరీశ్‌రావు ఆరోపించారు. 40 లక్షల టన్నుల బొగ్గు, రూ.1600 కోట్లపై ప్రశ్నలు లేవనెత్తారు.

విధాత, హైదరాబాద్ : సిరుల సింగరేణి బొగ్గుగనిని కాంగ్రెస్ ప్రభుత్వం స్కామ్ ల గనిగా మార్చిందని బీఆర్ఎస్ మాజీ మంత్రి టి.హరీశ్ రావు ఆరోపించారు. తెలంగాణ బొగ్గు గని కార్మికుల సంఘం సమావేశంలో మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడారు. సింగరేణిలో కాంగ్రెస్ హయాంల మరో బొగ్గు కుంభకోణం వెలుగు చూసిందని, అధికారిక లెక్కల మేరకు సింగరేణిలో 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేసి.. బాయిల మీద స్టాక్ ఉందని సింగరేణి చూపిస్తుందని వెల్లడించారు. ఈ బొగ్గుపై తమకు ఆదాయం వచ్చిందని చూపి టన్నుకు రూ.4250చొప్పున ఆదాయం వచ్చిందని చెప్పి దీనిపై ఇన్‌కమ్ ట్యాక్స్ కట్టారని, కేంద్ర, రాష్ట్రాలకు డివిడెంట్ కట్టారని, కోల్ సెస్ సహా, డీఎంఎఫ్టీ(DMFT) డబ్బులు కూడా ఇచ్చినట్లు రికార్డ్ చూపిస్తున్నారని తెలిపారు. మరి ఇప్పుడు ఈ 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు ఎక్కడికి పోయిందని, దాని విలువ రూ.1600కోట్లు ఎక్కడికి పోయాయని హరీశ్ రావు నిలదీశారు.

రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి నుండి బొగ్గు, కరెంట్ తీసుకుంటూ..డబ్బులు చెల్లించకుండా కాంగ్రెస్ ప్రభుత్వం బకాయిలు పెట్టిందని హరీశ్ రావు ఆరోపించారు. రెండున్నరేళ్లలో బొగ్గుకు సంబంధించిన బకాయిలు 14 వేల కోట్ల రూపాయలు ఉన్నాయి.. కరెంట్‌వి 20 వేల కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయని తెలిపారు.

రాజస్థాన్ – పాక్ సరిహద్దుల్లో పవర్ ఫ్లాంట్ తో కాంగ్రెస్ మరో స్కామ్

పాకిస్తాన్ సరిహద్దులోని జైసల్మేర్‌లో తెలంగాణ ప్రభుత్వం సోలార్ పవర్ ప్లాంట్ కడుతుందని, రాజస్థాన్ రాష్ట్రంతో పవర్ ప్లాంట్ కట్టేందుకు తెలంగాణ ఒప్పందం చేసుకుందని, పాకిస్తాన్ సరిహద్దులో కేంద్రప్రభుత్వం కూడా పెట్టదని.. మరి తెలంగాణ ప్రభుత్వం ఎందుకు పెడుతుంది? అని హరీశ్ రావు ప్రశ్నించారు. ఇప్పుడు సింగరేణి దగ్గర పైసలు కూడా లేవు అని..మరి అక్కడ సోలార్ పవర్ ప్లాంట్ ఎవరి లాభం కోసం కడుతున్నారు? అని హరీశ్ రావు ప్రశ్నించారు. డీపీఆర్ లేకుండానే సివిల్ వర్క్స్ మొదలుపెట్టి ఇప్పుడు అప్పు రాక పనులు ఆపేశారు అని, ఏడాదిన్నరగా పనులు ఆగిపోవడం వల్ల సింగరేణికి రూ.800 కోట్ల నష్టం వచ్చిందన్నారు. రాజస్థాన్ పైసలు పెట్టదట కానీ పాకిస్తాన్ సరిహద్దులో సింగరేణి సోలార్ పవర్ ప్లాంట్ పెట్టేందుకు భూమి ఇస్తుందట అని, దీని వెనుక ఉన్న కుట్ర అంతా బయటపెడతామని హరీశ్ రావు తెలిపారు.

బీఆర్ఎస్ హయాంలో రూ.3వేల కోట్ల డిపాజిట్…కాంగ్రెస్ పాలనలో రూ.4వేల ఓడీ

కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణిని ఓడీల(ఓవర్ డ్రాఫ్ట్)వైపు నెట్టేసిందని, మొత్తం తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఓడీ లిమిట్ రూ.3,200 కోట్లు అయితే..కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణిని రూ.4,000 కోట్ల ఓడీలోకి నెట్టేసిందని హరీశ్ రావు ఆరోపించారు. కార్మికులకు జీతాలు ఇవ్వాలన్నా ఓడి తెచ్చే పరిస్థితి వచ్చిందని, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు సింగరేణికి రూ.3,000 కోట్లు బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ ఉండేది, కానీ ఇప్పుడు రూ.4,000 ఓడీ ఉందని హరీశ్ రావు విమర్శించారు. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణిని ఎంత దిగజార్చిందో అర్థం అవుతుందన్నారు.

ఎస్సీ, ఎస్టీలను మోసం చేసిన కాంగ్రెస్

చేవెళ్ల డిక్లరేషన్ పేరుతో ఎస్సీ, ఎస్టీలను కాంగ్రెస్ దగా చేసిందని హరీశ్ రావు విమర్శించారు. ఇందిరాపార్క్ వద్ద నిర్వహించిన లంబాడీ హక్కుల పోరాట సమితి ధర్నా కార్యక్రమంలో హరీశ్ రావు మాట్లాడారు. పోడు భూములకు పట్టాలు ఇస్తామని రేవంత్ రెడ్డి మోసం చేశాడని, 50వేల ఎకరాల ఎస్సీ, ఎస్టీ భూములను గుంజుకున్న దుర్మార్గ ప్రభుత్వం ఇది అని మండిపడ్డారు. తిరగబడిన లంబాడీ బిడ్డలకు బేడీలు వేసి జైళ్లకు పంపారని, కొడంగల్ లంబాడి బిడ్డలు రేవంత్ రెడ్డికి రాజకీయ సమాధి కడుతారన్నారు. ఎస్సీ, ఎస్టీలకు కార్పొరేషన్ల పేరిట మోసం చేయడం తప్ప, రూపాయి ఇచ్చింది లేదు అని, ఇందిరా పార్క్ నుంచి మొదలైన పోరాటం ప్రతి తండాకు చేరాలన్నారు. చేవెళ్ల డిక్లరేషన్ అమలు చేయకుంటే ఢిల్లీ వెళ్లి ఖర్గే ఇంటి ముందు ధర్నా చేస్తాం అని తెలిపారు.

ఇవి కూడా చదవండి :

హైడ్రా ఆపరేషన్..కోకాపేట కొత్త చెరువులో ఆక్ర‌మ‌ణ‌ల తొల‌గింపు
గవర్నర్‌ను కలిసిన టీఆర్ఎస్ అధ్యక్షురాలు కవిత

Latest News