ఎస్సీ, ఎస్టీల హామీల అమలులో కాంగ్రెస్ మొండి చెయ్యి : హరీశ్ రావు

ఎస్సీ, ఎస్టీల హామీల అమలులో కాంగ్రెస్ విఫలమైందని హరీశ్ రావు విమర్శించారు. కొడంగల్‌లో రేవంత్ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు.

ఎస్సీ, ఎస్టీల హామీల అమలులో కాంగ్రెస్ మొండి చెయ్యి : హరీశ్ రావు

విధాత : ఎస్సీ, ఎస్టీలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన డిక్లరేషన్, ఎన్నికల హామీలు ఘనంగా ఉండగా..ఆచరణ శూన్యమైందని బీఆర్ఎస్ మాజీ మంత్రి టి.హరీశ్ రావు విమర్శించారు. శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్ నియోజకవర్గంలో నిర్వహించిన బావోజీ జాతరకు ఆయన హాజరయ్యారు. హరీశ్ రావుకు బీఆర్ఎస్ శ్రేణులు ఘన స్వాగం పలికాయి. జాతర అనంతరం హరీశ్ రావు మీడియాతో మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీలకు కాంగ్రెస్ చేసింది గుండు సున్నాఅని, ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ మూలపడేశారని, సబ్ ప్లాన్ నిధులు మళ్లించారని విమర్శించారు. లంబాడీలకు ఒక్క మంత్రి పదవి కూడా ఇవ్వలేదని అన్నారు.
ఎస్టీలకు బడ్జెట్లో 2,730 కోట్లు పెట్టి కేవలం 50 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు అని ఆరోపించారు. కార్పోరేషన్లు కాగితాలకే పరిమితమయ్యాయని, వంద రోజుల్లో రెండో విడత గొర్రెల పథకం అని చెప్పి నేటికి పంపిణీ చేయలేదన్నారు. ఈరోజు వరకు లంబాడీలకు కాంగ్రెస్ పార్టీ మంత్రి పదవి ఇవ్వలేదు అని విమర్శించారు.

ఎస్సీ, ఎస్టీలకు కేసీఆర్ పెద్దపీట

ఎస్సీ, ఎస్టీలకు కేసీఆర్ పెద్దపీట వేశారని, దళిత బంధు పథకాలు అమలు చేశారని, లంబాడీలకు 6% ఉన్న రిజర్వేషన్‌ను 10%కు పెంచారు అని హరీశ్ రావు గుర్తు చేశారు. గత తెలుగుదేశం ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఎవరూ లంబాడీలను పట్టించుకోలేదు అన్నారు. కేసీఆర్ 3,100 గిరిజన గూడాలను, లంబాడీ తండాలను గ్రామపంచాయతీలుగా చేశారని గుర్తు చేశారు. 6 లక్షల పోడు భూములకు పట్టాలు ఇచ్చి రైతుబందు, రైతుభీమా ఇచ్చిన ప్రభుత్వం కూడా కేసీఆర్ దే అన్నారు. గిరిజనుల అభివృద్ధి కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతగానో కృషి చేసిందని తెలిపారు. మార్కెట్ కమిటీ రిజర్వేషన్ ఇచ్చామని, వైన్ షాప్ రిజర్వేషన్ ఇచ్చామని, వందల, వేల కోట్ల రూపాయలు సహకారం అందించామని గుర్తు చేశారు.

బీఆర్ఎస్ హయాంలో బావోజీ జాతరకు వాగు దాటి పోకుండా పట్నం నరేందర్ రెడ్డి రూ.80 లక్షల రూపాయలతో బ్రిడ్జి వేయించి ఆలయాన్ని అభివృద్ధి చేశాడని, బంజారా భవన్ కూడా నిర్మించారు అని గుర్తు చేశారు.

కూట్ల రాయి తీయనోడు ఏట్ల రాయి తీస్తడట!

కేరళం అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రచారం కూట్ల రాయి తీయనోడు ఏట్ల రాయి తీస్తడట అన్నట్లుగా ఉందని హరీశ్ రావు ఎద్దేవా చేశారు. ఇంట్లో ఈగల మోత ఉంటే.. రేవంత్ కేరళకి పోయి పల్లకిలు మోస్తుండు అన్నారు. ఇక్కడ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అమలు కాలేదు కానీ, కేరళకు పోయి ఏమో చేశానని బిల్డప్పులు ఇస్తున్నాడని విమర్శించారు. కాంగ్రెస్ ఇచ్చిన ఎన్నికల హామీల అమలు వైఫల్యంపై నిన్న జరిగిన గ్రామ సభల్లో కాంగ్రెస్ నాయకుల మీద ప్రజలు తిరగబడ్డారని అన్నారు. రేవంత్ రైతు రుణమాఫీ అసంపూర్తిగా మిగిలిపోయిందని, కొడంగల్‌కి పోదాం అని..ఒక్క ఊర్లో అయినా 100% రుణమాఫీ అయ్యిందో లేదో చూద్దాం రా అని రేవంత్ రెడ్డికి సవాల్ చేశారు.

ఇవి కూడా చదవండి :

Virosh | ర‌ష్మిక పోస్ట్‌తో అంద‌రిలో అనేక ఆలోచ‌న‌లు.. గుడ్ న్యూస్ చెప్ప‌బోతుందా అంటూ కామెంట్స్
పాతబస్తీలో సర్ అయినా…ఎంఐఎం చేతుల్లోనే..!