బీఆర్ఎస్ లో జీవన్ రెడ్డి చేరికకు ముహూర్తం ఖరారు !
కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన జీవన్ రెడ్డి ఈ నెల 13న బీఆర్ఎస్‌లో చేరనున్నారు. ఉత్తర తెలంగాణ రాజకీయాల్లో ఈ చేరిక హాట్‌టాపిక్‌గా మారింది.
విధాత, హైదరాబాద్ : ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి, తాటిపర్తి జీవన్ రెడ్డి త్వరలో కారు పార్టీ బీఆర్ఎస్ లో చేరబోతున్నట్లుగా సమాచారం. కాంగ్రెస్ పార్టీతో 42ఏళ్ల సుధీర్ఘ బంధాన్ని తెంచుకున్న జీవన్ రెడ్డి ఈ నెల 25వ తేదీన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. అనంతరం ఆయన తన రాజకీయ భవిష్యత్తు ప్రణాళికల కోసం వరుసగా జగిత్యాల, కరీంనగర్ నియోజవర్గాలలోని గ్రామాల్లో తన అనుచరులు, అభిమానులతో సమావేశాలు కొనసాగిస్తూ వస్తున్నారు. ఈ సందర్బంగా కాంగ్రెస్ కు రాజీనామా చేయాల్సిన పరిస్థితులు, పార్టీ మార్పుపై కేడర్ తో పాటు ప్రజాభిప్రాయాలను తెలుసుకున్నారు. చివరగా రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ కు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుస్తుందని…పార్టీ తరపున తను లేదా తన కొడలు ఛరిస్మారెడ్డి ఎన్నికల బరిలోకి దిగాలని జీవన్ రెడ్డి భావిస్తున్నట్లుగా అనుచర వర్గాల కథనం. జీవన్ రెడ్డికి బీఆర్ఎస్ నాయకత్వం పార్టీ సెక్రటరీ జనరల్ పదవితో పాటు ఆయన కోడలికి అసెంబ్లీ టిక్కెట్ ఆఫర్ చేసినట్లుగా ప్రచారం సాగుతుంది.
13న బీఆర్ఎస్ లోకి జీవన్ రెడ్డి
జీవన్ రెడ్డి ఈ నెల 13న బీఆర్ఎస్ లో చేరబోతున్నట్లుగా అనుచర వర్గాలు వెల్లడిస్తున్నాయి. అమెరికా పర్యటనలో ఉన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాష్ట్రానికి తిరిగి రాగానే.. ఏప్రిల్ 7వ తేదీన నేరుగా జీవన్ రెడ్డి నివాసానికి వెళ్లి ఆయననుపార్టీలోకి ఆహ్వానించనున్నారు. ఏప్రిల్ 13వ తేదీన జరిగే సభలో జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నట్లు సమాచారం. అనంతరం జగిత్యాలలోనే బీఆర్ఎస్ పార్టీ భారీ ప్లీనరీ మీటింగ్ నిర్వహించాలని బీఆర్ఎస్ నాయకత్వం నిర్ణయించింది. పార్టీ ప్లీనరీ నిర్వహణతో రాజకీయంగా జీవన్ రెడ్డితో పాటు వలసలతో బలహీనపడిన పార్టీకి కొత్త ఊఫు తేవాలని బీఆర్ఎస్ యోచిస్తుంది.
కుటుంబ పార్టీలో మనుగడ సాగించేనా..?
అంతర్గత ప్రజాస్వామ్యం అధికంగా ఉండే కాంగ్రెస్ పార్టీలో నాలుగు దశాబ్దాలకు పైగా స్వేఛ్చాయుత రాజకీయాలు సాగించిన సీనియర్ నేత జీవన్ రెడ్డి కల్వకుంట్ల కుటుంబ ఆధిపత్యంలోని ప్రాంతీయ పార్టీలో ఎంతమేరకు మనుగడ సాగిస్తారన్నది ప్రశ్నార్ధకంగా మారింది. జీవన్ రెడ్డి తన జిల్లా రాజకీయాల్లో ఆధిపత్యం సాధించే క్రమంలో బీఆర్ఎస్ మాత్రమే తన ఆప్షన్ గా భావిస్తున్నారు. అయితే కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు, సంతోష్ రావు ల ఆధిపత్యంలో కొనసాగే బీఆర్ఎస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం నేతి బీరకాయ నెయ్యి చందమేనన్నది బహిరంగ రహస్యమే. గతంలో ఆలే నరేంద్ర, విజయశాంతి, కపిలావాయి దిలీప్ కుమార్, కోదండరామ్, జిట్టా బాలకృష్ణారెడ్డి, యెన్నం శ్రీనివాస్ రెడ్డి, పేర్వారం రాములు, మాజీ మంత్రి చంద్రశేఖర్, విజయరామారావు, మందడి సత్యనారాయణరెడ్డి, రాములు నాయక్, పట్నం మహేందర్ రెడ్డి, ఇతర పార్టీలో ఉన్నత స్థానాల్లో ఉండి బీఆర్ఎస్ లో చేరిన మోత్కుపల్లి నరసింహులు, డి.శ్రీనివాస్, కే.కేశవరావు, కడియం శ్రీహరి, దానం నాగేందర్, జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖ, తుమ్మల నాగేశ్వర్ రావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి , వివేక్ వెంకటస్వామి వంటి బడా నేతలు కేసీఆర్ తో విభేదించి ఆ పార్టీ నుంచి నిష్క్రమించారు.
బీఆర్ఎస్ నుంచి వారి నిష్క్రమణ చూస్తే..జీవన్ రెడ్డి వంటి వారు బీఆర్ఎస్ లో మనుగడ సాగించడం అంత సులభతరం కాదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఉమ్మడి రాజకీయ ప్రత్యర్థి సీఎం రేవంత్ రెడ్డిని ఎదుర్కోవడంలో బీఆర్ఎస్ కు జీవన్ రెడ్డి ఎంత అవసరమో..అదే స్థాయిలో జీవన్ రెడ్డికి బీఆర్ఎస్ కూడా రాజకీయ ప్రత్యామ్నాయంగా మిగిలింది. ఈ క్రమంలో ఉత్తర తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీలను ఎదుర్కోవడంలో బీఆర్ఎస్ కు జీవన్ రెడ్డి ఎంతోకొంత బలంగా మారవచ్చని కారు పార్టీ ఆశలు పెట్టుకుంది.
ఇవి కూడా చదవండి :
టెక్స్ టైల్ రాజధానిగా తెలంగాణ : సీఎం రేవంత్ రెడ్డి
పాతబస్తీలో సర్ అయినా…ఎంఐఎం చేతుల్లోనే..!
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram