Heat Wave | తెలంగాణ వ్యాప్తంగా వేడిగాలుల తీవ్రత కొనసాగుతూనే ఉంది. రాబోయే నాలుగు రోజులు కూడా తీవ్రమైన వేడిగాలులు కొనసాగుతాయని, పగటి ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీల సెల్సియస్ వరకు పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది.
ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాల్లో 41 నుంచి 44 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది వాతావరణ శాఖ. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్, యాదాద్రి జిల్లాల్లో ప్రస్తుతం 36 నుంచి 40 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. శుక్ర, శనివారం నాటికి 41 నుంచి 44 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకునే అవకాశం ఉంది.
అయితే బుధవారం కొత్తగూడెం, ఖమ్మం, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని, రైతులు తమ పంటల విషయంలో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. ఈ వర్షాల వల్ల తక్షణ ఉపశమనం లభించినప్పటికీ, వేడి తీవ్రత కొనసాగనుంది.
