Heat Wave | రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు దంచికొడుతున్నాయి. మండుటెండలకు జనాలు విలవిలలాడిపోతున్నారు. ఉదయం 8 గంటల నుంచే సూర్యుడు భగభగ మండిపోతున్నాడు. దీంతో జనాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. హైదరాబాద్ నగరంతో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదై జనాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. మరో మూడు రోజుల పాటు ఉష్ణోగ్రతలు మరింత పెరిగే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వైద్యారోగ్య శాఖ అప్రమత్తమైంది.
ఎండలు ముదురుతున్న నేపథ్యంలో వడదెబ్బ కొట్టే అవకాశం ఉందన్నారు. ఈ క్రమంలో వడదెబ్బ బాధితులకు వైద్యం అందించేందుకు అన్ని ఆస్పత్రుల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. ‘‘భారీ ఉష్ణోగ్రతల వల్ల డీహైడ్రేషన్, వడదెబ్బ కేసులు పెరిగే అవకాశముంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పడకలు, ఐవీ ఫ్లూయిడ్స్, అవసరమైన మందులు సిద్ధం చేసుకోవాలి. గ్రామస్థాయిలో ఏఎన్‌ఎం, ఆశా, అంగన్‌వాడీ సిబ్బంది ద్వారా ఓఆర్‌ఎస్ పంపిణీ కార్యక్రమాన్ని ముమ్మరం చేయాలి. ప్రజలు కూడా మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల మధ్య బయటకు వెళ్లకూడదు. తగినంత నీరు, ఓఆర్‌ఎస్, మజ్జిగ, నిమ్మరసం తీసుకోవాలి. బయటికి వెళ్లేటప్పుడు తలకు టోపీ, తువ్వాలు వంటివి ధరించాలి. మసాలా, ఆయిల్ ఫుడ్ తినడం తగ్గించాలి. వడదెబ్బ లక్షణాలు గుర్తించి ముందస్తు చర్యలు తీసుకోవాలి. శరీర ఉష్ణోగ్రత ఎక్కువగా పెరగడం, తల తిరగడం, వాంతులు, గుండె వేగంగా కొట్టుకోవడం, అపస్మారక స్థితికి చేరుకోవడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాలి’ వైద్యారోగ్య శాఖ సూచించింది.
