రెండు రోజుల్లో తెలంగాణకు నైరుతి.. ఇవాళ ఈ జిల్లాలకు భారీ వర్ష సూచన..!
సోమ, మంగళవారాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఈ నెల 6వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వానలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ మేరకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

హైదరాబాద్ : నైరుతి రుతుపవనాలు ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూల్ జిల్లా వరకు విస్తరించాయని, ఒకట్రెండు రోజుల్లో తెలంగాణలోకి ప్రవేశిస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ అంచనా వేసింది. నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం నైరుతి బంగాళాఖాతంతో పాటు కోస్తాంధ్ర, ఉత్తర తమిళనాడు తీరాలకు సమీపంలో కొనసాగుతోందని, ఈ ప్రభావంతోనూ తెలంగాణలో వర్షాలు కురుస్తాయని తెలిపింది.
ఈ క్రమంలో సోమ, మంగళవారాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఈ నెల 6వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వానలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ మేరకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇక సోమవారం ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాలతో పాటు హైదరాబాద్, మహబూబాబాద్ జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు, మిగిలిన జిల్లాల్లో ఈదురు గాలులతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. మంగళవారం ఉమ్మడి రంగారెడ్డి, మెదక్, మహబూబ్‌నగర్, హైదరాబాద్ జిల్లాల్లో భారీ, ఇతర జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.