Heavy Rains | తెలంగాణలో మ‌రో ఐదు రోజులు భారీ నుంచి అతి భారీ వ‌ర్షాలు.. జ‌ర జాగ్ర‌త్త‌..!

Heavy Rains | హైద‌రాబాద్ : తెలంగాణ‌( Telangana )ను వాన‌లు( Rains ) ముంచెత్తుతున్నాయి. అప్పుడే వానాకాలం( Monsoon ) వ‌చ్చిందా..? అన్న రీతిలో కుండ‌పోత వర్షాలు( Heavy Rains )కురుస్తున్నాయి. అకాల‌ వ‌ర్షాల‌తో రైతులు ఆందోళ‌న‌కు గుర‌వుతున్నారు. వ‌రి ధాన్యం( Paddy ) నీటి పాలై.. రైత‌న్న‌కు తీవ్ర విషాదాన్ని మిగిల్చుతుంది. ఇప్ప‌టికే కుండ‌పోత వ‌ర్షాల‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్న రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు.. వాతావ‌ర‌ణ శాఖ( Weather Department ) బిగ్ అల‌ర్ట్ ప్ర‌క‌టించింది.

Heavy Rains | తెలంగాణలో మ‌రో ఐదు రోజులు భారీ నుంచి అతి భారీ వ‌ర్షాలు.. జ‌ర జాగ్ర‌త్త‌..!

 

ద్రోణి ప్ర‌భావంతో తెలంగాణలో రాగల ఐదు రోజులు భారీ నుంచి అతి భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఉత్తర కర్నాటక – గోవా తీరాల వెంబడి తూర్పు మధ్య అరేబియా సముద్రంపై నున్న ఉపరితల ఆవర్తం నుంచి కోస్తాంధ్ర వరకు ద్రోణి సగటు సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉందని.. ఆంధ్రప్రదేశ్‌ మధ్య ప్రాంతాలు, పరిసరాలను ఆనుకొని ఉన్న దక్షిణ తెలంగాణపై ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 3.1 కిలో మీటర్ల విస్తరించి ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ క్ర‌మంలో రైతులు, ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని సూచించింది. వృద్ధులు, పిల్ల‌లు అత్య‌వ‌ర‌మైతేనే బ‌య‌ట‌కు వెళ్లాల‌ని సూచించింది.

ఇక బుధ‌వారం కురిసిన భారీ వ‌ర్షానికి తెలంగాణ త‌డిసి ముద్దైంది. మెద‌క్ జిల్లాలోని ఆర్డీవో ఆఫీసు వ‌ద్ద‌ అత్య‌ధికంగా 119.3 మి.మీ. వ‌ర్ష‌పాతం న‌మోదైంది. మ‌సాయిపేట‌లో 112 మి.మీ. వ‌ర్షపాతం న‌మోదైన‌ట్లు వాతావ‌ర‌ణ శాఖ అధికారులు వెల్ల‌డించారు. ఆ త‌ర్వాత మంచిర్యాల జిల్లాలోని జ‌న్నారంలో 99.8 మి.మీ., హైద‌రాబాద్‌లోని బండ్ల‌గూడ‌లో 98.8 మి.మీ. వ‌ర్ష‌పాతం న‌మోదైంది.

గురువారం కరీంనగర్‌, పెద్దపల్లి, జయశంకర్‌, భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్‌, వరంగల్‌, హన్మకొండ, జనగాం జిల్లాల్లో అక్కడక్కడ భారీ వానలు పడుతాయని తెలిపింది. కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి, మహబూబ్‌ నగర్‌, నాగర్‌ కర్నూల్‌, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని చెప్పింది. అలాగే, శుక్ర, శని, ఆదివారాల్లోనూ హైదరాబాద్‌ సహా ఉత్తర, దక్షిణ తెలంగాణ లోని పలు ప్రాంతాల్లో వానలు పడుతాయని వాతావరణ శాఖ వెల్ల‌డించింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ని జారీ చేసింది.